Shraddha Das: చచ్చేంత పనైంది.. చెప్పేందుకు మాటలు సరిపోవడం లేదు: శ్రద్ధా దాస్
Shraddha Das: తనకు ఎదురైన భయానక అనుభవాన్ని టాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా దాస్ వెల్లడించారు. దాదాపు తాము చనిపోయేంత పనైందని తెలిపారు. ఈ మేరకు ఆమె ట్వీట్ చేశారు.
Shraddha Das: ముంబై నుంచి హైదరాబాద్‌కు రావాల్సిన ఓ విమానంలో శనివారం సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దీంతో టేకాఫ్ అయిన 30 నిమిషాల్లోనే ఆ ఫ్లైట్ తిరిగి ముంబై విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. అయితే, ఆ సమయంలో ఆ విమానంలో తీవ్ర గందరగోళం ఏర్పడింది. కూర్చునేందుకు కూడా ప్రయాణికులకు ఇబ్బంది ఎదురైంది. ఆ విస్తారా విమానంలోనే టాలీవుడ్ హీరోయిన్లు రష్మిక మందన్నా, శ్రద్ధా దాస్ ప్రయాణించారు. తాము చావు నుంచి తప్పించుకున్నామని రష్మిక ఇప్పటికే ఇన్స్టాగ్రామ్ స్టోరీ పెట్టారు. కాగా, శ్రద్ధా దాస్ కూడా ఈ భయానక అనుభవం గురించి ట్వీట్ చేశారు.
తాము నిన్న (శనివారం) దాదాపు చనిపోయామని, దాన్ని వివరించేందుకు మాటలు కూడా సరిపోవడం లేదని శ్రద్ధా ట్వీట్ చేశారు. అయితే, ఇలాంటి సమస్యల గురించి విస్తారా పట్టించుకోవాలని సూచించారు. ప్రస్తుతం తాము సేఫ్‌గా ఉన్నామని తెలిపారు.
“ఒకవేళ సాంకేతిక లోపాలు ఉంటే ఒకటి కంటే ఎక్కువసార్లు విమానాలను విస్తారా చెక్ చేసుకోవాలి. మేం నిన్న దాదాపు చనిపోయినంత పనైంది. దాన్ని వివరించేందుకు నాకు మాటలు కూడా సరిపోవడం లేదు. సరైన సమయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసి పైలెట్ సరైన నిర్ణయం తీసుకున్నారు” అని శ్రద్ధా దాస్ ట్వీట్ చేశారు.
“విమానంలో ఎప్పుడైనా 100 మందికిపైగానే ఉంటారు. ఒకానొక బెస్ట్‌గా ఉంటుందని విస్తారాకు పేరుంది. ఈ విషయాన్ని పరిశీలించండి. మేం ఇప్పుడు సురక్షితంగానే ఉన్నాం. కానీ ఎప్పుడో ఒకసారి దారుణం జరగొచ్చు” అని శ్రద్ధా మరో ట్వీట్ చేశారు.
రష్మిక కూడా..
ఆ విమానంలో శ్రద్ధా దాస్ పక్కనే స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా కూడా ఉన్నారు. తాము ఇలా మరణం నుంచి బయటపడ్డామంటూ ఇన్స్టాగ్రామ్ స్టోరీ పోస్ట్ చేశారు రష్మిక. శద్ధాతో దిగిన సెల్ఫీని కూడా పోస్ట్ చేశారు.
సాంకేతిక లోపం వల్లే ఆ విమానాన్ని ముంబైలో అత్యవసర ల్యాండింగ్ చేశామని విస్తారా విమానయాన సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. తాము అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పారు. కాగా, ప్రయాణికులకు వేరే విమానంలో ప్రయాణ ఏర్పాట్లు చేశామని కూడా వెల్లడించారు.
సినిమాల విషయానికి వస్తే.. రష్మిక మందన్నా హీరోయిన్గా నటించిన యానిమల్ సినిమా గతేడాది బ్లాక్బాస్టర్ హిట్ అయింది. ప్రస్తుతం అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న ‘పుష్ప 2: ది రూల్’ మూవీ చేస్తున్నారు రష్మిక. సూపర్ హిట్ అయిన పుష్పకు సీక్వెల్‌గా ఈ చిత్రం వస్తోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న పుష్ప 2 ఈ ఏడాది ఆగస్టు 15వ తేదీన రిలీజ్ కానుందని మూవీ టీమ్ ఇప్పటికే వెల్లడించింది. రెయిన్బో, ది గర్ల్ ఫ్రెండ్ సినిమాలు కూడా రష్మిక లైనప్‌లో ఉన్నాయి.
2008లో సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం చిత్రంతో తెరంగేట్రం చేశారు శ్రద్ధా దాస్. వివిధ భాషల్లో సినిమాలు చేస్తున్నారు. కొన్ని చిత్రాల్లో హీరోయిన్గా చేసినా.. ఎక్కువ చిత్రాల్లో సపోర్టింగ్ క్యారెక్టర్లు చేస్తూ వస్తున్నారు. ప్రస్తుతం తెలుగులో అర్ధం అనే చిత్రంలో శ్రద్ధ నటిస్తున్నారు.