Krishnam Raju Birth Anniversary: కృష్ణంరాజు జయంతి వేడుకలు.. మొగల్తూరులో ఉచిత వైద్య శిబిరం, ఎవరి కోసమంటే?-krishnam raju birth anniversary in mogalthur and conducting free medical camp ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Krishnam Raju Birth Anniversary: కృష్ణంరాజు జయంతి వేడుకలు.. మొగల్తూరులో ఉచిత వైద్య శిబిరం, ఎవరి కోసమంటే?

Krishnam Raju Birth Anniversary: కృష్ణంరాజు జయంతి వేడుకలు.. మొగల్తూరులో ఉచిత వైద్య శిబిరం, ఎవరి కోసమంటే?

Sanjiv Kumar HT Telugu
Jan 19, 2024 06:25 AM IST

Krishnam Raju Birth Anniversary: రెబల్ స్టార్ దివంగత కృష్ణంరాజు జయంతి వేడుకలను మొగల్తూరులో నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా మొగల్తూరులో ఉచిత వైద్య శిబిరం నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..

కృష్ణంరాజు జయంతి వేడుకలు.. మొగల్తూరులో ఉచిత వైద్య శిబిరం, ఎవరి కోసమంటే?
కృష్ణంరాజు జయంతి వేడుకలు.. మొగల్తూరులో ఉచిత వైద్య శిబిరం, ఎవరి కోసమంటే?

Krishnam Raju Birth Anniversary: రెబల్ స్టార్, కేంద్ర మాజీ మాంత్రి, స్వర్గీయ కృష్ణంరాజు జయంతి వేడుకలు ఈ నెల 20వ తేదీన మొగల్తూరులో నిర్వహించనున్నారు. కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి, కూతురు ప్రసీద, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఈ వేడుకలకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా స్థానిక శ్రీ అందే బాపన్న కళాశాలలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించబోతున్నారు. ఈ వైద్య శిబిరం కృష్ణంరాజు, డాక్టర్ వేణు కవర్తపు ట్రస్టీలుగా ఉన్న యూకే ఇండియా డయాబెటిక్ ఫుట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరగనుంది.

ఈ ఉచిత వైద్య శిబిరంలో జుబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రి నుంచి డాక్టర్ శేషబత్తారు, భీమవరంలోని వర్మ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ నుంచి డా.వర్మ పాల్గొంటారు. కృష్ణంరాజు జయంతి వేడుకల్లో సందర్భంగా ఏర్పాటు చేయనున్న ఈ ఉచిత వైద్య శిబిరంలో డయాబెటిస్‌తో బాధపడుతున్న స్థానిక ప్రజలకు ఉచిత వైద్య పరీక్షలు, మెడిసిన్స్, చికిత్స అందిస్తారని కృష్ణంరాజు భార్య శ్యామలాదేవి తెలిపారు. మొగల్తూరుతో పాటు చుట్టు పక్కల గ్రామాల ప్రజలు కూడా ఈ ఉచిత వైద్య శిబిరం సేవలను ఉపయోగించుకోవచ్చని ఆమె వెల్లడించారు.

"కృష్ణం రాజు గారి జయంతి వేడుకలను ఆయనకు ఎంతో ఇష్టమైన మొగల్తూరులో చేస్తున్నాం. ఈ సందర్భంగా శ్రీ అందే బాపన్న కళాశాలలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేస్తున్నాం. ఈ శిబిరానికి విదేశాల నుంచి పలువురు వైద్యులు వస్తున్నారు. ఇక్కడి ప్రజలంతా ఈ వైద్య శిబిరం సేవలు వినియోగించుకోవాలి. పేదలకు వైద్య సేవలు అందాలని ఆయన ఎప్పుడూ కోరుకునేవారు. నేను, ప్రసీద, బాబు ప్రభాస్ ఈ వైద్య శిబిరం ఏర్పాటు చేయిస్తున్నాం. సుమారు వెయ్యి మంది దాకా ఈ వైద్య శిబిరానికి వస్తారని ఆశిస్తున్నాం" అని శ్యామలాదేవి తెలిపారు.

ఇదిలా ఉంటే రెబల్ స్టార్ కృష్ణంరాజు 2022 సంవత్సరంలో నవంబర్ 9న అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. కృష్ణంరాజు సొంతూరు మొగుల్తూరులో 1904, జనవరి 20న జన్మించిన ఆయన చదువు పూర్తి చేశాకా కొన్నాళ్లు జర్నలిస్టుగా పని చేశారు. ఆ తర్వాత సినీ రంగంపై ఇంట్రెస్టుతో అందులోకి అడుగుపెట్టారు. మొదటగా 1966 సంవత్సరంలో వచ్చిన చిలకా గోరింక అనే మూవీలో నటించారు కృష్ణంరాజు. హీరోగా చిలకా గోరింక మూవీతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు కృష్ణంరాజు.

అయితే, తెలుగు చిత్ర పరిశ్రమలోకి హీరోగా అడుగుపెట్టినప్పటికీ విలన్‌గా కూడా నటించారు కృష్ణంరాజు. దివంగత సూపర్ స్టార్ కృష్ణ నటించిన అవే కళ్లు సినిమాలో విలన్‌గా ఆకట్టుకున్నారు కృష్ణంరాజు. 1977, 1984లో నంది అవార్డులు అందుకున్నారు కృష్ణంరాజు. ఇక 1986 సంవత్సరంలో వచ్చిన తాండ్ర పాపారాయుడు సినిమాకు ఉత్తమ నటుడిగా ఫిల్మ్ ఫేర్ అవార్డు సాధించారు కృష్ణంరాజు. ఆయనకు నట వారసుడిగా ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్‌గా మంచి పేరు సంపాదించుకున్నాడు.

కృష్ణంరాజు ప్రభాస్ కలిసి కొన్ని చిత్రాల్లో కూడా నటించిన విషయం తెలిసిందే. మొదట బిల్లా మూవీలో ప్రభాస్, కృష్ణంరాజు నటించారు. మెహర్ రమేష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో బిల్లాను పట్టుకునే ఇండియన్ పోలీస్ ఆఫీసర్‌గా కృష్ణంరాజు ఆకట్టుకున్నారు. రాఘవ లారెన్స్ దర్శకత్వంలో వచ్చిన రెబల్ మూవీలో తండ్రీకొడుకులుగా కృష్ణంరాజు, ప్రభాస్ రెండోసారి కలిసి నటించారు. కానీ, ఈ సినిమా బాక్సాఫీస్ ఘోరంగా ప్లాప్ అయింది.

ఈ రెండు చిత్రాలే కాకుండా కృష్ణంరాజు, ప్రభాస్ కలిసి నటించిన మరో సినిమా రాధేశ్యామ్. రాధా కృష్ణ కుమార్ తెరకెక్కించిన ఈ సినిమాలో ప్రభాస్ జ్యోతిష్కుడిగా కనిపిస్తే.. కృష్ణంరాజు గురూజీ పరమహంస పాత్రలో కృష్ణంరాజు అలరించారు. ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ సినిమా కూడా తెలుగు బాక్సాఫీస్ వద్ద దారుణంగా డిజాస్టర్ టాక్ అందుకుంది.

Whats_app_banner