Businessman: బిజినెస్‍మ్యాన్ రీ-రిలీజ్‍తో ఫ్యాన్స్ సంబరాలు: దద్దరిల్లుతున్న థియేటర్లు.. వీడియోలు
Businessman Re-Release: బిజినెస్‍మ్యాన్ రి రిలీజ్ అయిన థియేటర్ల వద్ద మహేశ్ బాబు అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. థియేటర్లలో హంగామా చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
Businessman Re-Release: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు పుట్టిన రోజు సందర్భంగా ఆయన హీరోగా నటించిన బిజినెస్‍మ్యాన్ సినిమా నేడు (ఆగస్టు 9) థియేటర్లలో రీ-రిలీజ్ అయింది. 2012లో విడుదలైన ఆ చిత్రం అప్పట్లో సూపర్ హిట్ అయింది. సూర్యా భాయ్‍గా మహేశ్ బాబు యాక్టింగ్, డైలాగ్ డెలివరీ అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. నయా మహేశ్ ఈ సినిమాలో కనిపించారు. పూరి జగన్నాథ్ విభిన్నమైన టేకింగ్, అగ్రెసివ్ కథతో బిజినెస్‍మ్యాన్ బంపర్ హిట్ అయింది. ఇప్పుడు మళ్లీ 11ఏళ్ల తర్వాత థియేటర్లలోకి 4కే ఫార్మాట్లో ఆ సినిమా వచ్చింది. అయినా.. మళ్లీ థియేటర్లను షేక్ చేస్తోంది. బిజినెస్‍మ్యాన్ రీ-రిలీజ్‍కు ప్రేక్షకుల నుంచి భారీ స్పందన వచ్చింది. నేడు దాదాపు చాలా థియేటర్లు ఫుల్ అయ్యాయి.
బిజినెస్‍మ్యాన్ రీ-రిలీజ్ అయిన థియేటర్లలో మహేశ్ బాబు ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. థియేటర్లలో కాగితాలు చల్లుతూ.. డ్యాన్సులు చేస్తున్నారు. మహేశ్ బాబు అభిమానుల ఈలలు, ఆరుపులతో థియేటర్లు దద్దరిల్లిపోతున్నాయి. ముఖ్యంగా మహేశ్ పవర్‌ఫుల్ డైలాగ్‍లకు అభిమానులు కేకలు పెడుతున్నారు. మహేశ్ బాబు ముంబైలో అడుగుపెట్టే సీన్‍కు థియేటర్లు షేక్ అవుతున్నాయి. థియేటర్లలో అభిమానుల హంగామాకు సంబంధించి సోషల్ మీడియాలో వీడియోలను పోస్ట్ చేస్తున్నారు కొందరు నెటిజన్లు. అవి వైరల్‍గా మారుతున్నాయి.
బిజినెస్‍మ్యాన్ రీ-రిలీజ్ బుకింగ్స్ భారీ స్థాయిలో జరిగాయి. చాలాచోట్ల థియేటర్లు హౌస్ ఫుల్ అయ్యాయి. దీంతో రీ-రిలీజ్ సినిమాల విషయంలో ఓపెనింగ్ డే రికార్డును ఈ సినిమా బద్దలుకొడుతుందని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. తొలి రోజే రూ.6కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్లు వస్తాయని లెక్కలు వేస్తున్నారు.
బిజినెస్‍మ్యాన్ మూవీ 2021లో రిలీజై సూపర్ హిట్ అయింది. ‘గన్స్ నో నీడ్ అగ్రిమెంట్స్’ అనే ట్యాగ్‍తో ముంబై మాఫియా నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కింది. పూరి జగన్నాథ్ కథ, డైలాగ్స్ అదిరిపోయాయి. మహేశ్ బాబు డైలాగ్ డెలివరీ, యాక్టింగ్ ఈ చిత్రాన్ని నెక్స్ట్ లెవెల్‍కు తీసుకెళ్లాయి. దీంతో అప్పట్లోనే రూ.90కోట్లకుపైగా కలెక్షన్లను బిజినెస్‍మ్యాన్ దక్కించుకుంది. హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఈ చిత్రంలో మరింత గ్లామరస్‍గా కనిపించింది. ప్రకాశ్ రాజ్, నాజర్, రఘుబాబు, బ్రహ్మాజీ, షాయాజీ షిండే, సుబ్బరాజు ఈ సినిమాలో కీలకపాత్రలు పోషించారు. ఎస్.తమన్ మ్యూజిక్ కూడా ఈ చిత్రానికి మరో హైలైట్‍గా నిలిచింది.
ప్రస్తుతం, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ‘గుంటూరు కారం’ సినిమా చేస్తున్నారు మహేశ్ బాబు. ఆయన పుట్టిన రోజు సందర్భంగా నేడు ఈ చిత్ర యూనిట్ మహేశ్ బాబు పోస్టర్‌ను రిలీజ్ చేసింది. పంచె కట్టులో బీడీ కాలుస్తూ మాస్ లుక్‍లో అదిరిపోయారు మహేశ్. ‘గుంటూరు కారం’ మూవీ సంక్రాంతి సందర్భంగా వచ్చే ఏడాది జనవరి 12న రిలీజ్ చేయనున్నట్టు చిత్ర బృందం వెల్లడించింది.