Tollywood Senior Directors: పూర్వ వైభ‌వం కోసం ఎదురుచూస్తోన్న సీనియ‌ర్ డైరెక్ట‌ర్లు - హిట్టు ద‌క్కేది ఎవ‌రికో-krishna vamsi to teja tollywood senior directors upcoming movies ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Tollywood Senior Directors: పూర్వ వైభ‌వం కోసం ఎదురుచూస్తోన్న సీనియ‌ర్ డైరెక్ట‌ర్లు - హిట్టు ద‌క్కేది ఎవ‌రికో

Tollywood Senior Directors: పూర్వ వైభ‌వం కోసం ఎదురుచూస్తోన్న సీనియ‌ర్ డైరెక్ట‌ర్లు - హిట్టు ద‌క్కేది ఎవ‌రికో

Nelki Naresh Kumar HT Telugu
Mar 10, 2023 06:01 AM IST

Tollywood Senior Directors: యంగ్ డైరెక్ట‌ర్స్ జోరుతో గ‌త కొన్నేళ్లుగా విజ‌యాల‌ రేసులో వెనుక‌బ‌డిపోయారు ప‌లువురు సీనియ‌ర్ డైరెక్ట‌ర్లు. పూర్వ వైభ‌వం కోసం ఎదురుచూస్తోన్న వారు ప్ర‌స్తుతం డిఫ‌రెంట్ కాన్సెప్ట్‌ల‌తో కూడిన సినిమాల‌తో ఈ ఏడాది ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నారు. వీరిలో స‌క్సెస్ అందుకునేది ఎవ‌ర‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.

రంగ‌మార్తండ
రంగ‌మార్తండ

Tollywood Senior Directors: వినాయ‌క్‌, తేజ, కృష్ణ‌వంశీ...టాలీవుడ్‌లో ట్రెండ్ సెట్ట‌ర్ డైరెక్ట‌ర్లుగా పేరుతెచ్చుకున్నారు. ఒక‌ప్పుడు స్టార్ హీరోల‌తో వ‌రుస‌గా సినిమాలు చేస్తూ అద్భుత విజ‌యాల్ని అందుకున్నారు. న‌వ‌త‌రం ద‌ర్శ‌కులు రేసులోకి రావ‌డంతో ఈ సీనియ‌ర్ డైరెక్ట‌ర్లు జోరు ప్ర‌స్తుతం త‌గ్గింది. ఓ స‌క్సెస్‌తో రీఎంట్రీ ఇచ్చేందుకు ఈ ద‌ర్శ‌కులు ఎదురుచూస్తోన్నారు. ఈ ఏడాది వీరు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన సినిమాలు ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాయి. ఆ సినిమాలు ఏవంటే...

కృష్ణ‌వంశీ రంగ‌మార్తండ‌

సుదీర్ఘ విరామం త‌ర్వాత సీనియ‌ర్ డైరెక్ట‌ర్ కృష్ణ‌వంశీ మెగాఫోన్ ప‌డుతూ రంగ‌మార్తండ పేరుతో ఓ సినిమాను రూపొందిస్తోన్నారు. మ‌రాఠీ భాష‌లో విజ‌య‌వంత‌మైన న‌ట‌సామ్రాట్ ఆధారంగా తెర‌కెక్కుతోన్న ఈ సినిమాలో ప్ర‌కాష్‌రాజ్‌, ర‌మ్య‌కృష్ణ కీల‌క పాత్ర‌ల్ని పోషిస్తోన్నారు.

విశ్రాంత రంగ‌స్థ‌ల క‌ళాకారుడి జీవితం నేప‌థ్యంలో ఈ సినిమా తెర‌కెక్కుతోంది. ఇందులో అన‌సూయ భ‌ర‌ద్వాజ్‌, శివాత్మిక రాజ‌శేఖ‌ర్‌, రాహుల్ సిప్లిగంజ్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తోన్నారు. ఈ సినిమాతో కృష్ణ‌వంశీ పూర్వ వైభ‌వాన్ని సొంతం చేసుకుంటాడా లేదా అన్న‌ది త్వ‌ర‌లో తేల‌నుంది.

నాలుగేళ్ల త‌ర్వాత తేజ‌...

దాదాపు నాలుగేళ్ల గ్యాప్ త‌ర్వాత అహింస సినిమా ద్వారా ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాడు మ‌రో సీనియ‌ర్ డైరెక్ట‌ర్ తేజ‌. ఈ సినిమాతో నిర్మాత సురేష్‌బాబు త‌న‌యుడు అభిరామ్ హీరోగా ప‌రిచ‌యం కానున్నాడు. త‌న‌దైన శైలి ప్రేమ‌క‌థ‌తో తేజ ఈసినిమాను తెర‌కెక్కిస్తోన్నాడు. ఈ సినిమా షూటింగ్ పూర్త‌యిన ఇంకా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయ‌లేదు.

వినాయ‌క్ ప్ర‌స్తుతం ఛ‌త్ర‌ప‌తి హిందీ రీమేక్‌తో బిజీగా ఉన్నాడు. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా న‌టిస్తోన్న ఈ రీమేక్‌తో వినాయ‌క్ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వ‌బోతున్నాడు.

అలాగే స‌మంత శాకుంత‌లంతో పాన్ ఇండియ‌న్ మార్కెట్‌పై గురిపెట్టాడు మ‌రో సీనియ‌ర్ డైరెక్ట‌ర్ గుణ‌శేఖ‌ర్‌. మ‌హాభార‌తంలోని శకుంత‌ల‌, దుష్యంతుల ప్ర‌ణ‌య‌గాథ ఆధారంగా ఈ సినిమా తెర‌కెక్కుతోన్న ఈ సినిమా ఏప్రిల్ 14న రిలీజ్ కానుంది. గుణ‌శేఖ‌ర్‌కు ఈ స‌క్సెస్ కీల‌కంగా మారింది.

అఖిల్‌పైనే సురేంద‌ర్‌రెడ్డి ఆశ‌లు...

కిక్‌, రేసుగుర్రం లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్స్‌తో బాక్సాఫీస్ రికార్డుల‌ను తిర‌గ‌రాసిన సురేంద‌ర్‌రెడ్డి ప్ర‌స్తుతం అఖిల్ అక్కినేనితో ఏజెంట్ సినిమాను రూపొందిస్తోన్నాడు. స్పై యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ సినిమాతో సురేంద‌ర్‌రెడ్డి మ‌రో బ్లాక్‌బ‌స్ట‌ర్ అందుకుంటాడా లేదా అన్న‌ది ఏప్రిల్ 28న తేల‌నుంది. క‌మ‌ర్షియ‌ల్ స‌క్సెస్ కోసం ఎదురుచూస్తోన్న మ‌రో డైరెక్ట‌ర్ శ్రీవాస్ ప్ర‌స్తుతం గోపీచంద్‌తో రామ‌బాణం సినిమాను రూపొందిస్తోన్నాడు. మే 5న ఈ సినిమా రిలీజ్ కాబోతున్న‌ది.

టాపిక్