ఆ సినిమా చూసే నేను గోల్డ్ మెడల్ సాధించాను: పారాలింపిక్స్ ఛాంపియన్ కామెంట్స్ వైరల్.. ఇంతకీ ఆ మూవీ ఏదో తెలుసా?
పారాలింపిక్స్ లో గోల్డ్ మెడల్ గెలిచి చరిత్ర సృష్టించిన ఓ పారా అథ్లెట్.. తనను అలా చేయడానికి ఓ సినిమా పురిగొల్పిందని చెప్పడం విశేషం. ఆ మూవీలో నటించిన హీరో పక్కనే కూర్చొని అతడు ఆ మాట చెప్పాడు. అతడు చెబుతున్న ఆ మూవీ పేరు చందూ ఛాంపియన్.
బాలీవుడ్ నటుడు కార్తీక్ ఆర్యన్ నటించిన చందూ ఛాంపియన్ మూవీ తెలుసు కదా? ఈ సినిమా ఓ పారాలింపియన్ ను ఎంతో మోటివేట్ చేసిందట. అదే ఊపులో అతడు వెళ్లి పారిస్ పారాలింపిక్స్ లో ఏకంగా గోల్డ్ మెడల్ గెలిచి చరిత్ర సృష్టించాడు. ఆ అథ్లెట్ పేరు నవ్‌దీప్ సింగ్. అతడు ఈ విషయం చెబుతున్న వీడియో వైరల్ గా మారింది.
చందూ ఛాంపియన్ మోటివేట్ చేసింది..
బాలీవుడ్ లో ఈ ఏడాది రిలీజైన స్పోర్ట్స్ డ్రామా చందూ ఛాంపియన్. ఈ సినిమా మురళీకాంత్ పేట్కర్ అనే ఓ పారాలింపియన్ బయోపిక్ కావడం విశేషం. మహారాష్ట్రకు చెందిన ఈ పారా అథ్లెట్.. 1972 పారాలింపిక్స్ స్విమ్మింగ్ లో గోల్డ్ మెడల్ గెలిచి చరిత్ర సృష్టించాడు. అతని జీవిత చరిత్రపై వచ్చిన చందూ ఛాంపియన్ మూవీ ఇప్పుడు అలాంటి మరో పారా అథ్లెట్ ను మోటివేట్ చేసి దేశానికి మరో గోల్డ్ మెడల్ తెచ్చేలా చేయడం గమనార్హం.
పారిస్ పారాలింపిక్స్ లో జావెలిన్ త్రోలో నవ్‌దీప్ సింగ్ గోల్డ్ మెడల్ గెలిచాడు. అయితే తాను ఈ చారిత్రక మెడల్ సాధించేలా చందూ ఛాంపియన్ మూవీ తనను మోటివేట్ చేసిందని అతడు చెప్పాడు. ఇండియా టుడే కాన్‌క్లేవ్ లో నవ్‌దీప్ ఈ మాట చెబుతున్న వీడియో వైరల్ అయింది.
ఆ సినిమా చూస్తూ పారిస్ వెళ్లాను
ఇండియా టుడే కాన్‌క్లేవ్ లో భాగంగా పారాలింపిక్ ఛాంపియన్స్ అయిన అవని లెఖారా, నవ్‌దీప్, సుమిత్ ఆంటిల్ లతో కలిసి చందూ ఛాంపియన్ హీరో కార్తీక్ ఆర్యన్ పాల్గొన్నాడు. ఇందులో నవ్‌దీప్ మాట్లాడుతూ.. "పారిస్ ఒలింపిక్స్ కు వెళ్లే ముందు ఆ సినిమాను ప్రత్యేకంగా డౌన్ లోడ్ చేసి చూశాను.
ఆ సినిమా చూసి నేను మోటివేట్ అయ్యాను. కోచ్ అతన్ని మోటివేట్ చేయడం, ధారా సింగ్ ఫైట్, అతనిలాగా కావాలని అనుకోవడం.. ఇవి చూసి ఎంతో స్ఫూర్తి పొందాను. మొత్తం సినిమా నన్ను మోటివేట్ చేసినా.. ముఖ్యంగా ఈ భాగం మాత్రం బాగా నచ్చింది" అని నవ్‌దీప్ చెప్పాడు.
చందూ ఛాంపియన్ గురించి..
చందూ ఛాంపియన్ మూవీని ప్రముఖ దర్శకుడు కబీర్ ఖాన్ తెరకెక్కించాడు. ఇది ఓ పారాలింపియన్ బయోపిక్. మహారాష్ట్రలోని సతారా జిల్లాలో 1944లో జన్మించిన మురళీకాంత్ పేట్కర్ కు ఓ ప్రమాదంలో కాళ్లు చచ్చుబడిపోతాయి. ఒలింపిక్స్ కుస్తీ పోటీల్లో తాను ఇండియాకు గోల్డ్ మెడల్ తీసుకురావాలని కలలు కన్నా.. ఇలా జరగడంతో అతని కలలు కల్లలవుతాయి.
దీంతో అతడు పారాలింపిక్స్ వైపు చూస్తాడు. మొదట కుస్తీ, తర్వాత బాక్సింగ్.. చివరికి స్విమ్మింగ్ లో అతడు పట్టు సాధిస్తాడు. 1972లో మ్యూనిక్ లో జరిగిన పారాలింపిక్స్ లో ఇండియాకు మురళీకాంత్ గోల్డ్ మెడల్ సాధించి పెట్టాడు. అతని బయోపిక్ నే చందూ ఛాంపియన్ పేరుతో తెరకెక్కించారు. ఈ సినిమాకు అన్ని వర్గాల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా తెలుగులోనూ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది.