gargi movie review: గార్గి మూవీ రివ్యూ…సాయిపల్లవి సినిమా ఎలా ఉందంటే...
సాయిపల్లవి(sai pallavi) ప్రధాన పాత్రలో తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన గార్గి చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమా ఎలా ఉందంటే...
gargi movie review: తెలుగు, తమిళ భాషల్లో ఎమోషన్స్, సెంటిమెంట్ కలబోతగా కూడిన బరువైన పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది సాయిపల్లవి. కమర్షియల్ పంథాకు భిన్నమైన క్యారెక్టర్స్ అనగానే తొలుత దర్శకులకు సాయిపల్లవి గుర్తొస్తుందంటే అతిశయోక్తి కాదు. నటనకు ఆస్కారమున్న ఛాలెంజింగ్ క్యారెక్టర్స్ ఎంచుకుంటూ ప్రతి సినిమాతో ప్రతిభను చాటుకుంటోంది.ఈ పంథాలో సాయిపల్లవి చేసిన మరో సినిమా గార్గి. గౌతమ్ రామచంద్రన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి తెలుగులో రానా, తమిళంలో హీరో సూర్య సమర్పకులుగా వ్యవహరించారు. సందేశాత్మక కథాంశంతో తెరకెక్కిన ఎలా ఉందో తెలియాలంటే కథలోని వెళ్లాల్సిందే...
గార్గి న్యాయ పోరాటం...(gargi movie review)
గార్గి (సాయిపల్లవి) ఓ స్కూల్ టీచర్. కుటుంబమే తన ప్రపంచం. ఆమె తండ్రి బ్రహ్మానందం(ఆర్ఎస్ శివాజీ) అపార్ట్‌మెంట్ లో వాచ్‌మెన్‌గా పనిచేస్తుంటాడు. ఓ గ్యాంగ్ రేప్ కేసులో బ్రహ్మానందాన్ని పోలీసులు అరెస్ట్ చేస్తారు. ఈ కేసు కారణంగా సాఫీగా సాగిపోతున్న గార్గి జీవితంలో ఒక్క రోజులో మొత్తం తలక్రిందులవుతుంది. ఆమె కలలన్నీ భగ్నమవుతాయి. సమాజం మొత్తం ఆమె కుటుంబాన్ని దోషులుగా చూస్తుంది. తండ్రిని నిర్ధోషిగా నిరూపించడానికి గార్గి ప్రయత్నాలు మొదలుపెడుతుంది. ఆమె తండ్రి కేసును వాదించడానికి లాయర్లు ఎవరూ ముందుకురారు. అసిస్టెంట్ లాయర్ గిరీశం (కాళీ వెంకట్ )సహాయంతో గార్గి న్యాయ పోరాటం మొదలుపెడుతుంది. ఈ ప్రయత్నంలో ఆమెకు ఎలాంటి ఆటంకాలు ఎదురయ్యాయి? తండ్రిని నిర్ధోషిగా గార్గి నిరూపించిందా? ఆ గ్యాంగ్ రేప్ కేసుతో బ్రహ్మానందానికి సంబంధం ఉందా? తండ్రి జీవితానికి సంబంధించి గార్గి ఎలాంటి కఠిన నిర్ణయం తీసుకుంది అన్నదే ఈ చిత్ర కథ.
సామాజిక సందేశంతో...
సమాజంలో ఆడపిల్లలపై జరుగుతున్న అకృత్యాల్ని ఆధారంగా చేసుకొని రూపొందిన చిత్రమిది. ఆడపిల్లలకు అడుగడుగునా వివక్ష, వేధింపులు ఎదురవుతూనే ఉన్నాయనే అంశాన్ని చర్చిస్తూ ఈ కథను రాసుకున్నారు. ఈ పాయింట్ కు కోర్ట్ రూమ్ డ్రామాతో పాటు నేరారోపణ గావించబడిన ఓ కుటుంబానికి సమాజం నుండి ఎదురయ్యే అవహేళనల్ని జోడించిదర్శకుడు గౌతమ్ రామచంద్రన్ ఈ సినిమాను తెరకెక్కించారు. నిజానిజాలేమిటో తెలుసుకోకుండా ఇష్టానుసారం ప్రసారం చేసే వార్తల వల్ల ఓ కుటుంబం ఎలాంటి మనో వ్యథకు గురవుతుంది? అకృత్యాల కు బలైన చిన్నారులతో పాటు వారి కుటుంబాలు పడే వేదనను మనసుల్ని కదిలించేలా ఇందులో చూపించారు. ఆడపిల్లల పెంపకం విషయంలో తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తల్ని అర్థవంతంగా ఆవిష్కరించారు.
