Qubool Hai Web Series Review | పాతబస్తీ కన్నీటి వ్యథలకు దృశ్యరూపం
‘ఖుబుల్ హై’ వెబ్ సిరీస్ ఇటీవల ఆహా ఓటీటీ ద్వారా విడుదలైంది. వాస్తవ ఘటనల స్ఫూర్తితో దర్శకనిర్మాతలు ఈ సిరీస్ ఏ విధంగా తెరకెక్కించారు? ఇందులో వారు చెప్పిన సందేశం ఏమిటంటే...
వాస్తవాలు ఎప్పుడూ కఠినంగానే ఉంటాయి. ఆ నిజాల మాటున దాగిఉండే కన్నీళ్లను, కష్టాలను చెప్పడం సులభం కాదు. అందుకు ఎంతో శోధన, ధైర్యం కావాలి. ‘ఖుబుల్ హై’ వెబ్ సిరీస్ ద్వారా దర్శకత్రయం ప్రణవ్, ఉమైర్ హసన్, ఫయాజ్ రాయ్ ఆ ప్రయత్నం చేశారు. అరబ్ షేక్ లా అకృత్యాలకు బలైపోతున్న చిన్నారుల జీవితాల్ని కళ్లకు కట్టినట్లుగా ఈ వెబ్ సిరీస్ లో చూపించారు. కొత్త నటీనటుల కలయికలో రూపొందిన ఈ వెబ్ సిరీస్ ఇటీవల ఆహా ఓటీటీ ద్వారా విడుదలైంది.
హెహనాజ్ (అభిలాష) ఓ సెల్ఫ్ డిఫెన్స్ ట్రైనర్. తలాబ్ కట్టాలోని స్కూల్ విద్యార్థినులకు కరాటే తో పాటు స్వీయరక్షణకు సంబంధించిన పాఠాల్ని నేర్పిస్తుంటుంది. అమీనా అనే పదమూడేళ్ల పాప నాలుగు రోజులుగా స్కూల్ కు రాదు. ఆమెను ఓ అరబ్ షేక్ కు ఇచ్చి వివాహం చేయబోతున్నారనే నిజం షెహనాజ్ కు తెలుస్తుంది. ఆ పెళ్లిని ఆపమని పోలీసులకు కంప్లైంట్ ఇస్తుంది. వారు పట్టించుకోరు. తలాబ్ కట్టా పోలీస్ స్టేషన్ కు భానుప్రకాష్ (మనోజ్ ముత్యం) అనే ఎస్ఐ కొత్తగా వస్తాడు. తన పై అధికారి సీఐ ఫైజన్ ఖాన్ (శ్రీకార్తిక్) మెప్పును పొందాలంటే ఏదైనా పెద్ద కేసును సాల్వ్ చేయాలని భాను అనుకుంటాడు. అమీనా తండ్రి మర్డర్ కేసు చేపడతాడు. ఈ కేసు పరిశోధనలో అరబ్ షేక్ లు చేసే మోసాలు, దళారీ ముఠా దందాల గురించి తెలుసుకుంటాడు. వారిని భాను పట్టుకోవాలని అనుకున్నా...ఫైజల్ వద్దని వారిస్తాడు. మరోవైపు చట్టం ప్రకారం దళారీలను ఎదుర్కోవడం కష్టం కావడంతో వారిని చంపడానికి బుర్కవాలీగా షెహనాజ్ అవతారం ఎత్తుతుంది. తన పై ఆఫీసర్ కు తెలియకుండా నేరస్తులను పట్టుకోవాలని అనుకున్న ఎస్ఐ భాను లక్ష్యం నెరవేరిందా? చిన్నారులను కాపాడటానికి బుర్కవాలీగా మారిన షెహనాజ్ చివరకు ఎమైంది? డబ్బు కోసం దళారీగా పనిచేసిన ఆసిఫ్ ఎలాంటి ఇబ్బందుల్ని ఎదుర్కొన్నాడు. ఈ నేరాలకు తలాబ్ కట్టాలో రాజకీయ నాయకుడిగా చెలామణి అయ్యే రఫీక్ తో పాటు పోలీస్ ఆఫీసర్ ఫైజల్ ఖాన్ కు ఉన్న సంబంధమేమిటన్నది ఈ సిరీస్ కథ.
