Sobhita Dhulipala: అసలు మనం ఎలా కలుసుకున్నాం అంటూ చైతన్యతో ఉన్న క్యూట్ ఫొటోలు షేర్ చేసిన శోభిత
Sobhita Dhulipala: నాగ చైతన్యతో ఎంగేజ్‌మెంట్ కు సంబంధించి శోభిత ధూళిపాళ మరిన్ని ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసింది. వాటిని ఎంతో కవితాత్మకంగా వర్ణిస్తూ వీటిని పోస్ట్ చేయడం విశేషం.
Sobhita Dhulipala: నాగ చైతన్య, శోభిత ధూళిపాళ పెళ్లి చేసుకోబోతున్న విషయం తెలుసు కదా. గురువారమే (ఆగస్ట్ 8) వీళ్ల ఎంగేజ్‌మెంట్ కూడా జరిగింది. ఈ ఫొటోలను నాగార్జున మొదట షేర్ చేయగా.. ఇప్పుడు శోభిత కూడా మరిన్ని ఫొటోలను పంచుకుంది. ఈ క్యూట్ ఫొటోలను షేర్ చేస్తూ.. వాటికి ఓ కవితాత్మక వర్ణనను క్యాప్షన్ గా ఉంచడం విశేషం.
అసలు మనం ఎలా కలుసుకున్నాం?
రెండేళ్లుగా సీక్రెట్ గా డేటింగ్ చేస్తున్న నాగ చైతన్య, శోభిత ధూళిపాళ ఇప్పుడు నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ ఏడాది చివర్లో పెళ్లి కూడా చేసుకోబోతున్నారు. తాజాగా శుక్రవారం (ఆగస్ట్ 9) శోభిత తమ ఎంగేజ్‌మెంట్ ఫొటోలను ఆమె షేర్ చేసింది. ఈ సందర్భంగా తమిళ శాస్త్రీయ కవిత రచన అయిన కురుంతోకై నుంచి కొన్ని పదాలనే క్యాప్షన్ గా ఉంచింది.
ఆమె ఇంగ్లిష్ లో పెట్టిన క్యాప్షన్ ఇలా ఉంది.. "మా అమ్మ నీకు ఏమవుతుంది? మా నాన్న నీకు ఎలా బంధువు అవుతారు? అసలు నువ్వు, నేను ఎలా కలుసుకున్నాం? కానీ ప్రేమలో మాత్రం మన మనసులు ఎర్రటి నేల, కురిసే వర్షంలాంటివి: విడిపోకుండా ఎప్పటికీ కలిసే ఉంటాయి" అని అనడం విశేషం. మొదట వీళ్ల నిశ్చితార్థానికి చెందిన ఫొటోలను నాగార్జున షేర్ చేసిన విషయం తెలిసిందే.
అయితే వాటితోపాటు శోభిత తాజాగా మరిన్ని ఫొటోలను కూడా పంచుకుంది. అందులో చైతన్యతో తాను కలిసి ఉన్న క్యూట్ ఫొటోలు ఉన్నాయి. అందులో ఒకటి ఇద్దరూ ఊయలలో కూర్చున్న బ్లాక్ అండ్ వైట్ ఫొటో కావడం విశేషం. ఇక మరొక ఫొటోలో శోభిత, చైతన్య ఇద్దరూ పగలబడి నవ్వడం కూడా చూడొచ్చు. ఈ ఫొటోలకు ప్రైమ్ వీడియో ఓటీటీ కూడా స్పందించింది. కంగ్రాచులేషన్స్ అని కామెంట్ చేసింది.
రెండేళ్ల లవ్ స్టోరీ
సమంతతో విడాకుల తర్వాత చైతన్య ఈ గూఢచారి నటి శోభితతో డేటింగ్ లో ఉన్నట్లు చాలా రోజులుగా వార్తలు వచ్చాయి. ఇద్దరూ కలిసి యూరప్ టూర్ కూడా ఎంజాయ్ చేశారు. ఆ ఫొటోలు కూడా వైరల్ అయ్యాయి. అయితే ఇన్నాళ్లూ ఎప్పుడూ ఎవరూ తమ మధ్య ఉన్న రిలేషన్షిప్ ను కన్ఫమ్ చేయడం కానీ, ఖండించడం కానీ చేయలేదు. ఇప్పుడు సడెన్ గా నిశ్చితార్థంతో ఏకంగా తమ పెళ్లినే కన్ఫమ్ చేయడం అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది.
శోభిత ధూళిపాళ ఏపీలోని తెనాలికి చెందినది. 1992 మే 31న జన్మించింది. శోభితా తండ్రి వేణుగోపాల్ రావు ఒక నేవీ ఇంజినీర్. తల్లి శాంతా కామాక్షి ప్రైమరీ స్కూల్ టీచర్. విశాఖపట్నంలో పెరిగిన శోభితా 16 ఏళ్ల వయసులో తండ్రి వృత్తి రీత్యా ముంబైకి వెళ్లాల్సి వచ్చింది. అక్కడ ముంబై యూనివర్సిటీలో కార్పొరేట్ లా చేసిన శోభితా భరతనాట్యం, కూచిపూడి నేర్చుకుంది. 2010లో జరిగిన నేవీ వార్షిక వేడుకల్లో నేవీ క్వీన్ కిరీటం సాధించింది శోభిత.