Keedaa Cola Review: కీడా కోలా రివ్యూ - తరుణ్ భాస్కర్ క్రైమ్ కామెడీ మూవీ ఎలా ఉందంటే?
Keedaa Cola Review: చైతన్య రావు, బ్రహ్మానందం, రాగ్‌మయూర్ ప్రధాన పాత్రల్లో నటించిన కీడా కోలా మూవీ ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహిస్తూ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ఎలా ఉందంటే...
Keedaa Cola Review: పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది తర్వాత తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహించిన కీడా కోలా మూవీ శుక్రవారం (నవంబర్ 3న ) ప్రేక్షకుల ముందుకొచ్చింది. క్రైమ్ కామెడీ కథాంశంతో రూపొందిన ఈ సినిమాలో చైతన్యరావు, బ్రహ్మానందం, రాగ్‌మయూర్ కీలక పాత్రలు పోషించారు. టీజర్స్, ట్రైలర్స్‌తో తెలుగు ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించిన ఈ లో బడ్జెట్ మూవీ ఎలా ఉంది? గత సినిమాల స్థాయిలో తరుణ్ భాస్కర్ కీడా కోలాతో నవ్వించాడా? లేదా? అన్నది తెలియాలంటే కథలోని వెళ్లాల్సిందే.
వాస్తు, జీవన్ గ్యాంగ్…
వాస్తు (చైతన్యరావు)ను తాతయ్య వరదరాజు (బ్రహ్మానందం) పెంచి పెద్దచేస్తాడు. సిమ్యులేటర్ బొమ్మలను అమ్మే కంపెనీలో పనిచేసే వాస్తుపై ఆ కంపెనీ కేసు పెడుతుంది. ఓ బొమ్మను పాడు చేసినందుకు కోటి రూపాయలు నష్టపరిహారంగా వాస్తు కట్టాల్సివస్తుంది. ఆ డబ్బులు ఎలా సంపాదించాలా అని ఆలోచిస్తుంటాడు వాస్తు.
తాను కొన్న కీడా కోలా అనే కూల్‌డ్రింక్‌లో బొద్దింక రావడంతో ఆ కంపెనీ మీద కేసు వేసి కోటి రూపాయల్ని సంపాదించాలని ప్లాన్ చేస్తాడు. కీడా కోలా డీల్‌లో వాస్తుకు సహాయం చేస్తోన్న అతడి ఫ్రెండ్ లాయర్ కౌశిక్ (రాగ్ మయూర్)కు నాయుడు (తరుణ్ భాస్కర్) అనే రౌడీ యాక్సిడెంట్ చేస్తాడు. వాస్తును నాయుడు గ్యాంగ్ ఎందుకు టార్గెట్ చేసింది? తన అన్న జీవన్ (జీవన్) ను కార్పొరేటర్ చేయాలని అనుకున్న నాయుడు వాస్తు వెంట ఎందుకు పడ్డాడు?
రౌడీ జీవితానికి స్వస్తి చెప్పి కీడా కోలా కంపెనీలో పనిచేస్తోన్న నాయుడికి కూల్‌డ్రింక్‌లో బొద్దింక రావడానికి ఏమైనా సంబంధం ఉందా? నాయుడు, వాస్తు గ్యాంగ్ ఎలా కలుసుకున్నాయి? ఈ ఇద్దరిలో నష్టపరిహారాన్ని కీడా కోలా ఓనర్ (రవీంద్ర విజయ్) ఎవరికి ఇచ్చాడు అన్నదే ఈ సినిమా కథ.
గత సినిమాలకు భిన్నంగా...
పెళ్లిచూపులు, ఈ నగరానికి ఏమైంది సినిమాల్లో యువత మనస్తత్వాల్ని, వారి అల్లరితనాన్ని చూపించారు దర్శకుడు తరుణ్ భాస్కర్. ఆ రెండు సినిమాలకు భిన్నంగా క్రైమ్ కథాంశంతో కీడా కోలా సినిమాను తెరకెక్కించారు. జోనర్ మార్చిన తనకు మంచి పట్టున్న కామెడీని మాత్రం వీడలేదు. పేరుకు క్రైమ్ సినిమానే అయినా నవ్వించడమే మెయిన్ టార్గెట్‌గా పెట్టుకొని కీడా కోలా సినిమాను రూపొందించాడు.
