Rashmika Mandanna: చాలా బాధగా ఉంది.. భయమేస్తోంది: డీప్ ఫేక్ వీడియోపై రష్మిక రియాక్షన్-rashmika mandanna reacts to her deepfake video ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Rashmika Mandanna: చాలా బాధగా ఉంది.. భయమేస్తోంది: డీప్ ఫేక్ వీడియోపై రష్మిక రియాక్షన్

Rashmika Mandanna: చాలా బాధగా ఉంది.. భయమేస్తోంది: డీప్ ఫేక్ వీడియోపై రష్మిక రియాక్షన్

Chatakonda Krishna Prakash HT Telugu
Nov 07, 2023 04:43 PM IST

Rashmika Mandanna: తన డీప్‍ఫేక్ వీడియో వైరల్ అవుతుండటంతో హీరోయిన్ రష్మిక మందన్నా స్పందించారు. టెక్నాలజీ దుర్వినియోగం పట్ల భయంగా ఉందని అన్నారు.

Rashmika Mandanna: “చాలా బాధగా ఉంది.. భయమేస్తోంది”: డీప్ ఫేక్ వీడియోపై రష్మిక రియాక్షన్
Rashmika Mandanna: “చాలా బాధగా ఉంది.. భయమేస్తోంది”: డీప్ ఫేక్ వీడియోపై రష్మిక రియాక్షన్

Rashmika Mandanna: స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నాకు సంబంధించిన ఓ డీప్ ఫేక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‍గా మారింది. అయితే, ఆ వీడియోలో ఉన్నది రష్మిక కాదు. డీప్‍ఫేక్ అనే ఏఐ టెక్నాలజీని ఉపయోగించి రష్మిక ఫేస్‍ను మార్ఫ్ చేసి సృష్టించిన వీడియో అది. ఈ వీడియోలో రష్మిక.. డీప్‍నెక్ యోగా బాడీసూట్ వేసుకున్నట్టుగా ఉంది. ఎవరో మహిళ వీడియోకు రష్మిక ఫేస్‍ను మార్ఫ్ చేసి ఈ డీప్‍ఫేక్ వీడియోను సృష్టించారు. ఇది నిజం అనుకొని కొందరు రష్మికను ట్రోల్ చేశారు. అయితే, అది ఫేక్ అని తేలిపోయింది. కాగా, అభ్యంతరకరమైన ఈ డీప్ ఫేక్ వీడియోపై రష్మిక మందన్నా స్పందించారు.

ఈ ఫేక్ వీడియో గురించి తన ఇన్‍స్టాగ్రామ్ అకౌంట్‍లో స్టోరీ పోస్ట్ చేశారు రష్మిక మందన్నా. టెక్నాలజీ దుర్వినియోగం తనకే కాదు.. ప్రతీ ఒక్కరికీ చాలా భయంగా మారుతోందని పేర్కొన్నారు. ఒకవేళ తాను చదువుకునేటప్పుడు ఇలా జరిగి ఉంటే ఎలా ఎదుర్కోవాలో కూడా తనకు అర్థమయ్యేది కాదని రష్మిక రాసుకొచ్చారు.

“నేను ఉన్నట్టుగా ఆన్‍లైన్‍లో వ్యాప్తి చెందుతున్న ఓ డీప్ ఫేక్ వీడియో గురించి మాట్లాడాల్సి వచ్చినందుకు.. ఇది షేర్ చేయాల్సి వచ్చినందుకు నాకు చాలా బాధగా అనిపిస్తోంది. టెక్నాలజీ దుర్వినియోగం కారణం వల్ల హానీ కలుగుతుందన్న తీవ్రమైన భయం నాకే కాదు.. ప్రతీ ఒక్కరిలోనూ ఉంది. ఇప్పుడు ఓ నటిగా ఉన్న నాకు నా కుటుంబం, శ్రేయోభిలాషులు రక్షణగా, మద్దతుగా ఉన్నారు. దీనికి నేను కృతజ్ఞురాలిని. కానీ ఒకవేళ నేను స్కూల్ లేదా కాలేజీలో చదువుతున్నప్పుడు ఇది జరిగి ఉంటే.. అసలు నేను ఎలా ఎదుర్కొనే దాన్నో కూడా ఊహించుకోలేకపోతున్నా. ఐడెంటిటీ చోరీ ద్వారా మనలో ఎక్కువ మంది ప్రభావితం అయ్యే ముందే దీనికి సమాజంగా ఓ పరిష్కారం కనుగొనాలి” అని రష్మిక తన ఇన్‍స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చారు.

రష్మిక డీప్ ఫేక్ వీడియోపై బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్ కూడా స్పందించారు. ఇలా చేసిన వారిపై న్యాయపరంగా చర్యలు తీసుకోవాలని ట్వీట్ చేశారు. చాలా మంది సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు, నెటిజన్లు రష్మికకు మద్దతు తెలుపుతున్నారు. డీప్ ఫేక్ వీడియో క్రియేట్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఒరిజినల్, ఫేక్ అంటూ వీడియోలను కూడా కొందరు నెటిజన్లు పోస్ట్ చేస్తున్నారు.