The Warrior Collections: ది వారియర్‌ కలెక్షన్లు ఇంత దారుణంగా ఉన్నాయేంటి?-the warrior movie collections are disastrous for ram pothineni ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  The Warrior Collections: ది వారియర్‌ కలెక్షన్లు ఇంత దారుణంగా ఉన్నాయేంటి?

The Warrior Collections: ది వారియర్‌ కలెక్షన్లు ఇంత దారుణంగా ఉన్నాయేంటి?

HT Telugu Desk HT Telugu
Jul 18, 2022 04:53 PM IST

The Warrior Collections: ఎన్నో అంచనాల మధ్య రిలీజైన ది వారియర్‌ మూవీ రామ్‌ పోతినేనికి తీవ్ర నిరాశనే మిగులుస్తోంది. ఫస్ట్‌ వీకెండే ఆ మూవీ బాక్సాఫీస్‌ కలెక్షన్లు దారుణంగా ఉన్నాయి.

<p>ది వారియర్ మూవీలో రామ్</p>
ది వారియర్ మూవీలో రామ్

రామ్‌ పోతినేని తన కెరీర్‌లోనే తొలిసారి ఓ పోలీస్‌ క్యారెక్టర్‌లో ఎంతో ఇంటెన్స్‌ లుక్‌లో కనిపించిన మూవీ ది వారియర్‌. ఈ సినిమాపై అతడు భారీ ఆశలే పెట్టుకున్నాడు. ఇటు అతని ఫ్యాన్స్‌లోనూ భారీ అంచనాలే ఉన్నాయి. ఆ అంచనాలకు తగినట్లే తొలిరోజు బాక్సాఫీస్‌ కలెక్షన్లలో ఆ మూవీ ఫర్వాలేదనిపించింది. ప్రపంచవ్యాప్తంగా రూ.10 కోట్లకుపైగా షేర్‌ సాధించింది.

అయితే ఈ సినిమాకు తొలి రోజే మిక్స్‌డ్‌ రెస్పాన్స్‌ రావడంతో ఆ ప్రభావం కలెక్షన్లపై పడింది. జులై 14 (గురువారం)న ఈ మూవీ రిలీజ్‌ కాగా.. శుక్ర, శని, ఆదివారాల్లో కలెక్షన్లు దారుణంగా పడిపోయాయి. సాధారణంగా ఫస్ట్‌ వీకెండే అందరూ కలెక్షన్లపై భారీ ఆశలు పెట్టుకుంటారు. ఆ లెక్కన ది వారియర్‌ మాత్రం రామ్‌కు తీవ్ర నిరాశనే మిగిల్చిందని చెప్పొచ్చు.

లింగుస్వామి డైరెక్షన్‌లో వచ్చిన ఈ మూవీలో హీరోగా రామ్‌, విలన్‌గా ఆది పినిశెట్టి నటనకు ఫ్యాన్స్‌ ఫిదా అయినా.. సినిమా మాత్రం ఆకట్టుకోలేకపోయింది. రెండో రోజే ఈ సినిమా కలెక్షన్లు 50 శాతం పడిపోవడం గమనార్హం. తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.12 కోట్లకుపైగా గ్రాస్‌ కలెక్షన్లు రాగా.. రెండో రోజైన శుక్రవారం అది రూ.6.35 కోట్లకు పడిపోయింది.

ఇక మూడోరోజైన శనివారం మరింత తగ్గి రూ.4.35 కోట్లకు పరిమితమైంది. ఈ నేపథ్యంలో ఆదివారం కాస్తయినా కోలుకుంటుందని అంచనా వేసినప్పటికీ పెద్దగా ఊరట లభించింది. నాలుగో రోజయిన ఆదివారం ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.6.1 కోట్ల గ్రాస్‌ కలెక్షన్లు మాత్రమే రాబట్టింది. ఆ లెక్కన మొత్తం 4 రోజులు కలిపి ఈ సినిమా గ్రాస్‌ కలెక్షన్లు రూ.29 కోట్లు మాత్రమే. ఇందులో డిస్ట్రిబ్యూటర్‌ షేర్‌ రూ.18.5 కోట్లు.

రిలీజ్‌కు ముందు ది వారియర్‌ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.38.1 కోట్ల బిజినెస్‌ చేసింది. ఆ లెక్కన బ్రేక్‌ఈవెన్‌ అందుకోవడానికి మరో రూ.20 కోట్లకుపైనే వసూలు చేయాల్సి ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అది సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. అదే జరిగితే ఈ మూవీ భారీ నష్టాలు తప్పవు.

Whats_app_banner