India Lockdown Review: ఇండియా లాక్‌డౌన్.. మహమ్మారి చేదు అనుభవాలు మర్చిపోగలమా..?
India Lockdown Review: ఈ ఏడాది బబ్లీ బౌన్సర్ చిత్రంతో వైఫల్యాన్ని అందుకున్న బాలీవుడ్ విలక్షణ దర్శకుడు మధుర్ భండార్కర్ తెరకెక్కించిన ఇండియా లాక్‌డౌన్ జీ5 వేదికగా శుక్రవారం నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. మరి ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
చిత్రం- ఇండియా లాక్‌డౌన్
విడుదల- 2022 డిసెంబరు 2 నుంచి జీ5లో స్ట్రీమింగ్
నటీనటులు- శ్వేతా బసు ప్రసాద్, అహనా కుమ్రా, ప్రతీక్ బబ్ర్, సాయి తమ్హాకర్, ప్రకాశ్ బెల్వాడీ తదితరులు
నిర్మాతలు- అమిత్ జోషి, ఆరాధన సాహ
దర్శకుడు- మధుర్ భండార్కర్
India Lockdown Review: మూడేళ్లుగా కరోనా మహమ్మారి చేస్తున్న విజృంభణ మానవాళి అంత సులభంగా మర్చిపోలేం. ముఖ్యంగా ఆరంభంలో మహమ్మారి కారణంగా చిన్న, పెద్ద తేడా లేకుండా ప్రజలంతా తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. అందులోనూ దేశవ్యాప్తంగా మొదటిసారి విధించిన 21 రోజుల కరోనా లాక్‌డౌన్ తీవ్ర ప్రభావాన్ని చూపింది. ఎంతో మంది వలస కార్మికులకు చేదు అనుభవాన్ని మిగల్చింది. ఓ పక్క వ్యాధి బారిన పడి కేసుల పెరుగుదల, మరోపక్క తలదాచుకునేందుకు నీడ లేక అన్నార్థుల విల విల అధిక జనాభా ఉన్న మనదేశాన్ని అతలా కుతలం చేసింది. ఈ లాక్డౌన్ కాలంలో వివిధ మార్గాల్లో భయానక పరిస్థితులను పునఃసృష్టి చేసే ప్రయత్నం చేశారు బాలీవుడ్ విలక్షణ దర్శకులు మధుర్ భండార్కర్. ఆయన తెరకెక్కించిన ఇండియా లాక్‌డౌన్. ఆ సమయంలో మానవ భావోద్వేగాలు, సంఘర్షణలకు సంబంధించిన విభిన్న కోణాలను వివరించే నాలుకు సమాంతర కథలను ఆయన తెరకెక్కించారు. ఈ సినిమా జీ5 వేదికగా శుక్రవారం నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. మరి ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
ఎలా ఉందంటే..
ఇండియా లాక్‌డౌన్ చిత్రంలో దర్శకుడు మెలోడ్రామా, మలుపులకు తావివ్వకుండా వాస్తవాలను ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. ఈ విషయంలో సఫలీకృతులయ్యాడనే చెప్పవచ్చు. ప్రతి ఒక్కరూ ఇంటికే పరిమితం కావడం, కొత్త కొత్త వంటలను తయారు చేస్తూ చెఫ్‌లుగా మారిపోవడం, ప్రేమికులను డేట్స్‌కు వెళ్లలేకపోవడం, కిరాణా దుకాణాల బయట బారులు తీరిన జనం, హెల్త్ చెకప్‌లు, హోం క్వారంటైన్‌లు, మాస్క్‌లు, శానిటైజర్లు వాడటానికి విముఖత చూపడం ఇలా అన్నీ అంశాలను దృష్టిలో పెట్టుకని దర్శకుడు మధుర్ భండార్కర్ రెండు గంటల నిడివిలో అద్భుతంగా చూపించారు. అనవసరం విషయాలపై ఫోకస్ పెట్టకుండా ఏం చెప్పాలనుకుంటున్నారో పాయింట్లోకి వెళ్లిపోయారు. పాటలు, డ్యాన్స్ సీక్వెన్స్‌కు ఇందులో తావు లేదు.
ఎవరెలా చేశారంటే..
ఇండియా లాక్ డౌన్ చిత్రంలో కథ కంటే కూడా నటీనటుల పర్ఫార్మెన్స్ హైలెట్ అని చెప్పాలి. మంచి యాక్టర్లను ఎంచుకోవడంలోనే మధుర్ భండార్కర్ సక్సెస్ అయ్యారు. ఇందులో నటించిన ప్రతి ఒక్కరూ తమ దైన నటనతో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా వలస కార్మికులు, సెక్స్ వర్కర్లు జీవితం ఏ విధంగా ప్రభావితమైందో కళ్లకు కట్టినట్లు చూపించారు. కనీస అవసరాలు కూడా లేకుండా బతకడం ఎంత దుర్లభంగా ఉంటుందో ఈ చిత్రం చూస్తే తెలుస్తుంది. మనుగడ కోసం చేసే ప్రయాణం గురించి ఇండియా లాక్ డౌన్ ఎన్నో విషయాలను నేర్పుతుంది.
ఇద్దరు కుమార్తేలతో వలస వచ్చిన దంపతులు మాధవ్, ఫుల్‌మతి(ప్రతీక్ బబ్బర్, తమ్హాకర్) మధ్య నడిచే సన్నివేశాలు హృదయాలను కదిలిస్తాయి. సమాజంలో వలస కార్మిక వర్గానికి లాక్‌డౌన్ కలిగించిన విధ్వంసం సామాన్యుల ఊహకు కూడా అందదు. ఒక్కోసారి తిండి, నీళ్లు కూడా లేకుండా మండే వేడిలో ప్రతిరోజూ మైళ్ల దూరం నడిచే వారి హృదయ విదారకర దృశ్యాలు మీలో తెలియని భావోద్వేగాన్ని కదిలిస్తాయి. గొంత తడి ఆరిపోయేంతలా బాధను కలిగిస్తాయి. ముఖ్యంగా ప్రతీక్ బబ్బర్ తన నటనతో ఆ పాత్రకు జీవం పోశాడు. ఆహారం కోసం చెత్త కుప్పలో వెతికే దృశ్యం గుండెను పిండేస్తుంది. తమ్హాకర్ కూడా తన పాత్రలో ఒదిగిపోయింది. కొత్తబంగారు లోకం ఫేమ్ శ్వేతా బసు ప్రసాద్.. ఇందులో ముంబయి రెడ్ లైట్ ఏరియాకు చెందిన సెక్స్ వర్కర్‌గా అదిరిపోయే పర్ఫార్మెన్స్ చేసింది.
సాంకేతిక పరంగా ఈ సినిమా చాలా సీన్లు వాస్తవానికి దగ్గరగా ఉన్నాయి. అందుకు తగినట్లుగా నిర్మాణ విలువలు ఉన్నాయి. డార్క్ ఎమోషన్‌ను పండించడంలో మధుర్ భండార్కర్ మరోసారి విజయం సాధించారు. బబ్లీ బౌన్సర్ చిత్రంతో ఫ్లాప్ అందుకున్న ఆయనకు ఈ సినిమాతో మంచి విజయం దక్కించుకున్నారు.
చివరగా.. వాస్తవాలను కళ్లకు కట్టిన 'ఇండియా లాక్‌డౌన్'.. గుండెలను పిండేస్తుంది
రేటింగ్- 3.25/5.
సంబంధిత కథనం
టాపిక్