Paluke Bangaramayana in Star Maa: స్టార్ మాలో కొత్త సీరియల్ పలుకే బంగారమాయెనా.. ఎప్పటి నుంచంటే?
Paluke Bangaramayana in Star Maa: స్టార్ మాలో కొత్త సీరియల్ పలుకే బంగారమాయెనా రానుంది. దీనికి సంబంధించిన ప్రోమోను స్టార్ మా తాజాగా ట్విటర్ ద్వారా రిలీజ్ చేసింది.
Paluke Bangaramayana in Star Maa: తెలుగులో టాప్ సీరియల్స్ కు కేరాఫ్ అయిన స్టార్ మా ఛానెల్ మరో సరికొత్త సీరియల్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది. ఈ సీరియల్ పేరు పలుకే బంగారమాయెనా. రామదాసు రాసిన గీతంలోని తొలి పదాలనే టైటిల్ గా ఈ సీరియల్ తీసుకొస్తున్నారు. తాజాగా సోమవారం (మే 15) ఈ కొత్త సీరియల్ ప్రోమోను స్టార్ మా రిలీజ్ చేసింది.
ఈ ప్రోమో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. నత్తితో బాధపడుతున్న ఓ చిన్నారి చుట్టూ తిరిగే కథగా ఈ పలుకే బంగారమాయెనా సీరియల్ కనిపిస్తోంది. సంగీతం నేర్పిస్తే ఆ పాప నత్తి పోయి మామూలుగా మాట్లాడుతుందని ఆమె తల్లి ఆశిస్తుంది. సంగీతం నేర్పించడానికి ఓ గురువును కూడా ఇంటికి పిలిపిస్తుంది. సరిగమపదనిసలు నేర్పే క్రమంలోనే ఆ పాప వాటిని సరిగా పలకలేక ఇబ్బంది పడుతుంది.
దీంతో ఆ గురువు ఆమెకు సంగీతం నేర్పలేనని అంటాడు. సంగీతం వల్ల ఆమె నత్తి పోతుందన్న ఆలోచన సరైనదేనా.. దానివల్లే ఆమెకు సంగీతం రావడం లేదని, ఈ ప్రయత్నం విరమించుకుంటే మంచిదని చెప్పి వెళ్లిపోతాడు. ఇంతలో అక్కడికి వచ్చిన ఆమె తండ్రి.. అది చూసి అసహనం వ్యక్తం చేస్తాడు. ఆ పాప బతుకు ఇంతేనని, ఏమీ రాదని అంటూ వెళ్లిపోతాడు.
ప్రేమను దూరం చేసిన లోకం.. పసి హృదయానికి శాపమా అనే వాయిస్ తో ప్రోమో ముగుస్తుంది. ఈ పలుకే బంగారమాయెనా సీరియల్ ఎప్పుడు ప్రారంభం అవుతుందన్నది స్టార్ మా వెల్లడించలేదు. అయితే త్వరలోనే రానుందని ప్రకటించింది. ఈ కొత్త సీరియల్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే నమ్మకంతో ఆ ఛానెల్ ఉంది.
ఇప్పటికీ తెలుగులోని సీరియల్స్ లో టీఆర్పీ రేటింగ్స్ ప్రకారం.. టాప్ 5లో అన్నీ స్టార్ మా సీరియల్సే కావడం విశేషం. ఆ ఛానెల్లో వస్తున్న బ్రహ్మముడి, గుప్పెడంత మనసు, కృష్ణా ముకుందా మురారిలాంటి సీరియల్స్ మంచి ఆదరణ సంపాదించాయి.
సంబంధిత కథనం