LGM Review: ఎల్‌జీఎమ్ తెలుగు రివ్యూ - ధోనీ ఫస్ట్ మూవీ ఎలా ఉంది? అత్తాకోడళ్ల కామెడీ మెప్పించిందా?
LGM Review: టీమ్ ఇండియా క్రికెటర్ ధోనీ నిర్మాతగా మారి తొలిసారి రూపొందించిన ఎల్‌జీఎమ్(లెట్స్ గెట్ మ్యారీడ్) మూవీ ఈ శుక్రవారం (ఆగస్ట్ 4న) థియేటర్ల ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చింది. రమేష్ తమిళమణి దర్శకత్వం వహించిన ఈ రొమాంటిక్ కామెడీమూవీ ఎలా ఉందంటే...
LGM Review: టీమ్ ఇండియా దిగ్గజ ఆటగాడు ధోనీ(Dhoni) నిర్మాణంలో రూపొందిన తమిళ మూవీ ఎల్‌జీఎమ్(లెట్స్ గెట్ మ్యారీడ్). హరీష్ కళ్యాణ్, ఇవానా జంటగా నటించిన ఈ సినిమాకు రమేష్ తమిళమణి దర్శకత్వం వహించాడు. కోలీవుడ్‌లో(Kollywood) జూలై 28న రిలీజైన ఈ మూవీ తెలుగులో ఒక వారం ఆలస్యంగా ఈ శుక్రవారం (ఆగస్ట్ 4న) ప్రేక్షకుల ముందుకొచ్చింది. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఎల్‌జీఎమ్ మూవీ ఎలా ఉంది? ధోనీ తొలి ప్రయత్నం తెలుగు ఆడియెన్స్‌ను మెప్పించిందా? లేదా? అన్నది చూద్దాం...
గౌతమ్, మీరా కథ...
గౌతమ్ (హరీష్ కళ్యాణ్), మీరా(ఇవానా) ఒకే కంపెనీలో పనిచేస్తుంటారు. రెండేళ్లుగా ప్రేమలో ఉంటారు. గౌతమ్ పెళ్లి కోసం చాలా రోజులుగా ఎదురుచూస్తుంటుంది అతడి తల్లి లీలా (నదియా). మీరాను ప్రేమిస్తున్న సంగతి గౌతమ్ చెప్పగానే సంతోషంగా పెళ్లికి ఒప్పుకుంటుంది.
మీరాను కోడలిగా కాకుండా కూతురిలా చూసుకోవాలని అనుకుంటుంది లీలా. మీరా మాత్రం పెళ్లి తర్వాత వెంటనే వేరు కాపురం పెడదామని చెప్పి గౌతమ్‌కు షాకిస్తుంది. ఆమె ప్రతిపాదనను గౌతమ్ ఒప్పుకోడు. ఇద్దరు విడిపోయే పరిస్థితి వస్తుంది. తనకు కాబోయే అత్త లీలా ఎలాంటిదో తెలుసుకోవడానికి ఆమెతో కలిపి ట్రిప్ ప్లాన్ చేస్తుంది మీరా. ఈ ట్రిప్‌లో లీలా తనకు నచ్చితేనే మన పెళ్లి జరుగుతుందని గౌతమ్‌కు కండీషన్ పెడుతుంది మీరా.
లేదంటే స్నేహితుల్లా విడిపోదామని అంటుంది. రెండు కుటుంబాలు కలిసి కూర్గ్ వెళతారు. ఈ ప్రయాణంలో ఏం జరిగింది? మీరా, లీలా మధ్యలో గౌతమ్ ఎలా నలిగిపోయాడు? కూర్గ్ నుంచి లీలా, మీరా.... గౌతమ్‌కు చెప్పకుండా గోవా ఎందుకు వెళ్లారు? గోవా నుంచి తిరిగి వచ్చే క్రమంలో వారు ఎలా చిక్కుల్లో పడ్డారు? ఈ ప్రయాణంలో కొడుకు గౌతమ్‌పై లీలాకు ఉన్న ప్రేమను మీరా అర్థం చేసుకుందా? గౌతమ్, మీరాల పెళ్లికి లీలా ఒప్పుకుందా? లేదా? అన్నదే ఈ సినిమా(LGM Review) కథ.
సీరియల్ కాన్సెప్ట్...