వాస్తవ ఘటనల స్ఫూర్తితో...
కూల్‌డ్రింక్‌లలో పురుగులు, పాములు కనిపించడం వంటి న్యూస్‌లు అప్పుడప్పుడు వినిపిస్తుంటాయి, అలాంటి సంఘటనల నుంచి స్ఫూర్తి పొందుతూ కీడా కోలా కథ రాసుకున్నాడు. ఈ పాయింట్‌కు వాస్తు, నాయుడు రెండు గ్యాంగుల మధ్య పోరాటాన్నిజోడించి వినోదాత్మకంగా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఫన్ రైడ్‌గా సినిమాను నడిపించారు. ఈ గ్యాంగ్ మధ్యలోకి గమ్మత్తైన పాత్రలు ఎంట్రీ ఇస్తూ నవ్వుల డోసును మరింత పెంచుతాయి.
సెకండాఫ్ హైలైట్...
వాస్తు, వరదరాజు పాత్రల పరిచయం, వాస్తుపై ఉన్న కోర్టు కేసు అంశాలతో ఫస్ట్ హాఫ్ సరదాగా సాగిపోతుంది. కౌశిక్‌కు యాక్సిడెంట్‌తో నాయుడు, జీవన్ గ్యాంగ్ వారి జీవితంలోకి ఎంటరయ్యే సీన్‌తో సినిమా ఇంట్రెస్టింగ్‌గా మారుతుంది. కార్పొరేటర్ కావడానికి జీవన్ చేసే ప్రయత్నాలు, అతడికి ఎదురయ్యే అవమానాలను కూడా ఫన్నీగానే చూపించారు తరుణ్ భాస్కర్.
ఫస్ట్ హాఫ్‌తో పోలిస్తే సెకండాఫ్‌లోనే కామెడీ ఎక్కువగా వర్కవుట్ అయ్యింది. కీడా కోలా బ్రాండ్ అంబాసిడర్‌గా గెటప్ శీను ఎపిసోడ్‌తో పాటు నాయుడు, వాస్తు ఇంగ్లీష్‌లో మాట్లాడటానికి ప్రయత్నించే సీన్స్, వాస్తు తయారు చేసిన బొమ్మతో నాయుడు ప్రేమలో పడే సీన్స్‌లోని ఫన్ బాగా వర్కవుట్ అయ్యింది. కథలో ఎలాంటి కొత్తదనం లేకపోయినా కామెడీతో వాటిని కవర్ చేయడానికి ప్రయత్నించాడు తరుణ్‌భాస్కర్.
బ్రహ్మానందం ప్లస్ పాయింట్...
కీడాకోలాకు దర్శకత్వం వహిస్తూనే నాయుడు అనే పాత్రలో తరుణ్ భాస్కర్ కనిపించాడు. తన కామెడీ టైమింగ్‌తో మెప్పించాడు. వరదరాజుగా బ్రహ్మానందం పాత్ర ఈ సినిమాకు ప్లస్‌పాయింట్‌గా నిలిచింది.
వీల్ చెయిర్‌కు పరిమితమైన పాత్రలో కనిపించి కామెడీని పండించాడు. చైతన్యరావు ను కొత్తగా చూపించాడు తరుణ్ భాస్కర్. అతడిలోని కామెడీ కోణాన్ని దర్శకుడు వాడుకున్న తీరు బాగుంది. లాయర్‌గా రాగ్‌మయూర్, షాట్స్ అనే పాత్రలో విష్ణు క్యారెక్టర్స్ అలరిస్తాయి. గెటప్ శీను, జీవన్ మెప్పించారు.
లాజిక్స్‌తో సంబంధం లేకుండా....
కీడాకోలా కథ, లాజిక్స్ గురించి ఆలోచించకుండా చూస్తే రెండు గంటల పాటు వినోదాన్ని పంచుతుంది.
టాపిక్