Ott vs Theatre: థియేటర్ లో విడుదలైన రెండు వారాల్లోనే ఓటీటీలో...తగ్గుతున్న డేస్ గ్యాప్...-ott vs theatre impact of ott platforms on theatre business ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Vs Theatre: థియేటర్ లో విడుదలైన రెండు వారాల్లోనే ఓటీటీలో...తగ్గుతున్న డేస్ గ్యాప్...

Ott vs Theatre: థియేటర్ లో విడుదలైన రెండు వారాల్లోనే ఓటీటీలో...తగ్గుతున్న డేస్ గ్యాప్...

Nelki Naresh Kumar HT Telugu
Jun 20, 2022 08:53 AM IST

గతంలో థియేటర్ లో విడుదలైన ఓ సినిమాను ఓటీటీలో (ott) చూడాలంటే దాదాపు రెండు నెలల వరకు వేచిచూడాల్సివచ్చేది. కానీ ఇప్పుడు రెండు వారాల్లోనే ఓటీటీలో సినిమా వస్తోంది. భారీ బడ్జెట్ సినిమాలు కూడా ఇరవై రోజుల్లోనే ఓటీటీలలో విడుదలవుతున్నాయి. రోజురోజుకు థియేటర్, ఓటీటీ రిలీజ్ మధ్య డేస్ గ్యాప్ తగ్గుతూ రావడం టాలీవుడ్ (tollywood) వర్గాలను కలవరపెడుతోంది.

<p>స‌ర్కారువారి పాట‌</p>
స‌ర్కారువారి పాట‌ (twitter)

ప్ర‌స్తుతం థియేట‌ర్ల‌కు ఓటీటీ ప్లాట్‌ఫామ్ లు  గ‌ట్టిపోటీనిస్తున్నాయి.  థియేట‌ర్ల‌లో శుక్ర‌వారం ఒక‌టి రెండు సినిమాలు రిలీజ్ అయితే ఓటీటీల‌లో మాత్రం ప‌దుల సంఖ్య‌లో సినిమాలు, సిరీస్ లు విడుదలవుతున్నాయి.  థియేట‌ర్ల‌తో పోలిస్తే ఓటీటీల‌లో ప్ర‌తి వారం ఎక్కువ‌గా కొత్త కంటెంట్ అందుబాటులో ఉంటుంది. ఈ ప్రభావంతో  నిదానంగా  ప్రేక్ష‌కులు థియేట‌ర్ల‌కు దూరం అవుతూ ఓటీటీల‌కు అల‌వాటుప‌డిపోతున్నారు. ఈ సంఖ్య వారం వారం పెరుగుతూ ఉండటంతో థియేట‌ర్ల‌కు వ‌చ్చే రెవెన్యూ క్ర‌మంగా త‌గ్గిపోతున్న‌ది. ఇది ఇలాగే కొన‌సాగితే భ‌విష్య‌త్తులో థియేట‌ర్ల మ‌నుగ‌డ‌కు ప్ర‌మాదం వాటిల్లే అవ‌కాశం ఉంద‌ని ఎగ్జిబిట‌ర్లు, డిస్ట్రిబ్యూట‌ర్లు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు.

గ‌తంలో యాభై రోజులు...

ఇది వ‌ర‌కు థియేట‌ర్, ఓటీటీ రిలీజ్ కు మ‌ధ్య నెల‌న్న‌ర నుంచి రెండు నెల‌ల వ‌ర‌కు గ్యాప్ ఉండేది. సినిమా పూర్తిగా థియేట‌ర్ల నుండి తీసేసిన త‌ర్వాతే ఓటీటీల‌లో రిలీజ్ అయ్యేది.  థియేట‌ర్ల‌లో విడుద‌లైన యాభై రోజుల త‌ర్వాతే ఓటీటీల‌లో సినిమాల్ని రిలీజ్ చేయాల‌ని గతంలో టాలీవుడ్ నిర్మాత‌లు సమిష్టిగా ఒప్పందాలు చేసుకున్నారు. కానీ ఆ నిర్ణయాలేవి ప్ర‌స్తుతం అమ‌లు కావ‌డం లేదు. యాభై రోజుల గ‌డువు కాస్త త‌గ్గుతూ నేడు పదిహేను రోజులకు వచ్చింది. అది ఇంకా తగ్గితే థియేటర్లకు వచ్చే కొద్ది మంది ప్రేక్షకులు కూడా తగ్గిపోయే ప్రమాదం ఉంది.

ఇర‌వై రోజుల్లోనే ఓటీటీలోకి స‌ర్కారువారి పాట‌(sarkaru vaari paata)

