Rajinikanth: రిపోర్టర్‌కు సీరియస్ వార్నింగ్ ఇచ్చిన రజనీకాంత్.. అలాంటి ప్రశ్నలు అడగొద్దన్నానా అంటూ.. వీడియో వైరల్
Rajinikanth: తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఓ రిపోర్టర్ కు సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు. తనను రాజకీయ సంబంధిత ప్రశ్న అడిగినందుకు అతడు ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Rajinikanth: రజనీకాంత్ పబ్లిగ్గా ఎప్పుడైనా కోపంగా కనిపించడం చూశారా? చాలా వరకు మీడియాతో, అభిమానులతో సున్నితంగా వ్యవహరిస్తూ చాలా సహనంతో కనిపిస్తాడు. కానీ తొలిసారి సూపర్ స్టార్ కూడా ఆగ్రహంతో ఊగిపోయాడు. అది కూడా ఓ రిపోర్టర్ కు సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు.తనను రాజకీయ సంబంధిత ప్రశ్న అడిగాడన్న కారణంతో రజనీ సహనం కోల్పోవడం గమనార్హం.
రజనీకాంత్ సీరియస్
రజనీకాంత్ చెన్నై ఎయిర్‌పోర్టులో రిపోర్టర్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఎయిర్ పోర్టు బయటకు వస్తుండగా.. అతన్ని మీడియా ప్రతినిధులు చుట్టుముట్టారు. వరుసగా ఎవరికి తోచిన ప్రశ్నలు వాళ్లు అడుగుతూ వెళ్లారు. అందులో ఒకరు ఓ రాజకీయ సంబంధిత ప్రశ్న అడిగారు.
నటుడు, తమిళనాడు అధికార పార్టీ నాయకుడు అయిన ఉదయనిధి స్టాలిన్ డిప్యూటీ సీఎం కాబోతున్నట్లు వస్తున్న వార్తలపై స్పందించాల్సిందిగా కోరారు. దీంతో రజనీ సహనం కోల్పోయాడు. "నన్ను రాజకీయ ప్రశ్నలు అడగొద్దు. ఇంతకుముందు కూడా మీకు చెప్పాను" అంటూ చాలా ఆగ్రహంగా ఆ రిపోర్టర్ ను చూస్తూ రజనీకాంత్ అన్నాడు.
అంతకుముందు, ఆ తర్వాత కూడా నవ్వుతూ రిపోర్టర్ల ప్రశ్నలకు సమాధానాలు చెప్పిన అతడు.. ఆ ప్రశ్నకు మాత్రం అలా రియాక్ట్ కావడం గమనార్హం. ఆ మధ్య రాజకీయాల్లోకి వచ్చేస్తున్నానంటూ పలుమార్లు చెప్పి.. చివరికి రావడం లేదని మాట మార్చిన రజనీ.. తర్వాత పాలిటిక్స్ కు పూర్తి దూరంగా ఉన్నాడు. కనీసం ఆ ప్రశ్నలకు కూడా అతడు స్పందించడం లేదు.
వెట్టైయాన్ ఆడియో లాంచ్
రజనీకాంత్ నటిస్తున్న మూవీ వెట్టైయాన్ ఆడియో లాంచ్ శుక్రవారం (సెప్టెంబర్ 20) చెన్నైలో జరిగింది. దీనికి ముందు అతడు చెన్నై ఎయిర్ పోర్టులో కనిపించాడు. అతని ఆ తర్వాతి మూవీ కూలీ కోసం కూడా చెన్నైలోనే షూటింగ్ చేస్తున్నట్లు సమాచారం. లోకేష్ కనగరాజ్ ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే.
ఇక వెట్టైయాన్ ఆడియో లాంచ్ కు ఎవరు వస్తున్నారని అడిగినప్పుడు కూడా తనకు తెలియదని రజనీకాంత్ చెప్పాడు. ఈ సినిమా మాత్రం చాలా బాగా వచ్చిందని, మూవీ రిలీజ్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నట్లు చెప్పాడు. ఈ మూవీలో తనది పూర్తి భిన్నమైన పాత్ర అని అన్నాడు. ఈ సినిమా అక్టోబర్ 10న రిలీజ్ కానుంది.