OG Movie Story: లీకైన ఓజీ స్టోరీ.. అదిరిపోయిన అసలు అర్థం.. మళ్లీ పాత కథేనంటూ ట్రోలింగ్
Pawan Kalyan OG Story: పవన్ కల్యాణ్ అభిమానులు ఇప్పుడు ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా ఓజీ. ఈ సినిమా టైటిల్ దగ్గర నుంచి మొన్నటి గ్లింప్స్ వరకు అదిరిపోయే బజ్ క్రియేట్ చేసింది. ఇప్పుడు ఓజీ మూవీ స్టోరీ ఇదేనంటూ సోషల్ మీడియాలో ఓ న్యూస్ ట్రెండ్ అవుతోంది.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాల కోసం ఆయన ఫ్యాన్స్ ఎంతగా ఎదురుచూస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇటీవల బ్రో సినిమాతో వచ్చిన ఆయన తాజాగా నటించిన మూవీ ఓజీ (OG Movie). సాహో ఫేమ్ యంగ్ డైరెక్టర్ సుజీత్ తెరకెక్కిస్తున్న ఓజీ సినిమాపై ఆది నుంచి భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 2న విడుదల చేసిన ఓజీ గ్లింప్స్ కు బీభత్సమైన రెస్పాన్స్ వచ్చింది. యూట్యూబ్‍లో ట్రెండింగ్‍లో నిలిచి పవన్ సత్తా ఏంటో మరోసారి నిరూపించింది. తాజాగా ఓజీ స్టోరీ లీక్ అయినట్లు సోషల్ మీడియాలో న్యూస్ చక్కర్లు కొడుతోంది.
ప్రతికారం
ఓజీ సినిమా కథ ఇదేనంటూ నెట్టింట్లో ఓ స్టోరీ రన్ అవుతోంది. "ఓజస్ గంభీరా అనే సాధారణ వ్యక్తి ముంబైకి టూరిస్టుగా వస్తాడు. అతను అనుకోకుండా గ్యాంగ్‍స్టర్‍గా మారతాడు. మాఫియాతోపాటు ఎన్నో నేరాలు చేసి తనకంటూ ఒక నేర సామ్రజ్యాన్ని ఏర్పాటు చేసుకుంటాడు. ఈ ప్రయాణంలో అతను తన కుటుంబాన్ని సైతం కోల్పోతాడు. అందుకు కారణమైన వారిపై ప్రతికారం తీర్చుకోవాలనుకుంటాడు. అలాగే డ్రగ్ మాఫియాను పూర్తిగా నాశనం చేయాలనుకుంటాడు" అని ఐఎమ్‍డీబీ (IMDb) సంస్థ తన సైట్‍లో ఓజీ స్టోరీ ఇదేనని పేర్కొంది.
అసలు అర్థం
ప్రతి సినిమాకు ఐఎమ్‍డీబీ సంస్థ రేటింగ్స్, రివ్యూస్‍తోపాటు వాటి స్టోరీ ఏంటని సంక్షిప్తంగా పొందుపరుస్తుంటుంది. ఓజీ సినిమా ట్రెండింగ్‍లోకి రాగానే దాని కథను అందుబాటులో ఉంచింది. దాదాపుగా ఇందులో ఉండే సినిమా కథలు నిజంగానే ఉంటాయి. ఇకపోతే ఇప్పటివరకు ఓజీ అంటే ఒరిజనల్ గ్యాంగ్‍స్టర్ అని అంతా అనుకున్నాం. కానీ, ఐఎమ్‍డీబీ ప్రకారం చూస్తే.. దాని అర్థం "ఓజాస్ గంభీరా" అని అర్థమవుతోంది. అంటే పవన్ కల్యాణ్ పేరును ఓజీగా షార్ట్ చేసి టైటిల్‍గా పెట్టారు. ఇక ఒరిజినల్ గ్యాంగ్‍స్టర్ అనేది దాని క్యాప్షన్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
సుజిత్‍పై నమ్మకం
ఇదిలా ఉంటే ఓజీ సినిమా స్టోరీపై ట్రోలింగ్ జరుగుతోంది. సేమ్ ఇలాంటి కథతోనే ఇదివరకు రామ్ పోతినేని రామ రామ కృష్ణ కృష్ణ సినిమా వచ్చింది. అందులో కూడా యాక్షన్ హీరో అర్జున్ సాధారణ వ్యక్తి. ముంబైకి ఉపాధి కోసం వచ్చి గ్యాంగ్‍స్టర్ అవుతాడు. ఈ క్రమంలోనే తన భార్యను కోల్పోతాడు. ఇలా మళ్లీ సుజిత్ పాత కథనే తీస్తున్నాడేంటీ అంటూ నెటిజన్లు నిరాశచెందినట్లు సమాచారం. అయితే, సుజిత్ టేకింగ్, డైరెక్షన్ మీద పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ మాత్రం గట్టి నమ్మకం పెట్టుకున్నారు. ఎందుకంటే సాహో ప్లాప్ అయినప్పటికీ చాలా మందికి ఆ సినిమా నచ్చింది. అలాగే రన్ రాజా రన్ మూవీ కూడా మంచి హిట్ కొట్టింది.