NAGABABU | జీవితంలో ఎన్నో ఒడిదుడుకుల్ని ఎదుర్కొన్నా... వైరల్ అవుతున్న నాగబాబు ఎమోషనల్ పోస్ట్
రియాలిటీ షోస్, సినిమాలతో బిజీగా ఉన్నారు నటుడు నాగబాబు. మరోవైపు జనసేన పార్టీ వ్యవహారాల్ని పర్యవేక్షిస్తూ సోదరుడు పవన్ కళ్యాణ్ కు అండగా నిలుస్తున్నారు. శనివారం తన భవిష్యత్ ప్రణాళికలకు సంబంధించిన నాగబాబు పెట్టిన ఎమోషనల్ పోస్ట్ వైరల్ అవుతోంది.
మెగా స్టార్ చిరంజీవి సోదరుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు నాగబాబు. నటుడిగా కెరీర్ ను మొదలుపెట్టిన ఆయన ఆ తర్వాత నిర్మాతగా పలు చిత్రాల్ని తెరకెక్కించారు. ‘ఆరెంజ్’ పరాజయం తర్వాత చిత్ర నిర్మాణానికి దూరంగా ఉంటున్న ఆయన ప్రస్తుతం పలు టీవీ షోలకు జడ్జ్ గా వ్యవహరిస్తున్నారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాల్లో నటిస్తున్నారు. రాజకీయాల పరంగా తొలినాళ్ల నుంచి సోదరుడు పవన్ కళ్యాణ్ కు అండగా నిలుస్తూ వస్తోన్న నాగబాబు జనసేన పార్టీలో కీలక పదవిలో కొనసాగుతున్నారు. శనివారం నాగబాబు సోషల్ మీడియాలో పెట్టిన ఓ ఎమోషనల్ పోస్ట్ వైరల్ గా మారింది. ‘ఇన్నాళ్ల నా జీవితంలో..ఎన్నో ఒడిదుడుకులను చూసి ఎన్నో విపత్తులను ఎదుర్కొని నన్ను నేనుగా మార్చుకోగలిగాను. ఓ రకంగా చూస్తే ఆపదలు, కష్టాలే నన్ను ఒక పూర్తి మనిషిగా మలచడానికి ఎంతగానో సహాయపడ్డాయి. నేను పుట్టి పెరిగిన దేశానికి, నా తోటి ప్రజలకు సహాయ పడాలని నిర్ణయించుకొని అదే గమ్యంగా నా లక్ష్యంవైపు పయనించాను. ఈ పయనంలో నాకు ఎన్నో ఒడిదుడుకులు, ఆటంకాలు ఎదురైనా కానీ నన్ను ప్రతిసారి వెన్నంటి నడిపించి నేను మనిషిగా ఎదిగే అవకాశాన్ని ఇచ్చింది ఈ కష్టాలే. అందుకే ఇప్పటి నుండి నా పూర్తి సమయాన్నినా గమ్యం దిశగా ప్రయాణం కొనసాగించడానికి ఉపయోగించాలని నిర్ణయించుకొన్నాను. మరిన్ని వివరాలతో త్వరలో మీ ముందుకొస్తా’ అని నాగబాబు అన్నారు. ఈ ట్వీట్ చివరలో ఈ బాటసారి ప్రయాణం కొనసాగుతుంది అంటూ పేర్కొనడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. అయితే జనసేన ఆరంభం నుంచి పార్టీకి పరోక్షంగానే మద్దుతు నిస్తూ వస్తోన్న నాగబాబు ఇకపై ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. ఆ ఆలోచనతోనే ఈ పోస్ట్ పెట్టినట్లు కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం నాగబాబు మళ్లీ సినిమా నిర్మాణాన్ని చేపట్టనున్నట్లు చెబుతున్నారు. త్వరలోనే ఆయన ఆంతర్యం ఏమిటన్నది వెల్లడికానున్నట్లు సమాచారం. ఏపీలోని మంగళగిరి నియోజకవర్గంలో మార్చి 14న జరుగనున్న జనసేన ఆవిర్భావ ఏర్పాట్ల కు సంబంధించిన పనులతో నాగబాబు బిజీగా ఉన్నారు.
టాపిక్