Nandamuri Mokshagnya: మోక్షజ్ఞ తొలి సినిమాకే భారీ బడ్జెట్.. ఎన్ని కోట్లంటే?-nandamuri mokshagnya teja debut movie with prasanth varma budget estimates are 100 crore ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Nandamuri Mokshagnya: మోక్షజ్ఞ తొలి సినిమాకే భారీ బడ్జెట్.. ఎన్ని కోట్లంటే?

Nandamuri Mokshagnya: మోక్షజ్ఞ తొలి సినిమాకే భారీ బడ్జెట్.. ఎన్ని కోట్లంటే?

Chatakonda Krishna Prakash HT Telugu
Sep 17, 2024 02:21 PM IST

Nandamuri Mokshagnya - Prasanth Varma: నందమూరి మోక్షజ్ఞ తెరంగేట్రం చేసేందుకు రెడీ అయ్యారు. ప్రశాంత్ వర్మ దర్శకత్వం చేసే మూవీతో ఆయన సినీ ఇండస్ట్రీలోకి వచ్చేస్తున్నారు. అయితే, ఈ సినిమా బడ్జెట్ ఎంత ఉండనుందో తాజాగా సమాచారం బయటికి వచ్చింది. ఇది ఆశ్చర్యపరిచేలా ఉంది.

Nandamuri Mokshagna: మోక్షజ్ఞ తొలి సినిమాకే భారీ బడ్జెట్.. ఎన్ని కోట్లంటే?
Nandamuri Mokshagna: మోక్షజ్ఞ తొలి సినిమాకే భారీ బడ్జెట్.. ఎన్ని కోట్లంటే?

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షజ్ఞ తేజ తెరంగేట్ర మూవీ ఖరారైంది. హనుమాన్ చిత్రంతో పాన్ ఇండియా రేంజ్‍లో హిట్ కొట్టిన ప్రశాంత్ వర్మతో తన తొలి చిత్రాన్ని మోక్షజ్ఞ చేయనున్నారు. ఈ చిత్రంపై అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. దీంతో మోక్షజ్ఞ ఎంట్రీ కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న నందమూరి అభిమానుల ఆకాంక్ష తీరనుంది. అయితే, మోక్షజ్ఞ తొలి సినిమా బడ్జెట్ భారీగా ఉండనుందని తాజాగా సమాచారం బయటికి వచ్చింది.

బడ్జెట్ అంచనాలు ఇలా..

ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (పీవీసీయూ)లో రెండో చిత్రంగా మోక్షజ్ఞ మూవీ ఉండనుంది. దీంతో అతడిని సూపర్ హీరోగా ప్రశాంత్ వర్మ చూపించనున్నారు. హనుమాన్ తర్వాత ఈ సినిమాటిక్ యూనివర్స్‌లో రానున్న చిత్రం ఇదే. ఈ చిత్రంలో గ్రాఫిక్స్ కూడా ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి.

మోక్షజ్ఞ, ప్రశాంత్ వర్మ కాంబినేషన్‍లో రానున్న ఈ చిత్రం సుమారు రూ.100 కోట్ల బడ్జెట్‍తో రూపొందుతుందని అంచనాలు ఉన్నాయి. బాలయ్య వారసుడు ఎంట్రీ ఇస్తుండటంతో ఫుల్ క్రేజ్ ఉండడం, ప్రశాంత్ వర్మ సిద్ధం చేసిన సబ్జెక్టుపై నమ్మకం ఉండటంతో ఈ మూవీకి ఈ స్థాయిలో ఖర్చు చేసేందుకు నిర్మాతలు సిద్ధమయ్యారని ఇండస్ట్రీ వర్గాల టాక్. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ కూడా మొదలుకానుంది.

మోజ్ఞక్షతో ప్రశాంత్ వర్మ తెరకెక్కించే ఈ చిత్రం కూడా పురాణాల ఆధారంగానే ఉంటుందని తెలుస్తోంది. ఇంట్రెస్టింగ్ కథతో సూపర్ హీరో మూవీలా ఉంటుందని టాక్. ఈ చిత్రాన్ని ఎస్‍ఎల్‍వీ సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మించనున్నారు. లెజెండ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై బాలకృష్ణ కూతురు నందమూరి తేజస్విని సమర్పించనున్నారు.

నందమూరి మోక్షజ్ఞ పుట్టిన రోజు సందర్భంగా సెప్టెంబర్ 6న ఈ చిత్రంపై అధికారిక ప్రకటన వచ్చింది. సింబా వచ్చేస్తున్నారంటూ ప్రశాంత్ వర్మ ఓ పోస్టర్ తీసుకొచ్చారు. ఈ చిత్రంలో నటించే నటీనటులు, టెక్నిషియన్ల వివరాలను మూవీ టీమ్ త్వరలో వెల్లడించే అవకాశం ఉంది.

ప్రశాంత్ వర్మ లైనప్

తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన హనుమాన్ సినిమా ఈ ఏడాది జనవరిలో వచ్చి పాన్ ఇండియా రేంజ్‍లో అద్భుతమైన హిట్ అయింది. రూ.40కోట్ల బడ్జెట్‍లోపు తెరకెక్కించిన ఈ చిత్రం సుమారు రూ.350కోట్ల కలెక్షన్లు రాబట్టి బ్లాక్‍బస్టర్ అయింది. ఈ మూవీకి సీక్వెల్‍గా ‘జై హనుమాన్’ ఉంటుందని ఇప్పటికే ప్రకటించారు. స్క్రిప్ట్ పనులు కూడా మొదలుపెట్టినట్టు గతంలో ప్రశాంత్ వెల్లడించారు.

అయితే, జై హనుమాన్ కంటే ముందే బాలీవుడ్ స్టార్ హీరో రణ్‍వీర్ సింగ్‍తో ఓ మూవీ చేసేందుకు ప్రశాంత్ రెడీ అయ్యారు. అయితే, అభిప్రాయ భేదాల వల్ల ఈ ప్రాజెక్ట్ ఆరంభంలోనే ఆగిపోయింది. దీంతో మోక్షజ్ఞతో మూవీనే ప్రశాంత్ వర్మ ముందుగా చేసేందుకు నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం ఈ మూవీ ప్రీప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. అంతా రెడీ అయ్యాక ఈ చిత్రం షూటింగ్ షురూ కానుంది. ఈ మూవీ తర్వాత ‘జై హనుమాన్’ చిత్రాన్ని ప్రశాంత్ వర్మ చేసే అవకాశం ఉంది.