OTT Tamil Legal Drama: ఓటీటీలోకి ఐదు నెలల తర్వాత ఇంట్రెస్టింగ్ తమిళ లీగల్ డ్రామా.. నీట్ స్టూడెంట్స్ కష్టాలతో..
OTT Tamil Legal Drama: ఓటీటీలోకి ఓ ఇంట్రెస్టింగ్ తమిళ లీగల్ డ్రామా స్ట్రీమింగ్ కు వచ్చింది. నీట్ (NEET) విద్యార్థులు, వాళ్ల పేరెంట్స్ పడే కష్టాలను కళ్లకు కట్టడంతోపాటు ఓ విద్యార్థి చేసే న్యాయ పోరాటాన్ని ఈ మూవీలో చూడొచ్చు.
OTT Tamil Legal Drama: ఓటీటీల్లో తమిళ సినిమాలను ఆదరించే తెలుగు ప్రేక్షకులకు ఓ గుడ్ న్యూస్. థియేటర్లలో రిలీజైన నాలుగు నెలల తర్వాత ఇప్పుడో ఆసక్తికరమైన లీగల్ డ్రామా మంగళవారం (అక్టోబర్ 29) నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీ పేరు అంజామై (Anjaamai). తన తండ్రి అకాల మరణం తర్వాత ప్రభుత్వంపై ఓ నీట్ స్టూడెంట్ చేసే న్యాయ పోరాటం చుట్టూ తిరిగే కథ ఇది.
విధార్థ్, వాణీ భోజన్, రెహమాన్ లాంటి వాళ్లు ఇందులో నటించారు. ఐఎండీబీలో 7 రేటింగ్ ఉన్న ఈ ఎమోషనల్ లీగల్ డ్రామా అక్కడి ప్రేక్షకులకు బాగానే ఆకట్టుకుంది. ముఖ్యంగా మూవీలోని ప్రధాన పాత్రల నటన, మూవీ ఇచ్చిన సామాజిక సందేశం, ఎమోషనల్ సీన్స్ కు ఆడియెన్స్ బాగా కనెక్ట్ అయ్యారు.
అంజామై మూవీ స్టోరీ ఇదీ..
తమిళంలో అంజామై అంటే భయం లేకపోవడం అని అర్థం. తన కొడుకు నీట్ పరీక్ష కోసం ఆర్టిస్ట్ గా ఉన్న సర్కార్ (విధార్థ్) అనే వ్యక్తి ఓ రైతుగా మారాల్సి వస్తుంది. తన పెద్ద కొడుకును డాక్టర్ ను చేయాలని కలలు కంటాడు. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం నేషనల్ ఎలిజబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) ప్రవేశపెడుతుంది.
ఈ పరీక్ష వల్ల డాక్టర్లు కావాలని కలలు కనే స్టూడెంట్స్, వాళ్ల పేరెంట్స్ ఎలాంటి ఇబ్బందులు పడ్డారో అంజామై మూవీలో చూపించే ప్రయత్నం చేశారు. సర్కార్ కూడా తన కొడుకు కోసం ఎన్నో కష్టాలు పడతాడు. ఆ ఒత్తిడి తట్టుకోలేక అకాల మరణం చెందుతాడు. దీంతో అతని కొడుకు అధికారులపై కోర్టుకెక్కుతాడు. చివరికి ఈ న్యాయ పోరాటం ఎక్కడి వరకు వెళ్తుంది? అతనితోపాటు మిగిలిన విద్యార్థులు నీట్ పై చేసే ఈ ఫైట్ లో విజయం సాధిస్తారా లేదా అన్నది ఈ అంజామై మూవీలో చూడొచ్చు.
నీట్ పరీక్షను తీసుకొచ్చిన తర్వాత తమిళనాడులో జరిగిన ఆత్మహత్యలు, అకాల మరణాల ఆధారంగా ఈ సినిమాను చిత్రీకరించారు. అయితే మెలోడ్రామా కాస్త ఎక్కువగా ఉందన్న విమర్శలు కూడా వచ్చాయి. థియేటర్లలో రిలీజైనప్పుడు మిక్స్‌డ్ నుంచి పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. మరి ఇప్పుడు ఆహా తమిళంలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ అంజామై మూవీని ఓటీటీ ప్రేక్షకులు ఎంతమేర ఆదరిస్తారో చూడాలి.