పాతబస్తీలో ముస్లిం కుటుంబాల పేదరికాన్ని, అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని డబ్బు ఎరగా చూపించి మాయమాటలతో దళారులు వారిని ఎలా మోసం చేస్తున్నారు? పదిహేనేళ్ల లోపు మైనర్ బాలికల్ని ముసలి అరబ్ షేక్ లకు ఇచ్చి దొంగ పెళ్లిళ్లు చేయిస్తూ చిన్న వయసులోనే వారి జీవితాల్ని ఎలా చిదిమివేస్తున్నారనే వార్తలు తరచుగా పేపర్లలో కనిపిస్తూనే ఉంటాయి. కూతుళ్లకు బంగారు భవిష్యత్తు దొరుకుతుందని ఆశపడిన తల్లిదండ్రులు మోసపోతున్న కథనాలు మనసుల్ని కలిచివేస్తుంటాయి. ఆ వార్తల్ని, సంఘటనల్ని స్ఫూర్తిగా తీసుకొని తెరకెక్కించిన వెబ్ సిరీస్ ఇది. సామాజిక సందేశానికి మర్డర్ మిస్టరీ, పోలీస్ ఆఫీసర్ అన్వేషణను జోడించి తెరకెక్కించారు. పాతబస్తీలో పోలీస్ ఉద్యోగం చేయడం ఎంత కష్టమో నవ్విస్తూనే ఆలోచనత్మాకంగా ఆవిష్కరించారు. మరోవైపు ఆడపిల్లల కుటుంబాల్ని బ్రోకర్లు తమ మాయమాటలతో ఎలా బుట్టలో పడేస్తారో చెప్పారు.
సిరీస్ చూస్తున్నట్లుగా కాకుండా తలాబ్ కట్టాలో ప్రజల్ని నేరుగా చూస్తున్న అనుభూతి కలుగుతుంది. అక్కడి సామాజిక జీవన పరిస్థితుల్ని, మనుషుల్ని, వారి వేషభాషల్ని రియలిస్టిక్ తెరపై ఆవిష్కరించారు. తమ కన్వీనెన్స్ కోసం దర్శకనిర్మాతలు భాష మార్చడానికి ప్రయత్నించలేదు. ముస్లిం పాత్రధారులతో హిందీ లోనే మాట్లాడించారు. తెలుగు వారితో మాతృభాషలో డైలాగ్స్ చెప్పించారు. హైదరాబాదీ హిందీ, స్వచ్ఛమైన తెలంగాణ యాసను ఉపయోగిస్తూ సాగే డైలాగ్స్ కథలో లీనమయ్యేలా దోహదపడ్డాయి.
సినిమా, సిరీస్ ఏదైనా అంతిమంగా హీరోనే గెలుస్తాడు. ఆ ఫార్ములాకు అలవాటుపడిపోయాం. కానీ ఈ సిరీస్ ను దర్శకత్రయం భిన్నంగా ముగించారు. విలన్ లదే గెలుపుగా ఆవిష్కరిస్తూ ఎండ్ సీన్ తర్వాత ఏం జరుగుతుందనేది ప్రేక్షకుల ఊహలకు వదిలివేశారు.
కథాగమనం నిదానంగా సాగడం సిరీస్ కు మైనస్ గా మారింది. చాలా సన్నివేశాలు సాగదీసినట్లుగా అనిపిస్తుంది. చివరి ఎపిసోడ్ ఆకట్టుకోదు. సిరీస్ ను ఎలా ముగించాలో తెలియని అయోమయంలో దర్శకులు పడినట్లుగా అనిపిస్తుంది. ఫైజల్ ఖాన్, భాను మధ్య సంఘర్షణ ఆసక్తి లోపించింది. క్లైమాక్స్ ఫైట్ ను సరిగా డిజైన్ చేయనట్లుగా అనిపించింది. ఆ యాక్షన్ ఎపిసోడ్ మాస్ సినిమాల్లో హీరోలు చేసే ఫైట్ ను తలపిస్తుంది.
ఈ సిరీస్ లో పేరున్న నటీనటులు ఎవరూ లేరు. అందరూ కొత్తవారే నటించారు. షెహనాజ్ గా అభిలాష.. నిజాయితీ, అమాయకత్వం కలబోసిన పోలీస్ ఆఫీసర్ గా మనోజ్ ముత్యం.. బ్రోకర్ గా పనిచేసి చివరకు తన కూతురినే ఆ మురికి కూపానికి బలిచేసిన ఫిరోజ్ పాత్రలు ఆకట్టుకుంటాయి. నెగెటివ్ షేడ్స్ తో కూడిన పాత్రలో వినయ్ వర్మ కనిపించారు. ఫైజల్ ఖాన్ గా శ్రీకార్తిక్ నటన బాగుంది.
ఖుబుల్ హై అనే ఒక్క మాట అభంశుభం తెలియని చిన్నారుల జీవితాల్ని ఎలా నాశనం చేస్తుందో మనసుల్ని కదిలించేలా చూపించే సిరీస్ ఇది. రియలిస్టిక్, మెసేజ్ ఓరియెంటెండ్ కథాంశాల్ని ఇష్టపడే వారికి తప్పకుండా ఈ సిరీస్ మెప్పిస్తుంది. రెగ్యులర్ ఫార్మెట్ కు భిన్నంగా నవ్యమైన అనుభూతిని పంచుతుంది.