Dhootha Budget: తెలుగు వెబ్‌సిరీస్‌లో అత్యధిక బడ్జెట్‌తో నాగ చైతన్య 'దూత'
టాలీవుడ్ నటుడు అక్కినేని నాగచైతన్య తొలిసారి ఓ వెబ్‌సిరీస్‌లో నటిస్తున్నాడు. దూత అనే ఈ సిరీస్‌ను అమెజాన్ ప్రైమ్ వీడియో నిర్మించింది.
తెలుగులోనూ క్రమంగా వెబ్ సిరీస్ వైపు అభిమానులు ఆకర్షితులవుతున్నారు. ఇప్పటికే ఆహా, జీ5, డిస్నీ హాట్‌స్టార్‌లాంటి ఓటీటీలు ఎన్నో వెబ్‌సిరీస్‌లను తెరకెక్కించాయి. తాజాగా అమెజాన్ ప్రైమ్ వీడియో కూడా తొలిసారి ఓ తెలుగు వెబ్ సిరీస్‌ను రూపొందించింది. దీని పేరు దూత. నటుడు నాగ చైతన్య నటించిన తొలి వెబ్ సిరీస్ కూడా ఇదే.
ఇప్పటికే ఈ దూత సిరీస్ ఫస్ట్ లుక్ కూడా రిలీజైంది. మనం, థ్యాంక్యూలాంటి మూవీలకు దర్శకత్వం వహించిన డైరెక్టర్ విక్రమ్ కే కుమార్ ఈ సిరీస్‌ను కూడా డైరెక్ట్ చేశాడు. ఈ సిరీస్ ప్రొడక్షన్ పనులు కూడా చివరి దశలో ఉన్నాయి. అయితే తాజాగా ఈ సిరీస్ బడ్జెట్ వెల్లడైంది. ఇప్పటి వరకూ తెలుగులో రూపొందిన వెబ్ సిరీస్‌లు అన్నింటికంటే ఈ సిరీస్ బడ్జెటే ఎక్కువ కావడం విశేషం.
ఈ దూత వెబ్ సిరీస్ కోసం ప్రైమ్ వీడియో ఏకంగా రూ.45 కోట్లు ఖర్చు పెట్టింది. ఈ సిరీస్‌లో నటించిన నాగ చైతన్య, డైరెక్షన్ చేసిన విక్రమ్‌లు చెరో రూ.5 కోట్లు అందుకున్నారు. ఇంత బడ్జెట్‌తో రూపొందిన ఈ సిరీస్‌పై సహజంగానే అంచనాలు భారీగా ఉన్నాయి. అందుకు తగినట్లే ఈ సిరీస్ కూడా ఉండటంతో డైరెక్టర్ విక్రమ్‌తో మరో ప్రాజెక్ట్ కోసం కూడా ప్రైమ్ వీడియో సిద్ధమవుతున్నట్లు సమాచారం.
ఈ దూత వెబ్ సిరీస్ ఓ హారర్, థ్రిల్లర్‌గా తెరకెక్కింది. ప్రైమ్ వీడియో తాము తెలుగులో నిర్మించిన తొలి వెబ్ సిరీస్‌కే ఇంత భారీ బడ్జెట్ కేటాయించడం నిజంగా విశేషమే. మరోవైపు నాగచైతన్య, విక్రమ్ కాంబినేషన్‌లోనే వస్తున్న థ్యాంక్యూ మూవీ జులై 8న రిలీజ్ కానుంది.
సంబంధిత కథనం