Mission Chapter 1 Review: మిష‌న్ ఛాప్ట‌ర్ వ‌న్ రివ్యూ - అమీజాక్స‌న్‌, అరుణ్ విజ‌య్ త‌మిళ్ యాక్ష‌న్ మూవీ ఎలా ఉందంటే?-mission chapter one review arun vijay amy jackson tamil action thriller movie streaming on amazon prime video ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Mission Chapter One Review Arun Vijay Amy Jackson Tamil Action Thriller Movie Streaming On Amazon Prime Video

Mission Chapter 1 Review: మిష‌న్ ఛాప్ట‌ర్ వ‌న్ రివ్యూ - అమీజాక్స‌న్‌, అరుణ్ విజ‌య్ త‌మిళ్ యాక్ష‌న్ మూవీ ఎలా ఉందంటే?

Nelki Naresh Kumar HT Telugu
Apr 02, 2024 09:21 AM IST

Mission Chapter 1 Review: అరుణ్ విజ‌య్‌, అమీజాక్స‌న్ హీరోహీరోయిన్లుగా న‌టించిన త‌మిళ మూవీ మిష‌న్ ఛాప్ట‌ర్ వ‌న్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. కోలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ కోలీవుడ్ మూవీకి ఏఎల్ విజ‌య్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

మిష‌న్ ఛాప్ట‌ర్ వ‌న్ రివ్యూ
మిష‌న్ ఛాప్ట‌ర్ వ‌న్ రివ్యూ

Mission Chapter 1 Review: అరుణ్ విజ‌య్‌, అమీజాక్స‌న్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన‌ త‌మిళ మూవీ మిష‌న్ ఛాప్ట‌ర్ వ‌న్ ఇటీవ‌ల అమెజాన్ ప్రైమ్‌లో రిలీజైంది. యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కిన ఈ మూవీకి ఏఎల్ విజ‌య్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఈ సినిమా ఎలా ఉందంటే?

జైలు హైజాక్‌...

గుణ (అరుణ్ విజ‌య్‌) రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీస‌ర్‌. అత‌డి భార్య ఓ బాంబు పేలుడులో క‌న్నుమూస్తుంది. అదే ప్ర‌మాదంలో గుణ కూతురు స‌న‌ తీవ్రంగా గాయ‌ప‌డుతుంది. బ్రెయిన్ స‌ర్జ‌రీ చేస్తేనే ఆమె బ‌తుకుతుంద‌ని డాక్ట‌ర్లు చెబుతారు. ఆ స‌ర్జ‌రీ కోసం త‌న ఆస్తులు మొత్తం అమ్మేసి గుణ‌ లండ‌న్ వెళ‌తాడు. స‌ర్జ‌రీకి అవ‌స‌ర‌మైన డ‌బ్బును హ‌వాలా ద్వారా లండ‌న్‌లో తీసుకోవాల‌ని గుణ భావిస్తాడు. గుణ నుంచి ఆ డ‌బ్బును దోచుకోవ‌డానికి కొంద‌రు రౌడీలు ప్ర‌య‌త్నిస్తారు. వారిని చిత‌క్కోడ‌తాడు గుణ‌. ఈ గొడ‌వ‌కు గుణ‌నే కార‌ణ‌మ‌ని భావించిన లండ‌న్ పోలీసులు అత‌డిని అరెస్ట్ చేసి వండ్స్‌వ‌ర్త్ అనే జైలుకు పంపిస్తారు.

సాండ్ర జేమ్స్ (అమీ జాక్స‌న్‌) ఆ జైలులో జైల‌ర్‌గా ప‌నిచేస్తుంటుంది. త‌న కూతురు హాస్పిట‌ల్‌లో ప్రాణాల‌తో పోరాడుతుంద‌ని గుణ నిజం చెప్పినా సాండ్ర న‌మ్మ‌దు. ఆ జైల‌ర్‌ను ఒమ‌ర్ (భ‌ర‌త్) అనే టెర్ర‌రిస్ట్ హైజాక్ చేస్తాడు. ఆ జైలులో ఉన్న త‌న మ‌నుషులు ముగ్గురిని త‌ప్పించేందుకు ప్లాన్ చేస్తాడు? ఒమ‌ర్ ప్లాన్‌ను గుణ అడ్డుకుంటాడు. గుణ‌ను ఆ జైలులో చూసి ఒమ‌ర్ షాక‌వుతాడు? వాళ్ల మ‌ధ్య ఉన్న పాత ప‌గ‌ల‌కు కార‌ణ‌మేమిటి?

