Ranbir Kapoor on Animal: యానిమల్‌లాంటి సినిమా మళ్లీ చేయనని చెప్పాను: రణ్‌బీర్ కపూర్ షాకింగ్ కామెంట్స్-ranbir kapoor animal movie bollywood actors response to criticism says he does not agree with them ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ranbir Kapoor On Animal: యానిమల్‌లాంటి సినిమా మళ్లీ చేయనని చెప్పాను: రణ్‌బీర్ కపూర్ షాకింగ్ కామెంట్స్

Ranbir Kapoor on Animal: యానిమల్‌లాంటి సినిమా మళ్లీ చేయనని చెప్పాను: రణ్‌బీర్ కపూర్ షాకింగ్ కామెంట్స్

Hari Prasad S HT Telugu

Ranbir Kapoor on Animal: యానిమల్ మూవీపై వచ్చిన విమర్శలపై తొలిసారి స్పందించాడు ఈ మూవీ స్టార్ రణ్‌బీర్ కపూర్. ఇలాంటి సినిమా మళ్లీ చేయనని చెప్పి తాను పక్కకు తప్పుకున్నానని అతడు అనడం గమనార్హం.

యానిమల్‌లాంటి సినిమా మళ్లీ చేయనని చెప్పాను: రణ్‌బీర్ కపూర్ షాకింగ్ కామెంట్స్

Ranbir Kapoor on Animal: రణ్‌బీర్ కపూర్ నటించిన యానిమల్ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఎంత పెద్ద హిట్ అయిందో.. అంతకంటే ఎక్కువ విమర్శలే ఎదుర్కొంది. అయితే ఈ విమర్శలపై ఇన్నాళ్ల తర్వాత మూవీలో లీడ్ రోల్ పోషించిన రణ్‌బీర్ కపూర్ స్పందించాడు. ఈ విమర్శలను తాను అంగీకరించనని, అయితే ప్రస్తుతం తాను ఎవరితోనూ వాగ్వాదానికి దిగే పరిస్థితి లేక మళ్లీ ఇలా చేయనని చెప్పినట్లు అతడు వెల్లడించాడు.

యానిమల్ విమర్శలపై రణ్‌బీర్ రియాక్షన్ ఇదీ

రణ్‌బీర్ కపూర్ ఈ మధ్యే నిఖిల్ కామత్ పాడ్‌కాస్ట్ షోలో యానిమల్ మూవీపై వచ్చిన విమర్శలపై తొలిసారి స్పందించాడు. సినిమాను కేవలం ఓ వినోదంగా మాత్రమే చూడాలన్న ఉద్దేశంతోనే తాము యానిమల్ మూవీ తీసినా.. దానిని పూర్తిగా తప్పుదోవ పట్టించారని రణ్‌బీర్ అన్నాడు.

"సోషల్ మీడియా వల్లే ఇదంతా. వాళ్లకు మాట్లాడుకోవడానికి ఏదో ఒకటి కావాలి. అందుకే ఇదొక స్త్రీలకు వ్యతిరేకంగా తీసిన సినిమాగా ముద్ర వేశారు. దీనివల్ల సినిమా వెనుక మేము చేసిన కృషి వృథా అవుతుంది. డైరెక్టర్ ఇంతకుముందు తీసిన కబీర్ సింగ్ కు కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైందని నాకు తెలుసు.

సాధారణ ప్రేక్షకులు ఈ సినిమా గురించి మంచిగానే మాట్లాడినా.. నేను కలిసి చాలా మంది నాతో నువ్వు ఈ సినిమా చేయాల్సింది కాదు.. నిరాశ పరిచావు అని అన్నారు. ఇండస్ట్రీలోని చాలా మంది అదే మాట అన్నారు. వాళ్లను నేను సైలెంట్ గా క్షమాపణ చెప్పి మళ్లీ ఇలాంటిది జరగదు అని చెప్పాను.

నిజానికి వాళ్లతో నేను అంగీకరించను. కానీ ప్రస్తుతం జీవితంలో నేను ఉన్న దశలో ఎవరితోనూ వాదించకూడదని నిర్ణయించుకున్నాను. వాళ్లకు నేను చేసింది నచ్చకపోతే వచ్చేసారి మరింత కష్టపడతానని చెప్పి పక్కకు వెళ్లిపోతున్నాను" అని రణ్‌బీర్ అనడం విశేషం.

గుడ్ బాయ్ ఇమేజ్ పక్కన పెట్టి..

యానిమల్ లాంటి సినిమా చేస్తే తనకు ఇన్నాళ్లూ స్క్రీన్ పై ఉన్న గుడ్ బాయ్ ఇమేజ్ పోతుందని తెలిసినా అంగీకరించినట్లు రణ్‌బీర్ చెప్పాడు. "నా కెరీర్ మొత్తం నేను మంచి పాత్రలే చేస్తూ వస్తున్నాను. మంచి సామాజిక సందేశాలు ఇస్తూ గుడ్ బాయ్ ఇమేజ్ పొందాను.

అందుకే ఈ సినిమా నాకు చాలా బోల్డ్, అడల్ట్ రేటెడ్ గా అనిపించింది. ప్రేక్షకులు ఆదరించరేమో అన్న భయం నాకు కలిగింది. సినిమా రిలీజ్ తర్వాత బాక్సాఫీస్ దగ్గర మంచి ప్రదర్శన చేసినా.. చాలా మంది దీనిని స్త్రీద్వేషి మూవీగా ముద్ర వేసి తీవ్రంగా వ్యతిరేకించారు" అని రణ్‌బీర్ అన్నాడు.

మరోసారి యానిమల్ లాంటి సినిమా చేస్తారా అని అడిగితే.. చేస్తానని అతడు చెప్పడం గమనార్హం. తన కెరీర్లో తాను సంతృప్త స్థాయికి చేరుకున్నానని, ఇప్పుడు యానిమల్ లాంటి సినిమాలే సరైనవని అతడు అన్నాడు. సందీప్ రెడ్డి వంగా డైరెక్ట్ చేసిన ఈ సినిమా.. ప్రపంచవ్యాప్తంగా రూ.900 కోట్లకుపైగా వసూలు చేసింది. అయితే ఇండస్ట్రీలోని సెలబ్రిటీలతోపాటు ఎంతో మంది ప్రేక్షకులు కూడా మూవీని విమర్శించారు.