The Kerala Story OTT: ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయిన వివాదాస్పద ‘ది కేరళ స్టోరీ’ మూవీ!-the kerala story movie set to stream on zee5 ott soon ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  The Kerala Story Ott: ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయిన వివాదాస్పద ‘ది కేరళ స్టోరీ’ మూవీ!

The Kerala Story OTT: ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయిన వివాదాస్పద ‘ది కేరళ స్టోరీ’ మూవీ!

Chatakonda Krishna Prakash HT Telugu
Jan 07, 2024 04:11 PM IST

The Kerala Story OTT: కేరళ స్టోరీ సినిమా పెద్ద దుమారాన్నే రేపింది. అంతకు మించి భారీ కలెక్షన్లను దక్కించుకుంది. ఈ చిత్రం ఎట్టకేలకు ఇప్పుడు ఓటీటీలోకి అడుగుపెట్టేందుకు రెడీ అయింది. ఆ వివరాలివే..

ది కేరళ స్టోరీ పోస్టర్
ది కేరళ స్టోరీ పోస్టర్

The Kerala Story OTT: ‘ది కేరళ స్టోరీ’ సినిమా గతేడాది దేశవ్యాప్తంగా దుమారాన్ని రేపింది. చాలా వివాదాలను, అడ్డంకులను ఎదుర్కొని ఈ చిత్రంగా గతేడాది మే 5వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయింది. సుదీప్తో సేన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఆదా శర్మ ప్రధాన పాత్ర పోషించారు. రూ.10కోట్లలోపు బడ్జెట్‍తో రూపొందిన ది కేరళ స్టోరీ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఏకంగా సుమారు రూ.300కోట్ల కలెక్షన్లను సాధించి సెన్సేషనల్ హిట్ అయింది.

తీవ్ర వివాదాస్పదమైనా.. బ్లాక్‍బాస్టర్ కొట్టిన ‘ది కేరళ స్టోరీ’ ఓటీటీ హక్కుల విషయంలో మాత్రం చాలా జాప్యం జరిగింది. దీంతో ఓటీటీకి ఎప్పుడు వస్తుందోనని చాలా మంది ఎదురుచూస్తున్నారు. మొత్తానికి ఈ సినిమా హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్‍ఫామ్ ‘జీ5’ సొంతం చేసుకుంది. ఇప్పుడు, సుమారు నెలల తర్వాత ఈ చిత్రం జీ5లో స్ట్రీమింగ్‍కు రెడీ అయిందని తెలుస్తోంది.

జీ5 ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో ‘ది కేరళ స్టోరీ’ మూవీ జనవరిలోనే స్ట్రీమింగ్‍కు రావడం దాదాపు ఖరారైంది. జీ5 నుంచి ఈ విషయంలో అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. జనవరి 12 లేదా జనవరి 19న ఈ సినిమా జీ5 ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో అడుగుపెడుతుందని ప్రచారం జరుగుతోంది.

కేరళ స్టోరీ సినిమాలో అదా శర్మ, యోగిత బిహానీ, సోనియా బిలానీ, సిద్ధ్ ఇద్నానీ, దేవదర్శిని, వినయ్ కృష్ణ కీలకపాత్రలు పోషించారు. సుదీప్తో సేన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సన్‍షైన్ పిక్చర్స్ పతాకంపై విపుల్ అమృత్‍లాల్ షా నిర్మించారు.

వివాదాలు..

కేరళ స్టోరీ సినిమా టైటిల్ నుంచే తీవ్ర వివాదాన్ని రేపింది. కేరళలో వేలాది మంది అమ్మాయిలను ప్రేమ, పెళ్లి పేరుతో కొందరు ఇస్లామిక్ దేశాలకు తీసుకెళ్లి.. ఉగ్రవాదులుగా మారుస్తున్నారన్న కథాంశంతో ఈ చిత్రం రూపొందింది. ట్రైలర్ తర్వాత ఈ మూవీ కొందరి నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. ఇవి నిజాలు కావని కొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ చిత్రం విడుదలను ఆపాలని పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా సుప్రీం కోర్టును కూడా వెళ్లింది. అయితే, ఈ మూవీ విడుదలకు సుప్రీం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో 2023 మే 5న థియేటర్లలో రిలీజ్ అయింది.

కేరళ స్టోరీ సినిమాపై ఓ వైపు అభ్యంతరాలు వ్యక్తమైనా.. కలెక్షన్లు మాత్రం అంచనాలకు మించి వచ్చాయి. ఇండియానే కాకుండా చాలా దేశాల్లో ఈ చిత్రం భారీ వసూళ్లను రాబట్టింది. బడ్జెట్ పరంగా చిన్నచిత్రంగా వచ్చి ఏకంగా రూ.300కోట్లను దక్కించుకొని ఆశ్చర్యపరిచింది.

ది కేరళ స్టోరీ సినిమా ముఖ్యంగా ముగ్గురు అమ్మాయిల స్టోరీని చూపిస్తుంది. ఇందులో షాలినీ (అదా శర్మ) కథ ప్రధానంగా ఉంటుంది. ఆ ముగ్గురిని ప్రేమ పేరుతో మభ్యపెట్టి వేసుకొని ఇస్లామ్‍లోకి మార్చి దేశాలకు తీసుకెళ్లి ఉగ్రవాదులుగా మార్చాలని ప్రయత్నిస్తారు. షాలినీని అఫ్గానిస్థాన్‍కు అలానే పెళ్లి చేసుకొని ఓ వ్యక్తి తీసుకెళతాడు. షాలినీ పరిస్థితి ఏమైంది? తప్పించుకోగలిగిందా? అనేదే ఈ మూవీ ప్రధాన కథగా ఉంది.

ది కేరళ స్టోరీ మూవీ పక్షపాత ధోరణితో, అవాస్తవాలతో ఉందని చాలా మంది విమర్శించారు. ఓ వర్గంపై ద్వేషం పెంచేలా ఉందని అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.

Whats_app_banner