Vivek Agnihotri: దమ్ముంటే మణిపుర్ ఫైల్స్ మూవీ తీయ్: కశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్‌కు నెటిజన్ చాలెంజ్: జవాబిచ్చిన అగ్నిహోత్రి
Vivek Agnihotri: దమ్ముంటే మణిపుర్ ఫైల్స్ మూవీ తీయాలని సవాల్ చేసిన నెటిజన్‍కు రిప్లై ఇచ్చారు కశ్మీర్ ఫైల్స్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి. సోషల్ మీడియాలో ఈ తతంగం వైరల్‍గా మారింది.
Vivek Agnihotri: ది తష్కెంట్ ఫైల్స్, ది కశ్మీర్ ఫైల్స్ లాంటి సంచలనాత్మక సినిమాలతో డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి ఫుల్ పాపులర్ అయ్యారు. ముఖ్యంగా గతేడాది ఆయన దర్శకత్వంలో వచ్చిన ది కశ్మీర్ ఫైల్స్ మూవీ భారీ విజయం సాధించింది. 1990ల్లో కశ్మీర్‌లో హిందువులపై జరిగిన మారణ హోమాన్ని ఈ చిత్రంలో చూపించారు వివేక్. ఈ సినిమాపై ఎన్ని ప్రశంసలు వచ్చాయో.. విమర్శలు కూడా అదే రేంజ్‍లో వచ్చాయి. అయితే, తాజాగా ఓ నెటిజన్.. ట్విటర్లో వివేక్ అగ్నిహోత్రికి సవాల్ చేశారు. మణిపుర్‌లో అమానవీయ ఘటనలు, ఘర్షణలు జరుగుతున్న నేపథ్యంలో.. మణిపుర్ ఫైల్స్ మూవీ తీయాలని చాలెంజ్ చేశారు. ఇందుకు అగ్నిహోత్రి కూడా కౌంటర్ ఇచ్చారు. వివరాలివే..
ది కశ్మీర్ ఫైల్స్‌ను వెబ్ సిరీస్ రూపంలో ప్రస్తుతం ది కశ్మీర్ ఫైల్స్ అన్‍రిపోర్టెడ్ పేరుతో తీస్తున్నారు వివేక్ అగ్నిహోత్రి. మరింత రీసెర్చ్ చేసి వివరంగా ఈ సిరీస్ రూపొందిస్తున్నారు. ఈ తరుణంలో ట్విట్టర్లో ఓ నెటిజన్ వివేక్‍కు చాలెంజ్ విసిరారు. “సమయం వృథా చేసుకోవద్దు.. మీకు సరిపడా దమ్ము ఉంటే (మగాడివైతే) మణిపుర్ ఫైల్స్ మూవీ రూపొందించు” అని ఓ యూజర్ ట్వీట్ చేశాడు. దీనికి వివేక్ స్పందించారు.
“నాపై అంత నమ్మకాన్ని ఉంచుకున్నందుకు థ్యాంక్స్. కానీ అన్ని సినిమాలు నాతోనే తీయిస్తారా? మీ ‘టీమిండియా’లో దమ్మున్న ఫిల్మ్ మేకర్ ఏవరూ లేరా?” అని వివేక్ అగ్నిహోత్రీ రిప్లే ఇచ్చారు. ఈ ట్వీట్స్ సోషల్ మీడియాలో వైరల్‍గా మారాయి. కొందరు వివేక్ అగ్నిహోత్రికి మద్దతుగా కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు ఆయనకు వ్యతిరేకంగా స్పందిస్తున్నారు.
కాగా, వివేక్ అగ్నిహోత్రి ప్రస్తుతం ది వ్యాక్సిన్ వార్ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. కొవిడ్-19 ఉద్ధృతంగా ఉన్న సమయంలో వ్యాక్సిన్ల కోసం జరిగిన ప్రయత్నాలు, పరిణామాలు కథాంశంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అనుపమ్ ఖేర్, నానా పటేకర్, రీమాసేన్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ ఏడాది ఆగస్టు 15వ తేదీన ది వ్యాక్సిన్ వార్ చిత్రాన్ని విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. అయితే, రిలీజ్ ఆలస్యమవుతుందనే వాదనలు వినిపిస్తున్నాయి.