 మ‌హేష్ బాబు (mahesh babu) హీరోగా  న‌టించిన స‌ర్కారువారి పాట చిత్రం మే 12న థియేట‌ర్ల‌లో రిలీజ్ అయ్యింది. జూన్ 2 నుండి ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది అగ్ర హీరో నటించిన సినిమా ఇర‌వై రోజుల వ్య‌వ‌ధిలోనే ఓటీటీలో రిలీజ్ కావడం టాలీవుడ్ లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. థియేట‌ర్ల‌లో సినిమా న‌డుస్తుండ‌గానే ఓటీటీలో  రిలీజ్ చేయ‌డం ప‌ట్ల మ‌హేష్‌బాబు అసంతృప్తిని వ్య‌క్తం చేసిన‌ట్లు వార్త‌లొచ్చాయి. కేజీఎఫ్ 2 కూడా నెల రోజుల్లో నే ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమా కూడా థియేట‌ర్ల‌లో ఆడుతుండ‌గానే ఓటీటీ లో రిలీజ్ చేశారు. అలాగే  యూత్ ఫుల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కిన డీజే టిల్లు ఇర‌వై రోజుల్లోనే ఓటీటీ ద్వారా ప్రేక్షకుల్ని పలకరించింది. పవన్ కళ్యాణ్ (pawan kalyan)  భీమ్లానాయ‌క్  సినిమా ఇర‌వై ఏడు రోజుల్లో డిజిట‌ల్ ప్లాట్ ఫామ్స్ లో సందడి చేసింది. ఇవే కాదు ఈ ఏడాది హిట్ అయినా చాలా సినిమాలు నెల రోజుల వ్యవధిలోనే ఓటీటీలలో రిలీజ్ అయ్యాయి.

నెగెటివ్ టాక్ వ‌స్తే  రెండు వారాల్లోపే...

సినిమా హిట్ అయితే ఇర‌వై రోజులు ఆగుతున్నారు. అలా కాకుండా సినిమాకు థియేట‌ర్ల‌లో కొంచెం నెగెటివ్ టాక్ వచ్చినా రెండు వారాల్లోనే ఓటీటీల‌లో రిలీజ్ చేస్తున్నారు. చిరంజీవి, రామ్ చ‌ర‌ణ్ హీరోలుగా న‌టించిన ఆచార్య (acharya) థియేట‌ర్ల‌లో ప్రేక్ష‌కుల మెప్పును పొంద‌లేక‌పోయింది. దాంతో ఈ సినిమాను కేవలం ఇర‌వై రోజుల వ్యవధిలోనే  ఓటీటీ లో రిలీజ్ చేశారు.  వ‌రుణ్ తేజ్ గ‌ని సినిమా కేవలం ప‌ధ్నాలుగు రోజుల్లోనే ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చింది, గుడ్ ల‌క్ స‌ఖి రెండు వారాలు, శ్రీవిష్ణు భ‌ళా తంద‌నాన ప‌దిహేను రోజులు   ఇలా ఇటీవల కాలంలో నెగెటివ్ టాక్ తెచ్చుకున్న ఎన్నో సినిమాలు పదిహేను నుండి ఇరవై రోజుల మధ్యలోనే ఓటీటీలలో విడుదలయ్యాయి. 

ఈ రిలీజ్‌ల‌కు సంబంధించిన ప్ర‌క‌ట‌న‌లు నాలుగైదు రోజుల ముందుగానే వెలువడుతుండటంతో ఎలాగూ ఓటీటీల‌లో వ‌స్తుంద‌నే భ‌రోసాతో ఈ గ్యాప్ లో ఆయా సినిమాల్ని చూడటానికి థియేటర్లకు వచ్చే కొద్ది పాటి ప్రేక్షకులు కూడా మిన్నకుండిపోతున్నారు. డిజిటల్ రైట్స్ ద్వారా నిర్మాతలకు ముందుగానే భారీ మొత్తంలో డబ్బులు రావడంతో వారు ఓటీటీ సంస్థల నిర్ణయాల్ని వారు వ్యతిరేకించడం లేదు.

గ్యాప్ పై ఆందోళ‌న‌

థియేటర్, ఓటీటీ రిలీజ్ లకు మధ్య గ్యాప్ తగ్గుతూ పోవడం పట్ల ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లతో పాటు కొందరు నిర్మాతలు కూడా అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇలాగే కొనసాగితే సినీ పరిశ్రమ కు భారీ నష్టాలు తప్పవని అంటున్నారు. కొద్ది పాటి రెవెన్యూకు ఆశపడితే అసలుకే మోసం వస్తుందని హెచ్చరిస్తున్నారు. సినిమా కోసం నిర్మాతలు పెట్టిన పెట్టుబడిని వెనక్కి రాబట్టుకోవడంలో థియేటర్లు ప్రధాన భూమిక పోషిస్తాయి. డిజిటల్, శాటిలైట్ అనేది అదనపు ఆదాయ వనరుగా నిర్మాతలకు ఉపయోగపడుతుంది. కానీ అదే మెయిన్ రెవెన్యూగా భావిస్తే థియేటర్ల మనుగడ పూర్తిగా కనుమరుగైపోతాయని చెబుతున్నారు. ఆ ఆలోచన ధోరణి నిర్మాతల్లో నుండి తొలగి పోవాలని సూచిస్తున్నారు. 

చ‌ర్చ‌లు స‌ఫ‌ల‌మేనా...

ఓటీటీలకు అలవాటుపడిన ప్రేక్షకుల్ని తిరిగి థియేటర్లకు రప్పించాలనే రిలీజ్ మధ్య గ్యాప్ ఎక్కువగా ఉండాలని కొందరు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఇదే విషయమై టాలీవుడ్ లో చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. నెల నుండి నలభై ఐదు రోజుల విరామం ఉండేలా నిర్మాతలు చర్యలు చేపడుతున్నట్లు సమాచారం. ఈ విషయమై ఓటీటీ సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిసింది. మరి నిర్మాతల సూచనలకు ఓటీటీ సంస్థలు కట్టుబడి ఉంటాయా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.

Whats_app_banner

సంబంధిత కథనం