Pushpa Russian Trailer: తగ్గేదేలే.. పుష్ప రష్యన్ ట్రైలర్ చూశారా?
Pushpa Russian Trailer: తగ్గేదేలే అంటూ పుష్ప: ద రైజ్ మూవీ రష్యాలోనూ రిలీజ్ కాబోతోంది. తాజాగా రష్యన్ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సినిమా డిసెంబర్ 8న రష్యాలో రిలీజ్ కానున్న విషయం తెలిసిందే.
Pushpa Russian Trailer: పుష్ప రాజ్ తగ్గేదేలే అంటున్నాడు. భాష, దేశంతో సంబంధం లేకుండా సరిహద్దులు దాటేస్తున్నాడు. ఇండియాల ప్రభంజనం సృష్టించి ఇప్పుడు రష్యన్ ప్రేక్షకులకు తన సత్తా చూపించడానికి సిద్ధమవుతున్నాడు. పుష్ప: ది రైజ్ పేరుతో గతేడాది డిసెంబర్‌లో ఇండియాలో రిలీజైన ఈ మూవీ.. ఇప్పుడు సుమారు ఏడాది తర్వాత రష్యాలో రాబోతోంది.
గురువారం (డిసెంబర్ 1) నుంచి ఆ దేశంలో ప్రీమియర్ షోలు వేస్తున్నారు. డిసెంబర్ 1న మాస్కోలో, డిసెంబర్ 3న సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో పుష్ప మూవీ ప్రీమియర్ షోలు ఉండనున్నాయి. వీటికి అల్లు అర్జున్‌తోపాటు పుష్ప టీమ్ మొత్తం హాజరు కానుండటం విశేషం. ఇక డిసెంబర్ 8న రష్యా వ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ కానుంది.
ఈ నేపథ్యంలో ఈ మూవీ రష్యన్ ట్రైలర్‌ను మంగళవారం (నవంబర్ 29) మేకర్స్ రిలీజ్ చేశారు. ఇన్నాళ్లూ తెలుగుతోపాటు హిందీ, తమిళంలాంటి భాషల్లో పుష్ప డైలాగులు విన్న ఇక్కడి ప్రేక్షకులకు రష్యన్ భాషలో ఉన్న ట్రైలర్ వింతగా అనిపిస్తోంది. ఈ ట్రైలర్‌లో తగ్గేదేలే అనే డైలాగును కూడా అలాగే ఉంచారు.
ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో భాగంగా రష్యాలో పుష్ప మూవీని ప్రదర్శించనున్నారు. 24 రష్యన్ నగరాల్లో ఈ సినిమా రిలీజ్ అవుతుంది. ఇండియా నుంచి ఎంపికైన ఆరు సినిమాల్లో పుష్ప కూడా ఒకటి. దీంతోపాటు ఆర్‌ఆర్ఆర్, మై నేమ్ ఈజ్ ఖాన్, డిస్కో డ్యాన్స్, దంగల్, వార్ మూవీస్‌ను కూడా రష్యాలో రిలీజ్ చేయబోతున్నారు. మంగళవారమే అటు అల్లు అర్జున్ కూడా రష్యా బయలుదేరి వెళ్లాడు.
హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి అతడు మాస్కో వెళ్లాడు. బ్లాక్ ట్రౌజర్స్, వైట్ స్వెట్‌షర్ట్‌లో అర్జున్ హ్యాండ్సమ్‌గా కనిపించాడు. పుష్ప మూవీ ఇండియా వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. భారీ వసూళ్లు సాధించింది.
ఇప్పుడా మూవీ కంటే కూడా మరింత పెద్దగా పుష్ప సీక్వెల్‌ను తీసుకురావడానికి సుకుమార్ ప్రయత్నిస్తున్నాడు. ప్రస్తుతానికైతే షూటింగ్ ఇంకా ప్రారంభం కాలేదు. థాయ్‌లాండ్‌లో టెస్ట్ షూట్లు నిర్వహించిన తర్వాత.. అవి సంతృప్తికరంగా ఉంటే ఫైనల్ షూట్ డిసెంబర్ మొదటి వారంలో ప్రారంభయ్యే అవకాశాలు ఉన్నాయి.