Nenekkadunna Teaser: బాలీవుడ్ సీనియర్ హీరో మిథున్ చక్రవర్తి కుమారుడి తెలుగు సినిమా.. టీజర్ విడుదల-mithun chakraborty son mimoh chakraborty telugu debut nenekkadunna teaser ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Nenekkadunna Teaser: బాలీవుడ్ సీనియర్ హీరో మిథున్ చక్రవర్తి కుమారుడి తెలుగు సినిమా.. టీజర్ విడుదల

Nenekkadunna Teaser: బాలీవుడ్ సీనియర్ హీరో మిథున్ చక్రవర్తి కుమారుడి తెలుగు సినిమా.. టీజర్ విడుదల

Nenekkadunna Teaser: బాలీవుడ్ సీనియర్ నటుడు మిథున్ చక్రవర్తి కుమారుడు మిమో చక్రవర్తి హీరోగా రూపొందిన తాజా సినిమా నేనెక్కడున్నా. తాజాగా ఈ సినిమా టీజర్ ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు విడుదల చేశారు.

నేనెక్కడున్నా టీజర్

Nenekkadunna Teaser: బాలీవుడ్ సీనియర్ నటుడు మిథున్ చక్రవర్తి కుమారుడు తెలుగు చిత్రసీమకు కథానాయకుడిగా పరిచయమవుతున్నాడు. మామాధవ్ కోదాడ దర్శకత్వం వహిస్తున్న సినిమా 'నేనెక్కడున్నా'. దర్శకుడిగా ఆయనకు ఇది తొలి చిత్రం. ఇందులో సశా ఛెత్రి కథానాయిక. కేబీఆర్ సమర్పణలో మారుతి శ్యాం ప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. తాజాగా ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు టైటిల్ వెల్లడించడంతో పాటు పోస్టర్, టీజర్ విడుదల చేశారు.

'నేనెక్కడున్నా' టైటిల్, టీజర్ విడుదల అనంతరం సురేష్ బాబు మాట్లాడుతూ.. ''టీజర్ ఆద్యంతం చాలా ఆసక్తికరంగా ఉంది. కథ బాగుంటే కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలకు, ఇలాంటి కొత్త ప్రయత్నాలకు ప్రేక్షకుల ఆదరణ లభిస్తుంది. సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నాను. దర్శక, నిర్మాతలకు విషెస్" అని చెప్పారు.

చిత్ర దర్శకుడు మాధవ్ కోదాడ మాట్లాడుతూ ''జర్నలిజం, రాజకీయం నేపథ్యంలో వస్తున్న థ్రిల్లర్ చిత్రమిది. ఊహించని మలుపులతో సినిమా సాగుతుంది. ఈ సినిమాతో హిందీ హీరో మిథున్ చక్రవర్తి కుమారుడు మిమో చక్రవర్తిని తెలుగు తెరకు పరిచయం చేస్తున్నాం'' అని చెప్పారు.

చిత్ర నిర్మాత మారుతి శ్యాం ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ ''సినిమా చిత్రీకరణ పూర్తి అయ్యింది. ముంబై, హైదరాబాద్, బెంగళూరులో షూటింగ్ చేశాం. ఫస్ట్ కాపీ రెడీ అయ్యింది. ప్రస్తుతం సెన్సార్ సన్నాహాల్లో ఉన్నాం. స్టోరీ, మ్యూజిక్, విజువల్స్, డైరెక్షన్ మా సినిమాకు బలం. ప్రముఖ కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ నృత్య దర్శకత్వంలో రష్యన్ డాన్సర్లతో చేసిన పబ్ సాంగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. సెన్సార్ పూర్తయ్యాక విడుదల తేదీ వివరాలు వెల్లడిస్తాం. త్వరలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి సన్నాహాలు చేస్తున్నాం'' అని అన్నారు.

మురళీ శర్మ, మహేష్ మంజ్రేకర్, ప్రదీప్ రావత్, శయాజీ షిండే, అభిమన్యు సింగ్, రాహుల్ దేవ్, బ్రహ్మానందం, సీవీఎల్ నరసింహారావు, రవి కాలే, తనికెళ్ళ భరణి, పోసాని కృష్ణమురళి, భాను చందర్, రమణ చల్కపల్లి, మిలింద్ గునాజి, మిహిర, ఉత్తర తదితరులు కీలక పాత్రలు పోషించారు. శేఖర్ చంద్ర ఈ సినిమాకు సంగీతాన్ని సమకూర్చారు.

సంబంధిత కథనం