Animal Movie Postpone: రణ్‍బీర్ కపూర్ ‘యానిమన్’ విడుదల వాయిదా.. కారణమిదే!
Animal Movie Postpone: రణ్‍బీర్ కపూర్ నటిస్తున్న యానిమల్ సినిమా విడుదల వాయిదా పడడం ఖరారైంది. కొత్త విడుదల తేదీని చిత్ర యూనిట్ త్వరలో ప్రకటించే అవకాశం ఉంది.
Animal Movie Postpone: తెలుగు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ రణ్‍బీర్ కపూర్ హీరోగా యానిమల్ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాపై మొదటి నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. ఇటీవల విడుదలైన ప్రీ టీజర్ కూడా భీకర్ వయిలెన్స్‌తో ఆసక్తిని మరింత పెంచింది. ఈ నేపథ్యంలో యానిమల్ సినిమా కోసం చాలా మంది ఎదురుచూస్తున్నారు. అయితే, యానిమల్ మూవీ ముందుగా ప్రకటించిన విధంగా ఆగస్టు 11న విడుదలయ్యే అవకాశం లేదని తెలుస్తోంది. రిలీజ్ వాయిదా పడడం ఖాయమని సమాచారం. ఈ విషయంపై ట్రేడ్ ఎనలిస్ట్, బాలీవుడ్ క్రిటిక్ తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు.
ఆగస్టు 11వ తేదీన యానిమల్ మూవీ విడుదల కాదని తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. “ఇండిపెండెన్స్ డే వీకెండ్‍లో యానిమల్ రావడం లేదు. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణ్‍బీర్ కపూర్ నటిస్తున్న యానిమల్ ఆగస్టు 11న విడుదల కాదు. ఈ సినిమా వాయిదా పడింది. కొత్త విడుదల తేదీ రానున్న రోజుల్లో వెల్లడవుతుంది” అని తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. అయితే, యానిమల్ మూవీ డిసెంబర్‌కు వాయిదా పడుతుందని అంచనాలు వెలువడుతున్నాయి. గతంలో యానిమల్ రిలీజ్ పోస్ట్ పోన్ అవుతుందని వార్తలు రాగా.. వాటిని మూవీ యూనిట్ తోసిపుచ్చింది. అయితే, ఇప్పుడు మాత్రం వాయిదా కచ్చితమని తెలుస్తోంది.
గ్రాఫిక్స్/వీఎఫ్‍ఎక్స్ పనుల ఆలస్యంగా కారణంగానే యానిమల్ సినిమా వాయిదా పడుతున్నట్టు బాలీవుడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. వీఎఫ్‍ఎక్స్ వర్క్స్ కోసం సమయం చాలా అవసరమని మూవీ యూనిట్ భావిస్తోందని, అందుకే ఆగస్టు 11న విడుదల సాధ్యం కాదని తెలుస్తోంది. అలాగే, ఆగస్టు 11న బాలీవుడ్‍లో అక్షయ్ కుమార్ నటిస్తున్న ఓ మై గాడ్ 2 (OMG 2), సన్నీ డియోల్ ‘గదర్ 2’ విడుదల కానున్నాయి. అయితే, ఈ పోటీ వల్ల యానిమల్ తప్పుకోలేదని, గ్రాఫిక్స్ పనుల ఆలస్యమే కారణమని రిపోర్టులు బయటికి వస్తున్నాయి.
తెలుగులో అర్జున్ రెడ్డి మూవీతో సంచలనం సృష్టించిన సందీప్ రెడ్డి.. ఈ సినిమాను బాలీవుడ్‍లో కబీర్ సింగ్‍గా రీమేక్ చేశాడు. కబీర్ సింగ్ కూడా అక్కడ సూపర్ హిట్ అయింది. దీంతో రణ్‍బీర్ కపూర్ - సందీప్ కాంబినేషన్‍లో వస్తున్న యానిమల్‍పై అంచనాలు ఆ రేంజ్‍లో ఉన్నాయి. ఈ సినిమాలో రణ్‍బీర్ సరసన రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంలో విడుదల చేయాలని ప్లాన్ చేసుకుంది చిత్ర యూనిట్.
యానిమల్ మూవీని భూషణ్ కుమార్, మురాద్ ఖేతాని, ప్రణయ్ రెడ్డి వంగా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి మోహన్ భరద్వాజ్, హర్షవర్ధన్, రామేశ్వర్ సంగీతం అందిస్తున్నారు. టీ-సిరీస్ ఫిల్మ్స్, భద్రకాళి పిక్చర్స్, సినీ 1 స్టూడియో బ్యానర్లపై ఈ మూవీ వస్తోంది.