Sindhooram Movie Review : సిందూరం మూవీ రివ్యూ.. సిద్ధాంతం ముసుగులో అమరులైన వారెందరో
Sindhooram Telugu Movie Review : సిందూరం అనే పేరు వినగానే.. కృష్ణవంశీ సినిమా గుర్తుకు వస్తుంది. నక్సల్స్ కరెక్టా? పోలీసులు కరెక్టా? అనే విషయాన్ని ప్రేక్షకులకే వదిలేశాడు కృష్ణవంశీ. సేమ్ అదే పేరుతో సిందూరం అని మరో సినిమా వచ్చింది. అమెజాన్ ప్రైమ్ లో వీక్షించవచ్చు. ఇందులో ఏం చూపించారు?
సినిమా పేరు : సిందూరం
నటీనటులు: శివ బాలాజీ, ధర్మ, బ్రిగిడ, సాగ, రవివర్మ తదిరులు
నిర్మాణ సంస్థ : శ్రీ లక్ష్మీ నరసింహ మూవీ మేకర్స్
నిర్మాత : ప్రవీణ్ రెడ్డి జంగా
దర్శకుడు : శ్యామ్ తుమ్మలపల్లి
సంగీతం : గౌవ్రా హరి
సినిమాటోగ్రఫీ : కేశవ్
ఎడిటర్ : జస్విన్ ప్రభు
కథ
సిందూరం సినిమా కథ అంతా 2003లో నడుస్తుంది. శ్రీరామగిరి ఏజెన్సీ ఏరియాలో పెత్తందార్లు, భూస్వాముల ఆగడాలు ఎక్కువగా ఉంటాయి. సింగన్న దళం( శివ బాలాజీ) చేసే పోరాటం నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. అదే సమయంలో ఎమ్మార్వోగా శిరీష రెడ్డి (బ్రిగిడ సాగా) శ్రీరామగిరికి వస్తుంది. అక్కడ నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తుంది. ఆమెకు తోడుగా కాలేజీ ఫ్రెండ్ రవి(ధర్మ) ఉంటాడు. శిరీషకు తెలియకుండా నక్సలైట్ ఇన్ ఫార్మర్ గా పని చేస్తాడు రవి.
ఆ ఊరిలో జడ్పీటీసీ ఎన్నికలు వస్తాయి. శిరీష అన్న ఈశ్వరయ్య(రవివర్మ) పోటీలో ఉంటాడు. అనుకోని సంఘటనలతో మరణిస్తాడు. దీంతో శిరీష ఎన్నికల్లో పోటీ చేయాల్సి వస్తుంది. ఈ విషయం సింగన్న దళానికి నచ్చదు. శిరీషను దళం తీసుకెళ్లేందుకు సాయం చేస్తాడు రవి. శిరీషను సింగన్న దళం ఏం చేసింది ? ఈశ్వరయ్యను ఎవరు చంపారు? రవి తీసుకున్న నిర్ణయం ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ
సిందూరం లాంటి కథ చెప్పడం అంత ఈజీ అయిన విషయం ఏమీ కాదు. నక్సలైట్, ప్రభుత్వం.. ఇలా చాలా సినిమాలే వచ్చాయి. కానీ ఈ విషయాన్ని సరిగా ప్రేక్షకుల ముందు పెట్టడం కత్తిమీద సాములాంటిదే. అయితే ఈ సినిమాలో దర్శకుడు కొన్ని సాహసాలు చేశాడు. ఎర్రజెండాను అభిమానించే వాళ్లకు కాస్త కొన్ని సీన్లు నచ్చకపోవచ్చు. నక్సలైట్ వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలు, కమ్యూనిజం ముసుగులో జరిగే అరాచకాల గురించి చెప్పకనే చెప్పేశాడు.
కొన్ని కొన్ని డైలాగ్స్ చూస్తే.. అవును ఇలా కూడా ఆలోచించాలి కదా అనేలా ఉంటాయి. హిట్లర్, స్టాలిన్ చాలా కోట్ల మంది ప్రాణాలను తీశారని నాటి చరిత్రను రీసెర్చ్ చేసి చెప్పిన తీరు బాగుంది. ఈ సినిమాలో పలు డైలాగ్స్ ఆకట్టుకుంటాయి. కమ్యూనిజం గురించి హీరోయిన్ తో చెప్పించిన డైలాగ్స్ చాలా బాగుంటాయి. 2003 నాటి వాతావరణాన్ని తెరపై అద్బుతంగా చూపించడంలో కెమెరా పనితనం కనిపిస్తుంది. ప్రథమార్థం స్లోగా అనిపిస్తుంది.. కానీ సెకండ్ హాఫ్ లో ప్రేక్షకులను సినిమా మెప్పిస్తుంది.
ఈ చిత్రానికి ప్రధాన బలం.. శివ బాలాజీ, బ్రిగిడ సాగా. తమ నటనతో ఆకట్టుకున్నారు. రవి పాత్రలో ధర్మ ఒదిగిపోయాడు. మెుదటి చిత్రమే అయినా చక్కగా నటించాడు. శివబాలాజీ ఈ సినిమాలో కొత్తగా కనిపిస్తాడు. చిరంజీవి అభిమానిగా రవి నవ్వించే ప్రయత్నం చేశాడు.
టాపిక్