NTR | కలవనందుకు క్షమించండి.. కలకాలం దీవించండి: ఎన్టీఆర్
తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పినవారందరికీ జూనియర్ ఎన్టీఆర్ ధన్యవాదాలు తెలిపారు. ట్విటర్ వేదికగా ఓ ప్రకటనను విడుదల చేసిన తారక్.. అభిమానులను కలవనందుకు క్షమాపణలు కోరారు.
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా సినీ ప్రముఖుల నుంచి సగటు ప్రేక్షకుల వరకు ఆయనకు బర్త్ డే విషెస్ చెప్పారు. ఇంక అభిమానుల గురించైతే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, తెలుగు రాష్ట్రాలతో పాటు విదేశాల్లో ఉండే ఫ్యాన్స్ కూడా ఆయన పుట్టిన రోజు వేడుకలు చేసుకుంటున్నారు. తమ హీరోను చూసి ఒక్కసారైన శుభాకాంక్షలు చెప్పాలనే ఉద్దేశంతో గురువారం అర్ధరాత్రి నుంచే హైదారాబాద్‌లో ఆయన ఇంటి వద్దకు భారీ సంఖ్యలో చేరుకున్నారు. అయితే వారిని కలవడం కుదరలేదు. కానీ ఈ ప్రేమాభిమానాలకు ముగ్ధుడైన తారక్.. సోషల్ మీడియా వేదికగా తన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. తనపై చూపిస్తున్న ప్రేమకు ఎప్పటికీ రుణపడి ఉంటానని ప్రకటన విడుదల చేశారు.
"నాకు శుభాకాంక్షలు తెలిపిన నా స్నేహితులు, కుటుంబ సభ్యులు, సన్నిహితులు, నా సహచరులకు, సినీ ప్రముఖులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. నాకు విషెస్ చెప్పేందుకు వచ్చిన నా అభిమానులకు ఎల్లవేళలా కృతజ్ఞుడినై ఉంటాను. మీ ప్రేమాభిమానాలు నా హృదయాన్ని తాకాయి. నా పుట్టిన రోజును ప్రత్యేకంగా నిలిపాయి. నన్ను కలవడానికి వచ్చిన మీ అందరికీ నేను క్షమాపణలు చెబుతున్నాను. ఎందుకంటే అప్పుడు నేను ఇంట్లో లేను. ఎల్లలు లేని మీ ప్రేమ, మద్దతు, ఆశీర్వాదాలను గొప్పగా భావిస్తాను. ఎప్పుడు మీ ప్రేమకు రుణపడే ఉంటాను" అని జూనియర్ ఎన్టీఆర్ తన ప్రకటనలో పేర్కొన్నారు.
ఇటీవల ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ఇండియా స్థాయిలో సూపర్ హిట్ అందుకున్న తారక్.. ప్రస్తుతం కొరటాల శివతో ఓ సినిమా చేయబోతున్నారు. NTR30 పేరుతో రానున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. తారక్ పుట్టినరోజు సందర్భంగా గురువారం నాడు ఈ చిత్రానికి సంబంధించిన మోషన్ పోస్టర్ వీడియోను విడుదల చేసింది చిత్రబృందం. ఈ సినిమాకు అనిరుధ్ సంగీతాన్ని అందిస్తుండగా.. సాబు సిరిల్, రత్నవేలు, శ్రీకర్ ప్రసాద్ లాంటి వారు సాంకేతిక నిపుణులుగా పనిచేస్తున్నారు.
ఈ సినిమాతో పాటు ప్రశాంత్ నీల్‌తో కూడా ఓ చిత్రాన్ని చేయబోతున్నారు ఎన్టీఆర్. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆ సినిమా పోస్టర్‌ను కూడా విడుదల చేశారు మేకర్స్. NTR31 పేరుతో రానున్న ఈ సినిమాలో తారక్.. భూమిపుత్రుడిగా చేయనున్నట్లు తెలుస్తోంది. ఇంటెన్స్ లుక్, గుబురు గడ్డం, మీసాలతో మాస్‌గా కనిపిస్తున్నారు. ఈ రెండు సినిమాలు వచ్చే ఏడాది విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.
సంబంధిత కథనం
టాపిక్