సాండ్ర జేమ్స్‌తో పాటు మిగిలిన జైలు సిబ్బందిని ఒమ‌ర్ మ‌నుషుల బారి నుంచి గుణ ఎలా కాపాడాడు? గ‌తంలో కోయంబ‌త్తూర్‌ జైల‌ర్‌గా ప‌నిచేసిన గుణ.. ఒమ‌ర్ కుట్ర‌ల‌ను అడ్డుకోవ‌డ‌మే కాకుండా అత‌డి మ‌నుషుల్ని ఎలా చంపాడు? గుణ భార్య‌ను చంపింది ఎవ‌రు? గుణ‌పై ప్ర‌తీకారంతో ర‌గిలిపోయిన ఒమ‌ర్ అత‌డి కూతురు స‌నకు ఎలాంటి ప్ర‌మాదం త‌ల‌పెట్టాడు? స‌న‌ను కాపాడేందుకు ప్ర‌య‌త్నించిన నాన్సీ కురియ‌న్ (నిమిషా స‌జ‌య‌న్‌) ఎవ‌రు? అన్న‌దే మిష‌న్ ఛాప్ట‌ర్ వ‌న్ క‌థ‌.

మిష‌న్ ఛాప్ట‌ర్‌ వన్ తో యాక్ష‌న్ బాట‌...

మాన‌వ సంబంధాలు, అనుబంధాల‌కు ప్రాముఖ్య‌త‌నిస్తూ త‌మిళంలో సినిమాలు చేస్తుంటాడు డైరెక్ట‌ర్ ఏఎల్ విజ‌య్‌. త‌న‌కు క‌లిసొచ్చిన‌ జోన‌ర్‌లో అత‌డు చేసిన గ‌త సినిమాలు కొన్ని బాక్సాఫీస్ వ‌ద్ద మిస్ ఫైర్ కావ‌డంతో మిష‌న్ ఛాప్ట‌ర్ వ‌న్‌తో యాక్ష‌న్ బాట ప‌ట్టాడు ఏఎల్ విజ‌య్‌.

ఈ సినిమా క‌థ కోసం పెద్ద‌గా రిస్క్ తీసుకోకుండా గ‌తంలో త‌మిళంలో వ‌చ్చిన ర‌జ‌నీకాంత్ జైల‌ర్, కార్తి ఖైదీ తో పాటు క‌న్న‌డ చిత్రం ఘోస్ట్ వ‌ర‌కు చాలా సినిమాల‌ను స్ఫూర్తిగా తీసుకొని మిష‌న్ ఛాప్ట‌ర్ వ‌న్ క‌థ రాసుకున్నాడు ఏఎల్ విజ‌య్‌.

రెండున్న‌ర గంట‌ల క‌ష్టం...

త‌న కూతురిని కాపాడుకోవ‌డానికి లండ‌న్ వ‌చ్చిన ఓ వ్య‌క్తి అనుకోకుండా ఖైదీగా మారి జైలుకు వెళ్ల‌డం, ఆ జైలుపై జ‌రిపిన ఎటాక్‌ను ఆప‌డ‌మే కాకుండా త‌న కూతురిని వారి నుంచి నుంచి ఎలా కాపాడుకున్నాడ‌న్న‌దే ఈ సినిమా క‌థ‌. ఈ సింపుల్ పాయింట్‌ను రెండున్న‌ర గంట‌లు ఎంగేజింగ్‌గా చెప్పేందుకు ద‌ర్శ‌కుడు ప‌డ్డ క‌ష్టం అంతా ఇంతా కాదు.

జేమ్స్ బాండ్ టైప్ ఎలివేష‌న్స్‌...

