Rajamouli on Vikrant Rona: విక్రాంత్ రోణ మూవీపై రాజమౌళి రియాక్షన్ ఇదీ
Rajamouli on Vikrant Rona: కన్నడ సూపర్‌స్టార్ కిచ్చా సుదీప్ నటించిన విక్రాంత్ రోణ మూవీ బాక్సాఫీస్ దగ్గర దూసుకెళ్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీకి చాలా వరకూ పాజిటివ్ రివ్యూలే వచ్చాయి.
కర్ణాటకతోపాటు మొత్తం ఇండియాలో సక్సెస్‌ఫుల్‌గా దూసుకెళ్తున్న విక్రాంత్ రోణ మూవీపై స్పందించాడు దర్శక ధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి. ఈగ మూవీతో రాజమౌళి డైరెక్షన్‌లోనే కిచ్చా సుదీప్ తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత బాహుబలిలోనూ సుదీప్‌కు రాజమౌళి ఛాన్సిచ్చాడు. ఇక ఇప్పుడు అదే సుదీప్ నటించిన విక్రాంత్ రోణ సక్సెస్ కావడంపై రాజమౌళి ట్వీట్ చేశాడు.
హారర్ థ్రిల్లర్‌గా భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన విక్రాంత రోణ మూవీ తొలి మూడు రోజులు బాక్సాఫీస్ దగ్గర రూ.50 కోట్లకుపైగా వసూలు చేసింది. తాజాగా ఈ సినిమాను చూసిన రాజమౌళి ట్విటర్‌లో తన రివ్యూ చెప్పాడు. ఈ మూవీ సక్సెస్‌పై సుదీప్‌కు శుభాకాంక్షలు చెప్పాడు. ఈ మూవీలో క్లైమాక్స్‌కు ముందు వచ్చే సీన్ మూవీకే హైలైట్ అని రాజమౌళి చెప్పడం విశేషం.
"విక్రాంత్ రోణ సక్సెస్ సాధించినందుకు కిచ్చా సుదీప్‌కు కంగ్రాట్స్. ఇలాంటి స్టోరీతో రావాలంటే ధైర్యం, నమ్మకం కావాలి. నువ్వు అది చేశావు. ఫలితం వచ్చింది. సినిమాలో ప్రి క్లైమాక్స్ అద్భుతంగా ఉంది. అది అస్సులు ఊహించలేదు. కానీ చాలా బాగుంది" అని రాజమౌళి ట్వీట్ చేశాడు. అనూప్ భండారీ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్, నీతా అశోక్, నిరూప్ భండారీ ముఖ్యపాత్రల్లో కనిపించారు.
సంబంధిత కథనం