Masooda Movie Review: మసూద మూవీ రివ్యూ - హారర్ థ్రిల్లర్ సినిమా భయపెట్టిందా
Masooda Movie Review: తిరువీర్, సంగీత, కావ్య కళ్యాణ్‌రామ్ ప్రధాన పాత్రల్లో నటించిన హారర్ సినిమా మసూద. దిల్‌రాజు ఈ సినిమాను రిలీజ్ చేశాడు. ఈ శుక్రవారం మసూద సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది.
Masooda Movie Review: హారర్ జోనర్‌కు ట్రెండ్‌తో సంబంధం ఉండదు. ఈ జోనర్‌లో సినిమాలు ఎప్పడొచ్చినా కథ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తుంటారు. ఈ విషయం చాలా సార్లు ప్రూవ్ అయ్యింది. గత కొన్ని రోజులుగా హారర్ సినిమాల సంఖ్య టాలీవుడ్‌లో తగ్గింది. ఆ లోటును భర్తీ చేస్తూ రూపొందిన తాజా సినిమా మసూద. సంగీత, తీరువీర్, కావ్య కళ్యాణ్‌రామ్ ప్రధాన పాత్రల్లో నటించారు. సాయికిరణ్ దర్శకత్వం వహించాడు. మళ్లీరావా, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ విజయాల తర్వాత నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా నిర్మించిన సినిమా ఇది. మసూదను అగ్ర నిర్మాత దిల్ రాజు రిలీజ్ చేయడంతో ఈ చిన్న సినిమాపై ప్రేక్షకుల అటెన్షన్ పడింది. హారర్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమా ఎలా ఉందంటే...
Masooda Story -భయస్తుడైన యువకుడి కథ
గోపీ (తిరువీర్) ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. అతి భయస్తుడు. కానీ సాటివారు కష్టాల్లో ఉంటే సాయపడే మంచి మనస్తత్వం అతడిది. తన అపార్ట్‌మెంట్‌లోనే ఉండే నీలమ్ (సంగీత) ఫ్యామిలీతో గోపీకి చక్కటి అనుబంధం ఉంటుంది. నీలమ్ కూతురు నజియాకు (భాంధవి శేఖర్) దయ్యం పట్టడంతో విచిత్రంగా ప్రవర్తిస్తుంటుంది.
ఆ దయ్యం నుంచి తన కూతురికి విముక్తి కల్పించడంలో గోపి సహాయాన్ని కోరుతుంది నీలమ్. భయస్తుడైన గోపీ ఆ దెయ్యం నుంచి నజియాకు విముక్తిని కల్పించాడా? నజియాను ఆవహించిన మసూద ఎవరు? ఆమె కథేమిటి? నజియాను వదిలిపెట్టి మసూద ఆత్మ వెళ్లిందా లేదా అన్నదే ఈ సినిమా కథ.
masooda movie analysis -రియలిస్టిక్ హారర్
సాధారణంగా హారర్ సినిమాలు చాలా వరకు రీవెంజ్ ఫార్ములాతోనే సాగుతుంటాయి. తనకు జరిగిన అన్యాయాన్ని ఎదురించడానికి హీరోహీరోయిన్లు ఆత్మలుగా మారి విలన్స్‌పై ప్రతీకారం తీర్చుకున్నట్లుగా చూపిస్తుంటారు. ఈ పాయింట్‌తో లెక్కకుమించి హారర్ సినిమాలు తెలుగు తెరపై వచ్చాయి. వాటికి భిన్నంగా మసూద సినిమా సాగుతుంది. కొత్త పాయింట్‌తో రియలిస్టిక్ హారర్ థ్రిల్లర్ సినిమాగా దర్శకుడు సాయికిరణ్ మసూద కథను రాసుకున్నాడు.
సెకండాఫ్ భయపెడుతుంది..
సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా గోపీ క్యారెక్టర్‌తో పరిచయఘట్టాలు సరదాగా సాగుతాయి. తన ఆఫీస్‌లోనే ఓ అమ్మాయిని ఇష్టపడినా ఆమెకు తన ప్రేమను వ్యక్తం చేయలేక గోపీ పడే ఇబ్బందులు నవ్విస్తాయి. మరోవైపు గోపీ క్యారెక్టర్‌తో పాటుకూతురు ప్రపంచంగా బతికే టీచర్‌గా సంగీత పాత్రను చూపించారు. నజియాను ఆత్మ ఆవహించడం, గోపీ సహయాన్ని నీలమ్ కోరడంతోనే అసలు కథ మొదలవుతుంది.
నజియాను ఆవహించిన ఆత్మ ఎవరో తెలుసుకోవడానికి నీలమ్ గోపి కలిసి చేసిన పరిశోధనలో ఒక్కో ట్విస్ట్ రివీల్ చేస్తూ దర్శకుడు కథను ముందుకు నడిపించాడు. మసూద ఫ్లాష్‌బ్యాక్ డిఫరెంట్‌గా ఉంది. పల్లెటూళ్లలో కనిపించే క్షుద్రపూజల పాయింట్‌ను జోడిస్తూ ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్స్‌పై ఇంట్రెస్ట్‌ను క్రియేట్ చేశాడు డైరెక్టర్.
ముస్లిం బ్యాక్‌డ్రాప్ ప్లస్...
మసూద కోసం దర్శకుడు ముస్లిం బ్యాక్‌డ్రాప్‌ను ఎంచుకోవడం బాగుంది. హారర్ సినిమాలు ఎక్కువగా హిందు, క్రిస్టియన్ బ్యాక్‌డ్రాప్‌లోనే సాగుతుంటాయి. ఆ నేటివిటీలో కథను చెప్పేందుకు ఆస్కారం ఉన్నా దర్శకుడు వైవిధ్యం కోసం తెలివిగా ముస్లిం బ్యాక్‌డ్రాప్‌ను ఎంచుకున్నాడు. అదే మసూద సినిమాకు ఫ్రెష్‌నెస్‌ను తీసుకొచ్చింది.
ఫస్ట్ హాఫ్ బోరింగ్..
పాత్రల పరిచయం టైమ్ పాస్ చేస్తూ అసలు కథలోకి వెళ్లడానికి దర్శకుడు టైమ్ తీసుకున్నాడు. దాంతో ఫస్ట్‌హాఫ్‌లో కొన్ని చోట్ల ఈ సినిమా సాగదీసినట్లుగా అనిపించింది.
సహజ నటన...
తన కూతురిని బతికించుకోవడానికి పోరాడే తల్లిగా సంగీత నటన ఆకట్టుకుంటుంది. బలమైన భావోద్వేగాలతో కూడిన పాత్రలో ఒదిగిపోయింది. తీరువీర్ రియలిస్టిక్ యాక్టింగ్ కనబరిచాడు. కావ్య కళ్యాణ్‌రామ్ క్యారెక్టర్ నిడివి తక్కువే అయినా మెప్పించింది. నజియాగా కనిపించిన బాంధవి శేఖర్ నటన బాగుంది. ప్రశాంత్ ఆర్ విహారి మ్యూజిక్ మసూద సినిమాకు పెద్ద ఎసెట్‌గా నిలిచింది. చాలా చోట్ల తన సౌండ్ డిజైనింగ్‌తో భయపెట్టాడు.
తులసీదళం తరహాలో...
తులసీదళం, కాష్మోరా తరహాలో డిఫరెంట్ ఫీల్‌ను కలిగించే హారర్ సినిమా ఇది. హారర్ సినిమా లవర్స్‌ను మెప్పిస్తుంది.
రేటింగ్ - 3/5