Nitin Desai suicide: షాకింగ్.. నేషనల్ అవార్డు గెలిచిన ఆర్ట్ డైరెక్టర్ ఆత్మహత్య
Nitin Desai suicide: షాకింగ్.. నేషనల్ అవార్డు గెలిచిన ఆర్ట్ డైరెక్టర్ ఆత్మహత్య చేసుకున్నాడు. లగాన్, దేవదాస్ లాంటి సినిమాలకు ఆర్ట్ డైరెక్టర్ గా చేసిన నితిన్ దేశాయ్ బలవన్మరణానికి పాల్పడినట్లు తెలుస్తోంది.
Nitin Desai suicide: బాలీవుడ్ లో విషాదం నెలకొంది. నేషనల్ అవార్డు గెలిచిన ఆర్ట్ డైరెక్టర్ నితిన్ దేశాయ్ చనిపోయాడు. బుధవారం (ఆగస్ట్ 2) ఉదయం కర్జత్ లోని ఎన్డీ స్టూడియోలో నితిన్ మృతదేహం కనిపించింది. అతడు ఆత్మహత్య చేసుకొని చనిపోయినట్లు ప్రాథమికంగా వచ్చిన రిపోర్టులు వెల్లడించాయి. అయితే అతని మరణానికి కారణమేంటన్నది మాత్రం తెలియలేదు.
బెస్ట్ ఆర్ట్ డైరెక్టర్ కేటగిరీలో నితిన్ ఏకంగా నాలుగుసార్లు నేషనల్ అవార్డు గెలవడం విశేషం. రెండు దశాబ్దాలుగా బాలీవుడ్ లోని ప్రముఖ డైరెక్టర్లతో అతడు పని చేశాడు. సంజయ్ లీలా భన్సాలీ, అశుతోష్ గోవారికర్, విదు వినోద్ చోప్రాలాంటి డైరెక్టర్లు అందులో ఉన్నారు. లగాన్, హమ్ దిల్ దే చుకే సనమ్, దేవదాస్, జోధా అక్బర్, వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ ముంబై, బాజీరావ్ మస్తానీలాంటి సూపర్ హిట్ సినిమాలకు ఆర్ట్ డైరెక్టర్ గా పని చేశాడు.
2019లో అశుతోష్ గోవరికర్ డైరెక్షన్ లో వచ్చిన పానిపట్ మూవీ నితిన్ కెరీర్లో చివరి సినిమా. బాలీవుడ్ కు అందించిన సేవలకుగాను నితిన్ ను ఆర్ట్ డైరెక్టర్స్ గిల్డ్ ఫిల్మ్ సొసైటీ, హాలీవుడ్ కు చెందిన అమెరికన్ సినిమాతీక్ అతన్ని గౌరవించాయి. నితిన్ ఆర్ట్ డైరెక్టర్ గానే కాదు.. 2003లో దేశ్ దేవి మా ఆషాపుర సినిమాకు ప్రొడ్యూసర్ గానూ వ్యవహరించాడు.
మరాఠీ పాపులర్ సీరియల్ రాజా శివ్‌ఛత్రపతిని కూడా నితినే ప్రొడ్యూస్ చేశాడు. 2005లో ముంబై శివార్లలోని కర్జత్ లో అతడు ఎన్డీ స్టూడియోస్ ఓపెన్ చేశాడు. 52 ఎకరాల్లో విస్తరించిన ఈ స్టూడియోలో ఎన్నో సినిమా సెట్లు వేశారు. జోధా అక్బర్ సినిమా కూడా ఈ స్టూడియోలోనే తీశారు. అయితే ఇప్పుడదే స్టూడియోలో ఆత్మహత్య చేసుకొని చనిపోవడం విషాదం నింపింది.
నితిన్ మరణంపై బీజేపీ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డే స్పందించారు. అతడు తనకు అత్యంత సన్నిహితుడని చెప్పారు. "నేను తరచూ అతనితో మాట్లాడుతూ సలహాలు ఇస్తుండేవాడిని. ఎన్నో నష్టాలకు గురైనా అమితాబ్ బచ్చన్ మళ్లీ ఎలా నిలదొక్కుకున్నాడో చెప్పేవాడిని. ఒకవేళ అప్పుల వల్ల స్టూడియోను జప్తు చేసినా.. మళ్లీ జీవితాన్ని కొత్తగా ప్రారంభించాలని చెబుతుండేవాడిని. అతని మరణ వార్త విని చాలా బాధ కలుగుతోంది. నిన్ననే అతనితో మాట్లాడాను" అని వినోద్ చెప్పారు.
టాపిక్