Madhavan on Oscars Nomination: రాకెట్రీ, కశ్మీర్ ఫైల్స్ మూవీలనూ ఆస్కార్స్‌కు పంపాలి: మాధవన్
Madhavan on Oscars Nomination: రాకెట్రీ, కశ్మీర్ ఫైల్స్ మూవీలనూ ఆస్కార్స్‌కు పంపాలని డిమాండ్ చేశాడు తమిళ సూపర్ స్టార్ మాధవన్. అంతేకాదు ఇండియాలో ఆస్కార్స్‌కు సమానంగా ఓ అవార్డు ఉండాలని అన్నాడు.
Madhavan on Oscars Nomination: ఆస్కార్స్ 2023కు ఇండియా నుంచి ఛెల్లో షో అనే గుజరాతీ మూవీని అధికారిక ఎంట్రీగా పంపిన విషయం తెలుసు కదా. దీనిపై ఇంకా చర్చ కొనసాగుతోంది. తాజాగా రాకెట్రీ స్టార్ మాధవన్ కూడా దీనిపై స్పందించాడు. తన రాకెట్రీ మూవీతోపాటు దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ది కశ్మీర్ ఫైల్స్ మూవీని కూడా ఆస్కార్స్‌కు పంపాలని డిమాండ్ చేయడం విశేషం.
తన నెక్ట్స్ మూవీ ధోకా రౌండ్ ది కార్నర్ మూవీ ప్రమోషన్‌లో పాల్గొన్న అతడు.. ఇండియా టుడేతో మాట్లాడుతూ ఈ కామెంట్స్ చేశాడు. అతనితోపాటు కశ్మీర్ ఫైల్స్ నటుడు దర్శన్ కుమార్, అపర్‌శక్తి ఖురానా, ఖుషాలీ కుమార్ కూడా ఇందులో పాల్గొన్నారు. ఇప్పుడు పంపించిన ఛెల్లో షో మూవీతోపాటు రాకెట్రీ, కశ్మీర్ ఫైల్స్‌లను కూడా పంపాల్సిందని మాధవన్ అన్నాడు.
"నా అభిప్రాయం మేరకు వాళ్లు రాకెట్రీ, ది కశ్మీర్ ఫైల్స్‌ను కూడా పంపాలి. దర్శన్ కశ్మీర్ ఫైల్స్ కోసం ప్రచారం ప్రారంభిస్తున్నాడు. నేను రాకెట్రీ కోసం చేస్తాను" అని మాధవన్ అన్నాడు. అయితే అదే సమయంలో ఆస్కార్స్‌కు అధికారిక ఎంట్రీగా వెళ్లిన ఛెల్లో షో మూవీకి ఆల్ ద బెస్ట్ చెప్పాడు. అవార్డు గెలిచి, దేశానికి గర్వకారణంగా నిలవాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు.
ఇక అదే సమయంలో ఇండియాలోనూ ఆస్కార్క్‌కు సమానంగా లేదంటే అంతకన్నా ఉత్తమమైన అవార్డు ఉండాలని కూడా మాధవన్ అనడం గమనార్హం. "ఇండియాలోనూ ఆస్కార్‌కు సరిసమానంగా లేదంటే అంతకన్నా ఉత్తమమైన అవార్డు ఉండాలని కోరుకుంటున్నా. అక్కడికెళ్లి మనల్ని మనం ప్రూవ్ చేసుకోవడం ఇక చాలు" అని మాధవన్ అనడం విశేషం.
ఆస్కార్స్‌కు ఉన్న క్రేజ్ గురించి కూడా మాధవన్ స్పందించాడు. "ఇలాంటి అవార్డు ఉండటం మంచిదే. అయితే ఇక్కడే ఒక తేడా ఉంది. ఆస్కార్‌ను పాశ్చాత్య దేశాల్లో గెలుచుకున్న వారి రేంజ్ పెరిగిపోతుంది. వాళ్ల ఆదాయం, ఇండస్ట్రీలో వాళ్ల ప్రతిష్ట పెరుగుతుంది. ఇండియాలోనూ ఇలాంటి అవార్డు ఉండాలి. దానిని అందుకున్న వారి విలువ కూడా అలాగే పెరగాలి" అని మాధవన్ అభిప్రాయపడ్డాడు.