Sankranthi Movies OTT Releases: సంక్రాంతి సినిమాలకు ఓటీటీల షాక్.. అలా అయితేనే సరే అంటూ..!
Sankranthi Movies OTT Releases: సంక్రాంతి సినిమాలకు ఓటీటీలు షాక్ ఇస్తున్నాయి. సంక్రాంతి టైమ్ లో రిలీజయ్యే సినిమాల జయాపజయాలపై ఆధారపడి వాటిని ముందుగానే ఓటీటీల్లోకి తీసుకువస్తామన్న డిమాండ్స్ వినిపిస్తుండటం గమనార్హం.
Sankranthi Movies OTT Releases: సంక్రాంతి సినిమాల విషయంలో ఓటీటీలు కొత్త డిమాండ్ తో మేకర్స్ కు షాకిస్తున్నాయి. ఇప్పటికే వచ్చే ఏడాది సంక్రాంతి కోసం కొన్ని సినిమాలు సిద్ధమయ్యాయి. అందులో మహేష్ బాబు గుంటూరు కారం, నా సామి రంగా, హనుమాన్, ఈగల్, విజయ్ దేవరకొండ సినిమాలు రేసులో ఉన్నాయి.
అయితే ఈ సినిమాల ఓటీటీ రిలీజ్ విషయంలో ఆయా ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ కొత్త డిమాండ్ వినిపిస్తున్నాయి. సంక్రాంతి సినిమాలు అంటే జనవరి 12 నుంచి 15 మధ్య రిలీజయ్యే సినిమాలు హిట్ అయితే వాటిని 28 నుంచి 30 రోజుల్లో ఓటీటీల్లోకి తీసుకొస్తామని చెబుతున్నాయి. ఒకవేళ ఈ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడితే మాత్రం వాటిని రెండు వారాల్లోనే అంటే జనవరి 26 నుంచి స్ట్రీమ్ చేస్తామని స్పష్టం చేస్తున్నాయి.
నిజానికి థియేటర్లలో రిలీజైన తర్వాత కనీసం 8 వారాల గ్యాప్ ఇవ్వాలని గతంలో ప్రొడ్యూసర్లు డిమాండ్ చేశారు. కానీ ఓటీటీలకు ఉన్న డిమాండ్ నేపథ్యంలో వాళ్లు తాజా సంక్రాంతి సినిమాల విషయంలో ఈ కొత్త డిమాండ్ కే తలొగ్గినట్లు తెలుస్తోంది. ఆ లెక్కన సంక్రాంతి బరిలో నిలిచే సినిమా బాక్సాఫీస్ దగ్గర ఫెయిలైతే రెండు వారాల్లోనే ఓటీటీలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.
ఇది మేకర్స్ కు భారీ షాక్ కాగా.. ప్రేక్షకులకు మాత్రం ఒకింత గుడ్ న్యూసే అని చెప్పాలి. థియేటర్లలో రిలీజైన సినిమాను నెల రోజుల్లోపే ఓటీటీల్లో చూసే అవకాశం ఇన్నాళ్లూ దక్కింది. ఇక నుంచి బాక్సాఫీస్ ఫలితం ఆధారంగా కొన్ని సినిమాలను రెండు వారాల్లోనే చూసే వీలు కూడా కలగనుంది. ఇప్పటికే ఈ బాక్సాఫీస్ కలెక్షన్లను బట్టి ఓటీటీలు తాము ముందుకు కుదుర్చుకున్న ఒప్పందం కంటే 30 నుంచి 40 శాతం తక్కువ పేమెంట్స్ ఇస్తున్నారని వార్తలు వస్తున్నాయి.
తాజాగా ఈ కొత్త డిమాండ్ తో మేకర్స్ కు మరింత నష్టం తప్పేలా లేదు. పేమెంట్ తగ్గించుకోకూడదనుకుంటే రెండు వారాల విండోకి ప్రొడ్యూసర్లు అంగీకరించాల్సిన పరిస్థితి కలుగుతోంది. ఒకవేళ దానికి సరే అంటే థియేటర్ల బిజినెస్ పై దెబ్బ పడుతుంది. మరి ఓటీటీల విషయంలో ఫిల్మ్ మేకర్స్ రానున్న రోజుల్లో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.