Sathyabama Movie Review: సత్యభామ రివ్యూ - కాజల్ క్రైమ్ ఇన్వేస్టిగేషన్ థ్రిల్లర్ మూవీ ఎలా ఉందంటే?
Sathyabama Movie Review: కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలో నటించిన సత్యభామ మూవీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. మర్డర్ మిస్టరీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీ ఎలా ఉందంటే?
Sathyabama Movie Review: గ్లామర్ పంథాకు భిన్నంగా యాక్షన్ కథాంశాన్ని ఎంచుకుంటూ కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) చేసిన తాజా చిత్రం సత్యభామ. మర్డర్ మిస్టరీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీకి సుమన్ చిక్కాల దర్శకత్వం వహించాడు. గూఢచారి ఫేమ్ శశికిరణ్ తిక్కా స్క్రీన్‌ప్లేను అందిస్తూ ప్రజెంటర్‌గా వ్యవహరించారు. నవీన్ చంద్ర కీలక పాత్ర పోషించాడు. సత్యభామకు కాజల్‌కు హిట్టు దక్కిందా? ఈ లేడీ ఓరియెంటెడ్ మూవీ ప్రేక్షకులను మెప్పించిందా? లేదా? అంటే?
సత్యభామ ఇన్వేస్టిగేషన్…
సత్యభామ (కాజల్ అగర్వాల్) షీ టీమ్‌లో ఏసీపీగా పనిచేస్తుంటుంది. హసీనా అనే యువతిని ఆమె భర్త యాదు చిత్రహింసలకు గురిచేస్తుంటాడు. యాదు (అనిరుధ్ పవిత్రన్) బారి నుంచి హసీనాను కాపాడేందుకు సత్యభామ ప్రయత్నిస్తుంది. అనుకోకుండా హసీనా దారుణ హత్యకు గురువుతుంది. హసీనా భర్త యాదుతో పాటు ఆమె తమ్ముడు ఇక్భాల్ (ప్రజ్వల్ యాద్మ) కనిపించకుండాపోతారు.
ఈ కేసులో నిర్లక్ష్యంగా వ్యహరించిన సత్యభామ షీ టీమ్ నుంచి వైదొలగాల్సివస్తుంది. హసీనాను చంపిన యాదును పట్టుకోవడంతో పాటు ఆమె తమ్ముడు ఇక్బాల్ మిస్సింగ్ వెనకున్న మిస్టరీని ఛేదించే క్రమంలో సత్యభామకు ఎలాంటి నిజాలు తెలిశాయి? సత్యభామ ఇన్వేస్టిగేషన్‌లోకి ఎంపీ కొడుకు రిషి (అంకిత్ కొయ్య)ఎందుకొచ్చాడు?
రిషితో పాటు అమ్మాయిలను విదేశాలకు అక్రమంగా తరలించే హ్యూమన్ ట్రాఫికింగ్ లీడర్స్ విజయ్, నేహాలతో ఇక్భాల్‌కు ఏమైనా సంబంధం ఉందా? అసలు హసీనా ఎలా చనిపోయింది? ఆమె మరణం వెనుకున్న మిస్టరీని సత్యభామ ఛేదించిందా? సత్యభామ జీవితంలోకి రచయిత అమర్ (నవీన్ చంద్ర) ఎలా వచ్చాడు? అన్నదే ఈ మూవీ (Sathyabama Movie Review)కథ.
మర్డర్ మిస్టరీ థ్రిల్లర్...
మర్డర్ మిస్టరీజానర్ సినిమాల్లో క్యారెక్టర్స్, బ్యాక్‌డ్రాప్‌లు వేరైనా కథలు ఒకేలా ఉంటాయి. ఎలాంటి ఆధారాలు లేకుండా ఓ మర్డర్ జరగడం, ఈ హత్య వెనుకున్న కారణాల్ని హీరో లేదా హీరోయిన్ తన తెలివితేటలతో కనిపెట్టే క్రమంలో రివీలయ్యే ట్విస్ట్‌లు, చివరకు అసలైన హంతకుడు పట్టుకోవడంతో ఈ కథలు ముగుస్తుంటాయి. సత్యభామ కూడా అలాంటి టెంప్లేట్ మర్డర్ మిస్టరీ మూవీనే.
షీ టీమ్ బాధ్యత...