అత్తాకోడళ్ల గిల్లికజ్జాల ఫార్ములా సినిమాల కంటే సీరియల్స్‌లోనే ఎక్కువ ఫేమస్. మోతాదుకు మించిన సెంటిమెంట్‌తో ఏళ్లకు ఏళ్లు ఈ కాన్సెప్ట్‌తో సీరియల్స్‌ను సాగదీస్తుంటారు. ఈ సీరియల్ కథను ఎల్‌జీఎమ్(LGM Review) ద్వారా సిల్వర్‌స్క్రీన్‌పై ప్రజెంట్ చేసి హిట్ కొట్టాలని అనుకున్నాడు దర్శకుడు రమేష్ తమిళమణి.
సీరియల్స్‌లా సెంటిమెంట్‌తో కాకుండా ఈ అత్తాకోడళ్ల కాన్సెప్ట్‌కు కామెడీని మిక్స్ చేస్తూ రెండున్నర గంటలు ఆడియెన్స్‌ను ఎంటర్‌టైన్‌చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. కానీ దర్శకుడి ప్రయత్నం పూర్తిగా బెడిసికొట్టింది. సినిమాలా కాకుండా సీరియల్ ఫీల్‌ను ఎల్‌జీఎమ్ కలిగిస్తుంది.
ఐడియా ఇన్నోవేట్ కానీ...
పెళ్లికి ముందే అత్తగారితో కలిసి కోడలు ట్రిప్‌కు వెళ్లడం అనే ఐడియా డిఫరెంట్‌గా ఉంది. ఇందులో ఏ పక్షం ఉండాలో తెలియక హీరో సంఘర్షణకు లోనయ్యే సీన్స్ నుంచి కావాల్సినంత కామెడీని రాబట్టుకోవచ్చు. కానీ దర్శకుడు ఆ విషయంలో సక్సెస్ కాలేకపోయాడు. ఎల్‌జీఎమ్‌లో(LGM Review) అటు కామెడీ ఇటు ఎమోషన్ రెండు సరిగా పండలేదు.
కన్ఫ్యూజన్...
మీరాకు గౌతమ్ తన ప్రేమను వ్యక్తం చేసే సీన్‌తోనే ఈ సినిమా మొదలవుతుంది. ఆ తర్వాత తన ప్రేమ సంగతి తల్లికి చెప్పడం, రెండు కుటుంబాలు కలిసి ట్రిప్ ప్లాన్ చేయడం లాంటి ఆరంభ సన్నివేశాలతో సినిమా నత్తనడకన సాగుతుంది. ట్రిప్ వెళ్లే సీన్ నుంచి అయినా సినిమా(LGM Review) వేగం అందుకుంటుందని ఆశగా ఎదురుచూసిన అభిమానులకు నిరాశే మిగిల్చాడు డైరెక్టర్.
సీక్రెట్‌గా అత్తాకోడళ్లు కలిసి గోవా ట్రిప్ వెళ్లినట్లుగా చూపించి సెకండాఫ్‌లో ట్విస్ట్ ఇచ్చాడు. మీరా, లీలా ఒకరినొకరు అర్థం చేసుకునే డ్రామా మొత్తం కన్ఫ్యూజన్‌తో సాగుతుంది. ఏం జరుగుతుందో, కథ ఎటు వెళుతుందో అంతుపట్టదు. మధ్యలో కొత్త పాత్రలు వచ్చిన ఆ కన్ఫ్యూజన్‌ను పీక్స్‌కు తీసుకెళతాయి. ఇక క్లైమాక్స్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది.
హరీష్ కళ్యాణ్ గెస్ట్...
తల్లికి, ప్రియురాలికి సర్ధిచెప్పలేక ఇబ్బందులు పడే యువకుడిగా హరీష్ కళ్యాణ్ సెటిల్డ్ పర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకున్నాడు. సెకండాఫ్‌లో అతడి పాత్ర గెస్ట్‌గా మారిపోయిన అనుభూతి కలుగుతుంది. మీరాగా ఇవానా, లీలాపాత్రలో నదియా ఇద్దరు తమ నటనతో మెప్పించారు. యోగిబాబు అరవ కామెడీ భరించడం కష్టమే. హరీష్ కళ్యాణ్ బాస్ పాత్రలో డైరెక్టర్ వెంకట్ ప్రభు కనిపించాడు.
LGM Review -టెస్ట్ మ్యాచ్ లాంటి మూవీ…
క్రికెట్ పరిభాషలో చెప్పాలంటే ఎల్‌జీఎమ్ టెస్ట్ మ్యాచ్ లాంటి సినిమా. ధోనీ స్టైల్ మెరుపులు లేకుండా ప్రేక్షకుల ఓపికకు, సహనానికి పరీక్ష పెడుతుంది.