Pushpa 2 New Year Poster: పుష్ప 2 నుంచి న్యూఇయర్ పోస్టర్.. నిరాశ వ్యక్తం చేస్తున్న ఫ్యాన్స్
Pushpa 2: The Rule - New Year 2024 Poster: న్యూఇయర్ సందర్భంగా పుష్ప 2: ది రూల్ మూవీ యూనిట్ కొత్త పోస్టర్ రిలీజ్ చేసింది. అయితే, దీనిపై అల్లు అర్జున్ అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వివరాలివే..
Pushpa 2: The Rule - New Year 2024 Poster: దేశవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఎక్కువగా ఎదురుచూస్తున్న సినిమాల లిస్టులో ముందు వరుసలో ఉంది పుష్ప 2: ది రూల్. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంపై ఆ స్థాయిలో క్రేజ్ ఉంది. 2021లో వచ్చి పాన్ ఇండియా రేంజ్‍లో సెన్సేషనల్ హిట్ కొట్టింది పుష్ప. ఈ చిత్రానికి సీక్సెల్‍గా ప్రస్తుతం పుష్ప 2: ది రైజ్ రూపొందుతోంది. ఈ ఏడాది (2024) ఆగస్టు 15న ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తామని కూడా మూవీ యూనిట్ ఇప్పటికే ప్రకటించింది. అయితే, నేడు (జనవరి 1) కొత్త సంవత్సరం రోజు ఓ పోస్టర్ రిలీజ్ చేసింది పుష్ప 2 మేకర్స్.
నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలుపుతూ పుష్ప 2: ది రూల్ మూవీ యూనిట్ నేడు ఓ పోస్ట్ రిలీజ్ చేసింది. రిలీజ్ డేట్ ప్రకటించినప్పటి పోస్టర్‌కే కాస్త కలర్ మార్పులు చేసి తీసుకొచ్చింది. 2024రూల్ పుష్ప కా (#2024RulePushpaKa) అంటూ కొత్త హ్యాష్ ట్యాగ్‍ను లాంచ్ చేసింది. 2024 సంవత్సరాన్ని ఏలేది పుష్పనే అన్నట్టుగా దీని అర్థం ఉంది. రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్‍లో ఉన్న అల్లు అర్జున్ చేయి పోస్టరే ఇప్పుడూ వచ్చింది.
అభిమానుల అసంతృప్తి
కొత్త సంవత్సరం వేడుక సందర్భంగా పుష్ప 2: ది రూల్ సినిమా నుంచి అల్లు అర్జున్ కొత్త పోస్టర్ వస్తుందని అభిమానులు ఆశించారు. దీని కోసం ఆశగా ఎదురుచూశారు. అయితే, పాత పోస్టర్‌కే కాస్త రంగులు మార్చి వదిలింది మూవీ యూనిట్. దీంతో.. అల్లు అర్జున్ ఉన్న కొత్త పోస్టర్ రిలీజ్ చేస్తే ఏమవుతుంది అంటూ మేకర్స్‌పై కొందరు అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కొత్త పోస్టర్ కోసం ఎంతో వేచిచూశామని, చాలా నిరాశగా ఉందని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.
కొత్త పోస్టర్ రిలీజ్ చేస్తే వచ్చే నష్టమేంటి.. ఇలా ఎందుకు చేస్తున్నారంటూ పుష్ప టీమ్‍ను ఓ నెటిజన్ ప్రశ్నించారు. మరికొందరేమో అప్‍డేట్ ఏమైనా వస్తుందేమోనని ఆశించామని పోస్టులు పెడుతున్నారు.
పుష్ప 2: ది రూల్ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహిస్తుండగా.. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, రవిశంకర్ నిర్మిస్తున్నారు. దేవీ శ్రీప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న హీరోయిన్‍గా చేస్తుండగా.. ఫాహద్ ఫాజిల్, జగపతి బాబు, ప్రకాశ్ రాజ్, సునీల్, అనసూయ భరద్వాజ్ కీలకపాత్రలు పోషిస్తున్నారు.
హైదరాబాద్ చేరుకున్న బన్నీ
న్యూఇయర్ సెలెబ్రేషన్ కోసం వెకేషన్ కోసం విదేశాలకు వెళ్లిన అల్లు అర్జున్ నేడు భారత్‍కు తిరిగి వచ్చేశారు. హైదరాబాద్ ఎయిర్ పోర్టులో బన్నీ నేడు కనిపించారు. మళ్లీ ఆయన పుష్ప 2 షూటింగ్‍లో పాల్గొననున్నారు.
తనకు 2023 ఎన్నో అందమైన ముఖ్యమైన పాఠాలను నేర్పించిందని, ఈ అందమైన ప్రయాణంలో భాగమైన ప్రతీ ఒక్కరి థ్యాంక్స్ అంటూ న్యూఇయర్ విషెస్‍ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు అల్లు అర్జున్. పుష్పకు గాను జాతీయ ఉత్తమ నటుడి అవార్డును ఈ ఏడాదే అందుకున్నారు అల్లు అర్జున్. జాతీయ ఉత్తమ నటుడి పురస్కారం దక్కించుకున్న తొలి టాలీవుడ్ యాక్టర్‌గా రికార్డు సృష్టించారు.