Naga Chaitanya on Rashmika Mandanna: భవిష్యత్తును చూస్తే భయమేస్తోంది: రష్మిక ఫేక్ వీడియోపై నాగ చైతన్య-naga chaitanya on rashmika mandanna deep fake video ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Naga Chaitanya On Rashmika Mandanna: భవిష్యత్తును చూస్తే భయమేస్తోంది: రష్మిక ఫేక్ వీడియోపై నాగ చైతన్య

Naga Chaitanya on Rashmika Mandanna: భవిష్యత్తును చూస్తే భయమేస్తోంది: రష్మిక ఫేక్ వీడియోపై నాగ చైతన్య

Hari Prasad S HT Telugu
Nov 07, 2023 10:23 AM IST

Naga Chaitanya on Rashmika Mandanna: రష్మికకు అండగా నిలిచారు నాగ చైతన్య, మృణాల్ ఠాకూర్. ఆమె డీప్‌ఫేక్ వీడియోపై వాళ్లు తీవ్రంగా స్పందించారు.

రష్మిక మందన్నాకు అండగా నిలిచిన నాగ చైతన్య, మృణాల్ ఠాకూర్
రష్మిక మందన్నాకు అండగా నిలిచిన నాగ చైతన్య, మృణాల్ ఠాకూర్

Naga Chaitanya on Rashmika Mandanna: రష్మిక మందన్నా ఫేక్ వీడియోపై సినీ ప్రముఖులు ఎంతో మంది ఆమెకు అండగా నిలుస్తున్నారు. దీనిపై మొదట అమితాబ్ బచ్చన్ స్పందించగా.. తాజాగా టాలీవుడ్ నుంచి నాగ చైతన్య, మృణాల్ ఠాకూర్, చిన్మయి శ్రీపాదలాంటి వాళ్లు కూడా సోషల్ మీడియా ద్వారా రష్మికకు మద్దతు తెలిపారు.

టెక్నాలజీని దుర్వినియోగం చేస్తూ ఇలా వ్యక్తుల పరువును బజారున పడేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వాళ్లు డిమాండ్ చేస్తున్నారు. ఈ అంశంపై అందరూ స్పందించాలని, ఇలాంటి చర్యలను అరికట్టడానికి కఠినమైన చట్టాలను తీసుకురావాలని కూడా అన్నారు. తనకు మద్దతుగా నిలుస్తున్న వారికి రష్మిక కృతజ్ఞతలు చెప్పింది.

భవిష్యత్తును చూస్తే భయమేస్తోంది: నాగ చైతన్య

రష్మిక మందన్నా డీప్ ఫేక్ వీడియోపై నాగ చైతన్య సోషల్ మీడియా ద్వారా స్పందించాడు. "టెక్నాలజీని దుర్వినియోగం చేస్తున్న తీరు చూస్తుంటే చాలా బాధగా ఉంది. ఇది భవిష్యత్తులో ఎక్కడికి దారి తీస్తుందో ఊహించుకుంటేనే భయమేస్తోంది. దీనిపై చర్యలు తీసుకోవాలి. ఇలాంటి వాటికి బాధితులవుతున్న వారిని రక్షించేందుకు కఠిన చట్టం తీసుకురావాలి. ధైర్యంగా ఉండు రష్మిక" అని చైతన్య ట్వీట్ చేశాడు.

మేమూ మనషులమే: మృణాల్

ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ద్వారా రష్మిక అంశంపై మృణాల్ ఠాకూర్ స్పందించింది. "ఇలాంటి పనులు చేసే వారికి సిగ్గుండాలి. అలాంటి వాళ్ల మనస్సాక్షి చచ్చిపోయినట్లు అనిపిస్తోంది. దీనిపై ధైర్యంగా మాట్లాడినందుకు రష్మికకు అభినందనలు. చాలా మంది దీనిపై ఇంకా మౌనంగా ఉన్నారు.

ప్రతి రోజూ ఫిమేల్ యాక్టర్స్ ఫొటోలను ఇలా మార్ఫింగ్ చేస్తూ ఇంటర్నెట్ లో వదులుతున్నారు. ఓ సమాజంగా మనం ఎక్కడికి వెళ్తున్నాం? మేమూ మనషులమే కదా. ఎవరూ దీనిపై ఎందుకు మాట్లాడటం లేదు. మౌనంగా ఉండకండి" అని మృణాల్ రాసింది.

ఇక సింగర్ చిన్మయి శ్రీపాద స్పందిస్తూ.. ఇలాంటి అంశాలపై దేశవ్యాప్తంగా బాలికలు, మహిళల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. అలా అయితే వీటిని అరికట్టగలుగుతామని చెప్పింది. తనకు మద్దతుగా నిలిచిన చైతన్య, మృణాల్, చిన్మయిలకు రష్మిక కృతజ్ఞతలు తెలిపింది.

Whats_app_banner