క్లైమాక్స్ ట్విస్ట్ బాగుంది...
గార్గి తో పాటు ఆమె ఫ్యామిలీ నేపథ్యాన్ని పరిచయం చేస్తూ సింపుల్ గా సినిమాను మొదలుపెట్టిన తీరు బాగుంది. ఆమె తండ్రిని పోలీసులు అరెస్ట్ చేసే సీన్ తో అసలు కథలోకి దర్శకుడు ఎంట్రీ ఇచ్చాడు. తండ్రిని కాపాడుకోవడానికి గార్గి చేసే న్యాయం పోరాటాన్ని ఎమోషనల్ గా చూపించారు. ఒక్కో ఆధారాన్ని సేకరిస్తూ తన తండ్రిని నిర్దోషిగా విడిపించడానికి ఆమె పడే ఆరాటం, వేదన నుండి చక్కటి ఉద్వేగాలు పండాయి. తండ్రి లోకంగా బతికే గార్గి అతడి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుందనే ట్విస్ట్ క్లైమాక్స్ ను దర్శకుడు బాగా రాసుకున్నాడు. ప్రీ క్లైమాక్స్ వరకు ఓ యాంగిల్ లో సాగిన ఈ సినిమాకు డిఫరెంట్ ముగింపు ఇచ్చారు.
నిదానమే మైనస్
కథాగమనం నిదానంగా సాగడం సినిమాకు మైనస్‌గా నిలిచింది. ఆర్ట్ సినిమా మాదిరిగా ప్రతీ సీన్ నత్తనడకన సాగుతుంది. తండ్రిని నిర్దోషిగా నిరూపించడం కోసం గార్గి చేసే పోరాటాన్ని ఆసక్తికరంగా చెప్పలేకపోయారు. ఒకే పాయింట్ చుట్టూ కథను తిప్పుతూ కాలక్షేపం చేస్తున్న భావన కలుగుతుంది.
సాయిపల్లవి జీవించింది...
గార్గి పాత్రలో సాయిపల్లవి జీవించింది. తండ్రిపై అంతులేని ప్రేమాభిమానాలు ఉన్న కూతురిగా, నిజాన్ని బతికించడం కోసం పోరాటం చేసే యువతిగా చక్కటి ఎమోషన్స్ పడించింది. ఆమె క్యారెక్టర్ ప్రధానంగానే ఈ సినిమా సాగుతుంది. ప్రతి సీన్ లో తన నటనతో ఆకట్టుకున్నది. సాయిపల్లవి తండ్రిగా సీనియర్ నటుడు ఆర్ ఎస్ శివాజీ అద్భుతమైన నటనను కనబరిచాడు. అమాయకుడైన లాయర్ గా కాళీ వెంకట్ నటన ఈ సినిమా మరో పెద్ద ప్లస్ గా నిలిచింది. ఈ ముగ్గురు మినహా మిగిలిన క్యారెక్టర్స్ కు పెద్దగా ఇంపార్టెన్స్ లేదు.
మ్యూజిక్ ప్లస్ పాయింట్...
సమకాలీన పాయింట్ ను ఎంచుకొని సందేశాత్మక కథాంశంతో దర్శకుడు గౌతమ్ రామచంద్రన్ ఈ సినిమాను తెరకెక్కించారు. కథకుడిగా, దర్శకుడిగా ప్రతిభను చాటుకున్నాడు. ఈ సినిమాకు సాయిపల్లవి తర్వాత పెద్ద బలంగా సంగీత దర్శకుడు గోవింద్ వసంత నిలిచాడు. క్లాసిక్ టచ్ తో సాగే బీజీఎమ్ అలరిస్తుంది.
నిజాయితీతో కూడిన ప్రయత్నం...
నిజాయితీతో కూడిన అర్థవంతమైన ప్రయత్నంగా గార్గి నిలుస్తుంది. ఆర్ట్ ఫిలిం స్టైల్ లో నిదానంగా సాగడం వలన కమర్షియల్ గా వర్కవుట్ కావడం మాత్రం కష్టమే.
రేటింగ్: 2.75/ 5
సంబంధిత కథనం
టాపిక్