Mansion 24 Web Series in OTT: వరలక్ష్మి శరత్ కుమార్ నటించిన హారర్ వెబ్ సిరీస్ మ్యాన్షన్ 24 (Mansion 24) ఓటీటీలోకి వచ్చేసింది. ఈ సిరీస్ ను డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో మంగళవారం (అక్టోబర్ 17) నుంచి చూడొచ్చు. ఇదొక హారర్ వెబ్ సిరీస్. ఈ మధ్యే వేణు తొట్టెంపూడి కమ్ బ్యాక్ సిరీస్ అదితి స్ట్రీమ్ చేసిన హాట్‌స్టార్ ఇప్పుడు మరో సిరీస్ తో ప్రేక్షకులను అలరించనుంది.
ఈ మ్యాన్షన్ 24 వెబ్ సిరీస్ లో వరలక్ష్మి శరత్ కుమార్ తోపాటు సత్యరాజ్, అవికా గోర్, బిందు మాధవి, అర్చన జోయిస్, శ్రీమాన్, రావు రమేష్, అమర్ దీప్, నందు, అయ్యప్ప పి శర్మ, రాజీవ్ కనకాల కీలకపాత్రలు పోషించారు. ఈ సిరీస్ ను ఓంకార్ నిర్మించి డైరెక్ట్ చేశాడు. కొన్ని వారాలుగా ఈ సిరీస్ ను మేకర్స్ బాగానే ప్రమోట్ చేస్తున్నారు.
ఈ మధ్యే మ్యాన్షన్ 24 ట్రైలర్ కూడా రిలీజైంది. ఇది ఓ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ అమృత చుట్టూ తిరిగే కథ. ఆమె కనిపించకుండా పోయిన తన తండ్రి, ఆర్కియాలజిస్ట్ కాళిదాస్ కోసం వెతుకుతూ ఉంటుంది. అతడు సున్నితమైన సమాచారాన్ని తీసుకొని విదేశాలకు పారిపోయాడన్న వార్తలు వస్తాయి. అయితే తన తండ్రి గౌరవాన్ని నిలబెట్టడం కోసం అమృత ప్రయత్నిస్తూ ఉంటుంది.
అతన్ని వెతుక్కుంటూ ఓ పాడుబడిన మ్యాన్షన్ కు వెళ్తుంది. అక్కడ ఏం జరిగిందన్నది ఈ మ్యాన్షన్ 24 సిరీస్ లో ఆసక్తి రేపుతుంది. గతంలో రాజుగారి గదిలాంటి హారర్ మూవీస్ తీసిన ఓంకార్ కు హారర్ జానర్ కొత్త కాదు. అలాంటి డైరెక్టర్ నుంచి వెబ్ సిరీస్ పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. హారర్ కు కాస్త థ్రిల్, కామెడీని జోడించి గతంలో తన సినిమాలను సక్సెస్ చేశాడు ఓంకార్.
ఇప్పుడీ వెబ్ సిరీస్ తో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ స్టోరీతో మొదట అతడు ఓ సినిమానే చేద్దామనుకున్నా.. తర్వాత సిరీస్ తీయాలని నిర్ణయించుకోవడం విశేషం.