లేడీ ఓరియెంటెడ్ క్రైమ్ ఇన్వేస్టిగేషన్ థ్రిల్లర్‌గా దర్శకుడు సుమన్ చిక్కాల ఈ మూవీని తెరకెక్కించారు. కమర్షియల్ మూవీలో మహిళల రక్షణ విషయంలో షీ టీమ్ బాధ్యతను, సొసైటీలో అమ్మాయిలపై జరుగుతోన్న అఘాయిత్యాలను ఆలోచనాత్మకంగా సినిమాలో చూపించారు. సందేశం ఇచ్చినట్లుగా కాకుండా కమర్షియల్ కోణంలోనే ఈ పాయింట్‌ను థ్రిల్లింగ్‌గా చెప్పడం ఆకట్టుకుంటుంది.
ఆరంభంలోనే రివీల్...
సాధారణంగా మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ సినిమాల్లో విలన్ ఎవరన్నది చివరి వరకు రివీల్ కాదు. ఇందులో మాత్రం ఆరంభంలోనే హంతకుడు ఎవరన్నది చెప్పేసిన డైరెక్టర్ ఆడియెన్స్‌లో క్యూరియాసిటీని కలిగించాడు. అతడిని పట్టుకునేందుకు హీరోయిన్ వేసే ఎత్తులు, ఆమె ఇన్వేస్టిగేషన్‌లో వెల్లడయ్యే నిజాలతో స్క్రీన్‌ప్లేను గ్రిప్పింగ్‌గా రాసుకున్నాడు శశికిరణ్ తిక్కా.
ఈ ఇన్వేస్టిగేషన్ ప్రాసెస్‌లో ఒక్కో కొత్త క్యారెక్టర్ ఎంట్రీ ఇవ్వడం, వాటితో ప్రధాన పాత్రలకు ఉన్న సంబంధాలు ఆకట్టుకుంటాయి. వారిపై అనుమానాలను రేకెత్తిస్తూ హసీనా హత్య వెనకున్న ట్విస్ట్‌ను చివరి వరకు ప్రేక్షకుల ఊహలకు అందంగా ఎంగేజింగ్‌గా నడిపించారు.
లెక్కకు మించిన క్యారెక్టర్స్...
సత్యభామలో లెక్కకుమించిన క్యారెక్టర్స్ ఉండటం, ఏ పాత్రకు సరైన ఇంపార్టెన్స్ లేకపోవడమే మైనస్‌గా మారింది. ప్రేక్షకులను థ్రిల్ చేయడానికే కావాలనే కొన్ని క్యారెక్టర్స్‌ను ఇరికించిన ఫీలింగ్ కలుగుతుంది. మలుపులు కూడా ఎక్కువైపోవడంతో ఓ టైమ్‌లో సినిమా కన్‌ఫ్యూజ్ చేస్తుంది. సత్యభామ ఇన్వేస్టిగేషన్‌లో ఆసక్తి లోపించింది. చాలా చోట్ల దర్శకుడు లాజిక్‌లను వదిలేశాడు. ఊహించింత ఇంటెన్స్‌గా క్లైమాక్స్‌ను ఎండ్ చేయలేకపోయాడు.
యాక్షన్ సీన్స్ కోసం కాజల్ కష్టం...
సత్యభామ పాత్రలో అదరగొట్టింది. ఓ యువతి మర్డర్‌ను సాల్వ్ చేసే పోలీస్ ఆఫీసర్ పాత్రలో సీరియస్‌నెస్, ఎమోషన్స్‌ను చక్కగా పలికించింది. యాక్షన్ సీన్స్ లో ఆమె పడిన కష్టం స్క్రీన్‌పై కనిపిస్తుంది. అమర్‌గా నవీన్‌చంద్ర (Naveen Chandra) రొటీన్ క్యారెక్టర్‌లో కనిపించాడు. పజ్వల్ యాద్మ, అంకిత్ కొయ్య, హర్షవర్ధన్‌తో పాటు పలువురు నటీనటులు ఉన్నా ఏ క్యారెక్టర్ పెద్దగా గుర్తుండిపోతుంది. ప్రకాష్ రాజ్ అనుభవాన్ని సరిగా వాడుకోలేదు. శ్రీచరణ్ పాకాల బీజీఎమ్, శశికిరణ్ తిక్కా స్క్రీన్‌ప్లే సత్యభామకు ప్లసయ్యాయి.
ఛాలెంజింగ్ రోల్స్‌కు...
సత్యభామ కొత్త కోణంలో సాగే మర్డర్ మిస్టరీ థ్రిల్లర్. గ్లామర్ పాత్రలు మాత్రమే కాదు అవకాశం వస్తే యాక్షన్ ఓరియెంటెడ్‌తో కూడిన ఛాలెంజింగ్ రోల్స్‌కు కాజల్ న్యాయం చేయగలదని నిరూపించే మూవీ ఇది.
రేటింగ్:2.5/5