R Madhavan: రాకెట్రీ మూవీ కోసం మాధవన్ ఇల్లు అమ్ముకున్నాడా.. ఇదీ అతని రియాక్షన్
R Madhavan: తన లేటెస్ట్ మూవీ రాకెట్రీ విషయంలో వస్తున్న పుకార్లకు చెక్ పెట్టాడు మాధవన్. ఈ సినిమా కోసం తన ఇంటిని అమ్ముకున్నాడన్న వార్తలపై తాజాగా అతడు స్పందించాడు.
ఓ డైరెక్టర్‌గా, ఓ నటుడిగా, నిర్మాతగా మాధవన్ చేసిన మూవీ రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్. ఈ సినిమాను దేశవ్యాప్తంగా అభిమానులు అక్కున చేర్చుకున్నారు. దేశం ఎప్పటికీ మరచిపోలేని, ఈ జనరేషన్‌కు పెద్దగా తెలియని ఓ ప్రముఖ సైంటిస్ట్‌పై జరిగిన కుట్రను ఈ సినిమా ద్వారా ప్రేక్షకులకు చెప్పే ప్రయత్నం చేశాడు మాధవన్. ఈ సినిమా సైంటిస్ట్ నంబి నారాయనణ్ క్యారెక్టర్‌లో మాధవనే నటించాడు.
చివర్లో నేరుగా ఆ సైంటిస్ట్ ద్వారానే తనకు న్యాయం చేయాలని కూడా మాధవన్ చెప్పించాడు. ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూలు రావడంతోపాటు బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్‌గానూ సక్సెసైంది. అయితే ఈ బయోపిక్‌ను చేయడానికి మాధవన్ తన ఇంటిని అమ్ముకున్నాడని వార్తలు వచ్చాయి. తాజాగా ట్విటర్ ద్వారా అతడు వీటిపై స్పందించాడు. ఈ మూవీ కోసం ఇల్లు అమ్ముకోవడం కాదు కదా.. నిజానికి మంచి లాభాలు తెచ్చిపెట్టిందని అతడు చెప్పాడు.
"ఓ యార్. దయచేసి నా త్యాగాన్ని మరీ ఎక్కువ చేసి చూపించకండి. నా ఇల్లే కాదు ఏమీ కోల్పోలేదు. నిజానికి ఈ రాకెట్రీ మూవీ కోసం పని చేసిన అందరూ చాలా గర్వంగా ఎక్కువ ఇన్‌కమ్ ట్యాక్స్ కట్టారు. దేవుడి దయ వల్ల మేమందరం మంచి లాభాలు అందుకున్నాం. నేను ఇప్పటికీ నా ఇంట్లోనే ఉంటున్నాను" అని మాధవన్ ట్వీట్ చేశాడు.
ప్రముఖ ఇస్రో సైంటిస్ట్ నంబి నారాయణన్ బయోపిక్కే ఈ రాకెట్రీ. ఇండియాకు క్రయోజనిక్ ఇంజిన్ల ప్రాముఖ్యతను చెప్పి, ఇస్రోకు ఎన్నో దశాబ్దాల పాటు సేవలందించిన గొప్ప సైంటిస్ట్ నంబి.. ఎవరు చేశారో ఇప్పటికీ రహస్యంగానే ఉన్న కుట్రల కారణంగా జీవితంలో ఎంతో కోల్పోయారు. 1994లో ఈ ఘటన జరిగింది. దీనిపై ఆయన 24 ఏళ్ల పాటు పోరాడి గెలిచారు. 2019లో కేంద్ర ప్రభుత్వం ఆయనకు పద్మభూషణ్ అవార్డు కూడా ఇచ్చి సత్కరించింది.