Priyamani: తెలుగు టాప్ హీరోలతో సినిమాలు చేయకపోవడానికి కారణం అదే: ప్రియమణి ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Priyamani: తెలుగు, తమిళం భాషల్లో తాను టాప్ హీరోలతో సినిమాలు చేయకపోవడానికి కారణమేంటో వివరించింది ప్రియమణి. ఆమె చేసిన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
Priyamani: ప్రియమణి తెలుగుతోపాటు తమిళంలోనూ మంచి పేరు సంపాదించుకుంది. అయితే ఈ మధ్య బాలీవుడ్ సినిమాలతో ఆమె బిజీ అయింది. అక్కడ మాత్రం షారుక్ ఖాన్, అజయ్ దేవగన్ లాంటి టాప్ హీరోలతో సినిమాలు చేసింది. తాజాగా మైదాన్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అయితే తెలుగు,తమిళం భాషల్లో మాత్రం అగ్ర హీరోలతో తాను ఎందుకు నటించలేదో వివరించింది.
వాళ్లకు ఇబ్బంది అవుతుందనే..
గలాటా ప్లస్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రియమణి ఈ విషయంపై స్పందించింది. టాప్ తెలుగు, తమిళ హీరోలతో ఎందుకు పని చేయలేదు అని ప్రశ్నించగా.. ఇది తనకూ అంతు చిక్కడం లేదని ఆమె చెప్పింది. "టాప్ హీరోలతో నేను ఎందుకు నటించలేదన్నది నాకు కూడా ఆశ్చర్యంగానే ఉంది. ఈ ప్రశ్నకు ఇప్పటికీ సమాధానం లభించలేదు. ఈ విషయం డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లనే అడగాలి" అని ప్రియమణి చెప్పింది.
"ఈ విషయంలో నిజాయతీగా చెప్పాలంటే నేను ఏ వ్యక్తినీ నిందించడం లేదు. కానీ చాలా మంది మాత్రం అగ్ర హీరోలతో నటించొద్దని, వాళ్ల సినిమాల్లోనూ ఉండొద్దని అనడం మాత్రం నాకు తెలుసు. తన వల్ల వాళ్లకే ఇబ్బంది అన్న కారణం కావచ్చు. ఇదే విషయం నేను చాలా రోజులుగా వింటున్నాను. ఇది నిజం కాదని నాకు తెలుసు. కానీ ఇప్పటికీ కచ్చితమైన కారణం ఏంటన్నది మాత్రం తెలియదు. కారణం ఏదైనా సరే దీనిపై నేను పెద్దగా ఆలోచించడం లేదు. ఇప్పుడు నేనున్న పరిస్థితుల్లో బాగానే ఉన్నాను" అని ప్రియమణి చెప్పింది.
ప్రియమణి.. బాలీవుడ్‌లో బిజీ
ప్రియమణి ఒకప్పుడు తెలుగు, తమిళంలలో వరుస అవకాశాలు అందుకున్న నటి. అయితే ఈ మధ్య కాలంలో ఆమె బాలీవుడ్ పై దృష్టిసారించింది. తొలిసారి చెన్నై ఎక్స్‌ప్రెస్ మూవీలో షారుక్ ఖాన్ తో కలిసి ఓ స్పెషల్ పాటలో నటించింది. ఆ తర్వాత జవాన్ లోనూ కనిపించింది. ఈ మధ్యే ఆర్టికల్ 370 మూవీలోనూ ప్రియమణి నటించింది.
ఇక ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ తోనూ నార్త్ ప్రేక్షకులకు దగ్గరైంది. ఇప్పటికే ఈ సిరీస్ రెండు సీజన్లు పూర్తయిన విషయం తెలిసిందే. ఇందులో మనోజ్ బాజ్‌పాయీ భార్య పాత్రలో ఆమె నటించింది. ఈ సిరీస్ మూడో సీజన్ కూడా రానుంది. ఈ కొత్త సీజన్ తో ఆమె మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ మధ్యే ఆమె నార్త్, సౌత్ డిబేట్ పైనా స్పందించింది. నార్త్ హీరోయిన్ల కాస్త ఫెయిర్ గా ఉన్నా.. సౌత్ హీరోయిన్లు కూడా చాలా అందంగానే ఉంటారని ఆమె అనడం విశేషం. అజయ్ దేవగన్ తో కలిసి ప్రియమణి నటించిన మైదాన్ మూవీ బుధవారం (ఏప్రిల్ 10) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ మధ్యే ఆమె నటించిన భామా కలాపం 2 మూవీ కూడా ఆహా ఓటీటీలోకి వచ్చిన విషయం తెలిసిందే.
ప్రియమణి నటించిన తమిళ సినిమా కొటేషన్ గ్యాంగ్ మూవీ, కన్నడ మూవీ ఖైమారా రిలీజ్ కావాల్సి ఉన్నాయి.