హీరోతో పాటు విల‌న్‌, అమీ జాక్స‌న్ క్యారెక్ట‌ర్స్‌కు జేమ్స్ బాండ్ సినిమాల టైప్‌లో భారీగా ఎలివేష‌న్స్ ఇచ్చాడు డైరెక్ట‌ర్‌. ఆ ఎలివేష‌న్స్‌లో పావు వంతు ప‌ర్ఫార్మెన్స్ కూడా సినిమాలో క‌నిపించ‌దు. విల‌న్ చివ‌రి వ‌ర‌కు ఫోన్ మాట్లాడుతూనే ఉంటాడు. అమీజాక్స‌న్ హ‌డావిడిగా జైలులో అటూ ఇటూ తిరుగుతూ క‌నిపిస్తుంది. త‌న‌కు ఇచ్చిన రెమ్యున‌రేష‌న్‌కు న్యాయం చేసేందుకు తెగ క‌ష్ట‌ప‌డింది.

న‌భూతో న‌భ‌విష్య‌త్తు...

జైలులో క‌రుడుగ‌ట్టిన ఖైదీల‌ను హీరో ఒక్క‌డే చిత‌క్కొట్ట‌డం చూస్తుంటే అది కామెడీనో, సీరియ‌స్సో అర్థం కాదు. కిచెన్ సిబ్బందిని విల‌న్స్ నుంచి హీరో కాపాడే సీన్ అయితే న‌భూతో న‌భ‌విష్య‌త్తు అన్న‌ట్లుగా ఉంటుంది. లండ‌న్ సిటీ న‌ట్ట‌న‌డిబొడ్డున ఉన్న జైలును టెర్ర‌రిస్ట్‌లు ఎటాక్ చేసినా పోలీసుల‌కు తెలియ‌క పోవ‌డం లాజిక్‌లెస్‌గా అనిపిస్తుంది.

పాత సినిమా ఛాయ‌ల‌తో...

హీరో, విల‌న్‌కు మ‌ధ్య ఉన్న పాత గొడ‌వ‌కు సంబంధించిన‌ ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ గురించి ఎంత త‌క్కువ చెప్పుకుంటే అంత మంచింది. సినిమాలోని ప్ర‌తి సీన్ ఏదో ఒక పాత సినిమాను గుర్తుకు తెస్తూనే ఉంటాయి. చివ‌ర‌కు క్లైమాక్స్‌లో చ‌నిపోయాడ‌నుకున్న హీరో ఒక్క‌సారిగా బ‌తికి విల‌న్ ముందు ప్ర‌త్య‌క్ష‌మ‌య్యే సీన్ కూడా అల్ల‌రి న‌రేష్ పాత సినిమాలో ఉంది.

అరుణ్ విజ‌య్ క‌ష్టం వృథా

ఏఎల్ విజ‌య్ రాసిన పేల‌వ‌మైన క‌థ‌కు న్యాయం చేసేందుకు అరుణ్ విజ‌య్ శాయ‌శ‌క్తులా కృషిచేశాడు. యాక్ష‌న్, సెంటిమెంట్స్ సీన్స్‌లో అత‌డి న‌ట‌న బాగుంది. రొటీన్ స్టోరీ కార‌ణంగా అరుణ్ విజ‌య్‌ క‌ష్టం వృథాగా మారింది. నిమిషా స‌జ‌య‌న్ గెస్ట్ రోల్ అయినా త‌న పాత్ర‌కు న్యాయం చేసింది. అమీ జాక్స‌న్ యాక్ష‌న్ ఎపిసోడ్స్‌లో ఒకే అనిపించింది. మిగిలిన పార్ట్‌లో ఆమె ఓవ‌ర్ యాక్ష‌న్‌ను చూడ‌లేం. విల‌న్ డైరెక్ట్‌గా క‌నిపించేది త‌క్కువ‌. వీడియో కాల్‌లోనే ఎక్కువ‌గా క‌నిపించాడు.

ఆప‌రేష‌న్ స‌క్సెస్ పేషెంట్ డెడ్‌...

మిష‌న్ ఛాప్ట‌ర్ వ‌న్ మూవీ ఆప‌రేష‌న్ స‌క్సెస్ కానీ పేషెంట్ డెడ్ అన్న‌ట్లుగా చందంగా సాగుతుంది. ఔట్ డేటెడ్ స్టోరీలైన్‌తో తెర‌కెక్కిన ఈ మూవీని రెండున్న‌ర గంట‌లు భ‌రించ‌డం క‌ష్ట‌మే...

IPL_Entry_Point