Kantara Success Meet: కంటెంట్ బాగుంటే భాష అడ్డు కాదు.. కాంతారా సక్సెస్ మీట్‌లో రిషబ్ శెట్టి
Kantara Success Meet: కంటెంట్ బాగుంటే భాష అడ్డు కాదని అన్నాడు కాంతారా మూవీ హీరో, డైరెక్టర్ రిషబ్ శెట్టి. ఈ సినిమా తెలుగులోనూ ప్రభంజనం సృష్టించడంతో బుధవారం (అక్టోబర్ 19) హైదరాబాద్‌లో సక్సెస్ మీట్ నిర్వహించారు.
Kantara Success Meet: కొన్ని దశాబ్దాలుగా కన్నడ సినిమాను పట్టించుకున్న వాళ్లే లేరు. కానీ ఒకే ఏడాది మూడు కన్నడ సినిమాలు ఇండియా వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. కేజీఎఫ్ 2, విక్రాంత్ రోణ.. తాజాగా కాంతారా సినిమాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. భాషతో సంబంధం లేకుండా కేవలం డబ్ చేసి రిలీజ్ చేసినా ఈ సినిమాలను ఒక రేంజ్‌లో ఆదరించారు.
సెప్టెంబర్ 30న కన్నడలో రిలీజై సూపర్ హిట్ అయిన కాంతారా మూవీని ప్రత్యేకంగా తెలుగులో డబ్ చేసి అక్టోబర్ 15న రిలీజ్ చేశారు. ఈ సినిమా నాలుగు రోజుల్లోనే రూ.20 కోట్లకుపైగా వసూలు చేసి సంచలనం సృష్టించింది. తెలుగులో ఈ సినిమాను గీతా ఫిల్మ్స్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా విడుదల చేశారు. ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులు ఆదరించడంతో బుదవారం (అక్టోబర్ 19) సక్సెస్ మీట్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఈ మూవీ హీరో, డైరెక్టర్ అయిన రిషబ్ శెట్టి మాట్లాడుతూ.. తనకు ఈ మూవీ మంచి ఎనర్జీ ఇచ్చిందని, మంచి కంటెంట్ ఉంటే భాష అడ్డు కాదని నిరూపితమైందని అన్నాడు. "మా కాంతారా సినిమాను తక్కువ సమయంలోనే అల్లు అరవింద్ గీతా ఫిల్మ్స్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా తెలుగులో రిలీజ్ చేయడం, ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి ఆదరణ లభిస్తుండటం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా నాకు మంచి ఎనర్జీ ఇచ్చింది. మంచి కంటెంట్ ఉంటే సినిమాలకు భాష అడ్డు కాదని తెలుగు ప్రేక్షకులు నిరూపించారు. నాలుగు రోజుల్లోనే రూ.20 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. ఇంత విజయాన్ని అందించిన తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు. వరాహ రూపం అనేది విష్ణుమూర్తికి కనెక్ట్ అవుతుంది. అందుకే దానిని మా సంస్కృతికి ఎమోషన్స్ జోడించి ఈ సినిమా తీశాం" అని రిషబ్ అన్నాడు.
ఇక ఈ మూవీని తెలుగులో రిలీజ్ చేసిన నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ.. "సినిమాకు భాష అడ్డు కాదు. కేవలం ఎమోషన్ మాత్రమే కనెక్ట్ అవుతుంది. ఈ సినిమా కథను ఏ ఇంగ్లిష్, యురోపియన్, కొరియన్ నుంచి కాపీ చేసింది కాదు. వాళ్ల ఊళ్లో జరిగిన విశేషాలను తీసుకొని రాసుకున్న కథ. ఆ ఎమోషన్ కూడా ఈయనకు మట్టిలో పుట్టిన కథ ద్వారా ఫీలై చాలా చక్కగా తీశారు. బన్నీ వాసు ఈ సినిమా చూడమంటే కన్నడలో చూశాను. విష్ణు తత్వం ఉన్న ఈ సినిమా కథ మన సింహాచలానికి కూడా ఇది కనెక్ట్ అవుతుందని అనుకున్నాను. ఈ సినిమాలో హీరో జీవించేశాడు. అందుకే ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేయాలని భావించాను" అని చెప్పాడు.
టాపిక్