Pawan Kalyan: రైతుల కోసం విరాళం ఇచ్చిన పవన్ కల్యాణ్ తల్లి
పవన్ కల్యాణ్‌కు చెందిన జనసేన పార్టీ రైతులకు సాయం చేస్తున్న విషయం తెలుసు కదా. దీనికోసం గతంలో పవన్ కుటుంబ సభ్యులు విరాళం ఇవ్వగా.. తాజాగా ఆయన తల్లి కూడా తన వంతు సాయం చేయడం విశేషం.
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ ఓవైపు వరుస సినిమాలతో బిజీగా ఉంటేనే మరోవైపు తన రాజకీయ కార్యకలాపాల్లో వేగం పెంచారు. ఈ మధ్య జనసేన పార్టీని విస్తృతంగా జనంలోకి తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తున్నారు. అక్టోబర్ నుంచి కాస్త సినిమాలకు బ్రేక్ ఇచ్చి ఎక్కువ సమయంలో పొలిటికల్ పనులకే కేటాయించాలని పవన్ నిర్ణయించారు.
ఈ నేపథ్యంలోనే జనసేన పార్టీ.. ఆంధ్రప్రదేశ్‌లో అప్పుల పాలై ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు సాయం చేస్తోంది. దీనికోసం ఎంతోమంది దాతలు జనసేన పార్టీకి విరాళాలు ఇస్తున్నారు. తాజాగా పవన్ కల్యాణ్ తల్లి అంజనమ్మ కూడా తన వంతుగా రూ.1.5 లక్షలు విరాళం ఇవ్వడం గమనార్హం. అంతేకాదు మరో రూ.లక్షను ఆమె జనసేన పార్టీకి విరాళంగా ఇచ్చారు.
గతంలో 2014లోనూ అంజనమ్మ జనసేనకు రూ.4 లక్షలు విరాళం ఇవ్వడం విశేషం. అప్పట్లో ఈ వార్త ఆసక్తి రేపగా.. మళ్లీ ఇన్నాళ్లకు రైతుల కోసం తన తనయుడు చేస్తున్న కృషికి తన వంతుగా మరికొంత సాయం చేశారు. పవన్ కల్యాణ్ ఇతర కుటుంబ సభ్యులు కూడా ఇప్పటికే రైతుల కోసం కొంత మొత్తం విరాళంగా ఇచ్చారు.
పవన్ సోదరుడు నాగబాబు, సోదరీమణులు విజయదుర్గ, మాధవి, మేనల్లుడు వైష్ణవ్ తేజ్, నాగబాబు తనయుడు వరుణ్ తేజ్, కూతురు నిహారికలు కలిసి రూ.35 లక్షలు ఇచ్చారు. అటు పవన్ మరో మేనల్లుడు, స్టార్ నటుడు సాయి ధరమ్ తేజ్ ఒక్కడే మరో రూ.10 లక్షలు విరాళమిచ్చాడు.
సంబంధిత కథనం