Ustaad Bhagat Singh: పవర్ స్టార్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ షూటింగ్ ఈనెలలోనే మళ్లీే షురూ.. రిలీజ్ అప్పుడేనా!
Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ తదుపరి షెడ్యూల్ గురించి సమాచారం వెల్లడైంది. పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి హరీశ్ శంకర్ దర్శకుడు.
Ustaad Bhagat Singh: పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన ‘బ్రో’ సినిమా గత వారం జూలై 28న విడుదలై థియేటర్లలో మంచి స్పందన దక్కించుకుంటోంది. ఇప్పటికే రూ.100 కోట్ల కలెక్షన్ల మార్కును దాటింది. బ్రో చిత్రంలో పవన్ పర్ఫార్మెన్స్, స్టైల్, స్వాగ్‌కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఈ తరుణంలో పవన్ కల్యాణ్ తదుపరి చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’ షూటింగ్ గురించి సమాచారం బయటికి వచ్చింది.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు ‘గబ్బర్ సింగ్’ లాంటి బంపర్ హిట్ ఇచ్చిన డైరెక్టర్ హరీశ్ శంకర్ మరోసారి ఆయనతో మూవీ చేస్తున్నాడు. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ పేరుతో ఈ చిత్రం రానుంది. కాగా, ఈ సినిమా షూటింగ్ తదుపరి షెడ్యూల్ ఈ నెలలోనే మొదలవుతుందని సమాచారం బయటికి వచ్చింది. ఈనెల మూడో వారంలో ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రీకరణ మళ్లీ ప్రారంభమవుతుందని తెలుస్తోంది. ఈ మేరకు డైరెక్టర్ హరీశ్ శంకర్ ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. షూటింగ్ గురించి బజ్ ఏర్పడటంతో నేడు ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్లో ట్రెండ్ అవుతోంది. రెండు నెలల క్రితం విడుదలైన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ గ్లింప్స్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.
మరోవైపు, ఈనెలలో షూటింగ్ మళ్లీ మొదలయ్యే ఛాన్స్ ఉండడంతో వచ్చే ఏడాది సంక్రాంతికి ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ విడుదలవుతుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. మూవీ టీమ్ కూడా అదే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఈ సినిమాలు రిలీజ్ చేయాలని ఆలోచిస్తున్నట్టు సమాచారం. ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రానికి కూడా కాస్త పొలిటికల్ ఫ్లేవర్, పొలిటికల్ డైలాగ్స్ ఉండే ఛాన్స్ కూడా ఉందనే రూమర్స్ వినిపిస్తున్నాయి. తమిళంలో సూపర్ హిట్ అయిన ‘తేరి’కి రీమేక్‌గా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ను రూపొందించనున్నాడు డైరెక్టర్ హరీశ్ శంకర్.
తన రాజకీయ పార్టీ జనసేన కార్యకలాపాలపై పవన్ కల్యాణ్ ప్రస్తుతం బిజీగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో వారాహి విజయయాత్ర చేస్తున్నారు. పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. దీంతో, పవన్ మళ్లీ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలుపెడతారో అని ఫ్యాన్స్ ఎదురుచూశారు. అయితే, ఈనెలలోనే ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రీకరణ ప్రారంభమవుతుందనే వస్తున్న సమాచారంలో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి ఈ సినిమాను తీసుకురావాలని చిత్ర యూనిట్‌ను సోషల్ మీడియాలో కోరుతూ ట్వీట్స్ చేస్తున్నారు.
మరోవైపు, ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్ నేడు (ఆగస్టు 2) పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రానికి ఆయనే సంగీతం అందించనున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పింది చిత్ర యూనిట్. ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్గా నటించనుంది.
టాపిక్