Salman Khan gun license: సల్మాన్ ఖాన్‌కు గన్ లైసెన్స్ మంజూరు
Salman Khan gun license: బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ఆత్మ రక్షణ కోసం గన్ లైసెన్స్ కావాలంటూ పెట్టుకున్న దరఖాస్తు ఆమోదం పొందింది.
న్యూఢిల్లీ: తనకు ఇటీవల బెదిరింపు లేఖలు అందిన నేపథ్యంలో స్వీయ రక్షణకు తుపాకీ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకున్న బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్‌కు ఆయుధాల లైసెన్స్ జారీ అయింది.
గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుండి సల్మాన్‌కు చంపుతామన్న బెదిరింపు వచ్చింది. దాని తర్వాత సల్మాన్ ఖాన్ తనకు, అతడి తండ్రికి బెదిరింపు లేఖపై ముంబై పోలీసు చీఫ్ వివేక్ ఫన్సాల్కర్‌ను కలిశారు.
బెదిరింపుల తర్వాత సల్మాన్ ముందు జాగ్రత్తగా తన ల్యాండ్ క్రూయిజర్‌ను బుల్లెట్ ప్రూఫ్ చేయించినట్టు తెలుస్తోంది.
మే 29న పంజాబ్‌లోని మాన్సా జిల్లాలో పంజాబీ గాయకుడు సిద్ధూ మూస్ వాలా కాల్చివేతకు గురైన కొన్ని రోజుల తర్వాత జూన్ 5న సల్మాన్ ఖాన్, అతని తండ్రి సలీం ఖాన్‌కు హత్య బెదిరింపు వచ్చింది.
సలీం ఖాన్ భద్రతా బృందం ముంబై నివాసం వెలుపల బాంద్రా బ్యాండ్‌స్టాండ్ ప్రొమెనేడ్ సమీపంలో లేఖను కనుగొంది. అక్కడ సలీం ఖాన్ తన రొటీన్ మార్నింగ్ వాక్ కోసం వెళతారు.
మే 29న పంజాబ్‌లోని మాన్సా జిల్లాలోని జవహర్కే గ్రామంలో సిద్ధూ మూస్ వాలాను గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. పంజాబ్ పోలీసులు అతడి భద్రతను ఉపసంహరించుకున్న ఒక రోజు తర్వాత ఈ సంఘటన జరిగింది.
సిద్ధు మూసేవాలా ('తేరా మూసావాలా బనా దేంగే')కి పట్టిన గతే త్వరలో సలీం ఖాన్, అతని కొడుకు సల్మాన్ ఖాన్ ఇద్దరూ ఎదుర్కొంటారని సదరు బెదిరింపు లేఖలో హెచ్చరించినట్టు పోలీసు వర్గాలు తెలిపాయి.
బిష్ణోయ్ గ్యాంగ్ నటుడు సల్మాన్ ఖాన్, అతని తండ్రి సలీం ఖాన్‌ను బెదిరించడం వెనుక కారణం తమ ఉనికిని చూపించే వాతావరణాన్ని సృష్టించడమేనని మహారాష్ట్ర హోం శాఖ వర్గాలు భావిస్తున్నాయి
సల్మాన్‌కు బెదిరింపులు రావడం ఇదే తొలిసారి కాదు. 2018లో కృష్ణజింకలను వేటాడిన కేసు విచారణ జరుగుతున్నప్పుడు.. బిష్ణోయ్ తన సామాజిక వర్గం కృష్ణజింకలను పవిత్రంగా పరిగణిస్తున్నందని, ఆ కారణంతో బెదిరించినట్టు ఆరోపణలు వచ్చాయి.
టాపిక్