Ravi Teja | రామారావు డ్యూటీలోకి వచ్చేస్తున్నాడు.. ఎప్పటి నుంచంటే?
రవితేజ తాజా చిత్రం రామారావు ఆన్ డ్యూటీ సినిమా విడుదల తేదీని ప్రకటించింది చిత్రబృందం. వేసవి చివర్లో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నహాలు చేస్తోంది. దివ్యాంశ కౌశిక్, రజీషా హీరోయిన్లుగా నటిస్తున్నారు.
మాస్ మహరాజా రవితేజ ఇటీవల ఖిలాడి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. దీంతో తర్వాతి సినిమాలపై దృష్టి పెట్టాడు. గతేడాది క్రాక్ సినిమా ఇచ్చిన ఉత్సాహంతో వరుస పెట్టి సినిమాలు చేస్తోన్న రవితేజ.. త్వరలో మరోసారి థియేటర్లలో పలకరించనున్నాడు. 'రామారావు ఆన్ డ్యూటీ' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు ఆకట్టుకున్నాయి. తాజాగా చిత్రబృందం ఈ సినిమా విడుదల తేదీని ఖరారు చేసింది. ఈ మేరకు ట్విట్టర్‌లో విడుదల తేదీని ప్రకటించింది.
రామారావు ఆన్ డ్యూటీ చిత్రాన్ని జూన్ 17న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. రవితేజ తీక్షణంగా చూస్తోన్న ఈ లుక్ ఆకట్టుకుంటోంది. ఇటీవలే ఈ సినిమా నుంచి టీజర్ కూడా విడుదలైంది. దీంతో ప్రేక్షకుల్లో ఈ చిత్రంపై అంచనాలు అమాంతం పెరిగాయి. రాబోయే రోజుల్లో మరింత హైప్ క్రియేట్ చేసేలా మేకర్స్ ఎప్పటికప్పుడు అప్డేట్లతో రాబోతున్నారు. యదార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.
శరత్ మాండవ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ఎస్ఎల్వీ సినిమాస్, ఎల్ఎల్‌పీ, ఆర్టీ టీమ్ వ్రర్క్స్ బ్యానర్లపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. రవితేజ సరసన దివ్యాంశ కౌశిక్, రజిషా విజయన్ హీరోయిన్లుగా చేస్తున్నారు. చాలా రోజుల తర్వాత హీరో వేణు తొట్టెంపూడి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నారు. వీరితో పాటు నాజర్, నరేశ్, పవిత్ర లోకేష్, సార్పట్ట ఫేమ్ జాన్ విజయ్, చైతన్య కృష్ణ, రాహుల్ రామకృష్ణ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. శ్యామ్ సీఎస్ ఈ సినిమాకు సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్స్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
రామరావు ఆన్ డ్యూటీ చిత్రంతో పాటు రావణాసుర, ధమాకా, టైగర్ నాగేశ్వరరావు అనే చిత్రాల్లోనూ రవితేజ నటిస్తున్నారు. రావణాసుర చిత్రానికి సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తుండగా.. ధమాకా సినిమాను త్రినాథ రావు నక్కిన తెరకెక్కిస్తున్నారు. టైగర్ నాగేశ్వరరావు చిత్రాన్ని వంశీ డైరెక్ట్ చేస్తున్నారు.
సంబంధిత కథనం
టాపిక్