Kantara box office collections: రూ.100 కోట్లకు చేరువైన కాంతారా.. అదిరిపోయే కలెక్షన్లు-kantara box office collections set to reach 100 crores this week end ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Kantara Box Office Collections: రూ.100 కోట్లకు చేరువైన కాంతారా.. అదిరిపోయే కలెక్షన్లు

Kantara box office collections: రూ.100 కోట్లకు చేరువైన కాంతారా.. అదిరిపోయే కలెక్షన్లు

HT Telugu Desk HT Telugu
Oct 14, 2022 12:02 PM IST

Kantara box office collections: రూ.100 కోట్లకు చేరువైంది కన్నడ మూవీ కాంతారా. అదిరిపోయే కలెక్షన్లతో దూసుకెళ్తోంది. హిందీ, తమిళం, తెలుగుల్లోనూ డబ్‌ కావడంతో ఈ మూవీ క్రేజ్‌మరింత పెరిగింది.

కాంతారా మూవీలో రిషబ్ శెట్టి
కాంతారా మూవీలో రిషబ్ శెట్టి

Kantara box office collections: బాక్సాఫీస్‌ దగ్గర మరో కన్నడ సినిమా మ్యాజిక్‌ చేస్తోంది. కేజీఎఫ్‌ సృష్టించిన ప్రభంజనం మరవక ముందే కాంతారా అనే మరో కన్నడ సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా కర్ణాటకలో రూ.70 కోట్లకుపైగా వసూలు చేసింది. ఇక ప్రపంచవ్యాప్తంగా ఈ వీకెండ్‌ రూ.100 కోట్ల క్లబ్‌లో చేరనుంది.

కన్నడనాట ఈ సినిమాకు వచ్చిన క్రేజ్‌ చూసి హిందీ, తమిళం, తెలుగుల్లోనూ డబ్‌ చేశారు. శుక్రవారం (అక్టోబర్‌ 14) హిందీలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఇక శనివారం (అక్టోబర్‌ 15) తెలుగు, తమిళంలలో రిలీజ్‌ కానుండటం విశేషం. సెప్టెంబర్‌ 30వ తేదీన మణిరత్నం పొన్నియిన్‌ సెల్వన్‌ మూవీతో కలిసి ఈ సినిమా రిలీజైన విషయం తెలిసిందే.

పొన్నియిన్‌ సెల్వన్‌ భారీ బడ్జెట్‌తో ముందు నుంచే ప్రేక్షకులను థియేటర్లకు రప్పించగా.. కాంతారా మాత్రం ఓ చిన్న సినిమాగా రిలీజై ప్రేక్షకుల ఆదరణ సొంతం చేసుకుంది. రిషబ్‌ శెట్టి తానే నటించి, డైరెక్ట్‌ చేసిన ఈ సినిమాకు కన్నడనాట ఫ్యాన్స్‌ ఫిదా అవుతున్నారు. చాలా మంది తెలుగు ప్రేక్షకులు కూడా కన్నడలోనే ఈ సినిమాను ఇప్పటికే చూసేశారు. కాంతారా అంటే మార్మికమైన అడవి అని అర్థం.

ఈ కాంతారా మూవీ కర్ణాటకలో బాక్సాఫీస్‌ దగ్గర దూసుకెళ్తున్నట్లు ట్రేడ్‌ అనలిస్ట్‌ త్రినాథ్‌ చెప్పాడు. "కర్ణాటకలో రోజురోజుకూ కాంతారా మూవీ షోల సంఖ్య పెరుగుతోంది. టికెట్లకు డిమాండ్‌ పెరుగుతుండటంతో తప్పనిసరి పరిస్థితుల్లో థియేటర్ల ఓనర్లు అదనపు షోలను వేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఈ సినిమా రూ.70 కోట్లకుపైగా వసూలు చేసింది. రూ.100 కోట్ల మార్క్‌కు చేరువవుతోంది. ఈ వీకెండ్‌లోనే అందుకోబోతోంది. ఈ సినిమా హిందీ, తెలుగు, తమిళంలోనూ రిలీజ్‌ కాబోతోంది" అని త్రినాథ్‌ చెప్పాడు.

ఓవైపు కర్ణాటకలో పొన్నియిన్‌ సెల్వన్‌ మూవీ కూడా బాగానే ఆడుతున్నా.. దాని ప్రభావం కాంతారాపై ఏమాత్రం లేదని కూడా త్రినాథ్‌ తెలిపాడు. అటు చిరంజీవి గాడ్‌ఫాదర్‌ మూవీ కూడా గత వారం కర్ణాటకలో రిలీజై మంచి కలెక్షన్లు రాబట్టింది. తొలి వారంలో అక్కడ గాడ్‌ఫాదర్‌ మూవీ రూ.8 కోట్లు రాబట్టింది.

కాంతారా గురించి..

లోకల్ కంటెంట్ తో ఈ సినిమా ప్రేక్షకుల మందుకు వచ్చింది. దక్షిణ కన్నడలోని భూత కోలా, కంబళ, కోళ్ల పందాలను చిత్రంలో చక్కగా చూపించారు. ప్రేక్షకుడికి కొత్త అనుభూతి కలుగుతుంది. కాంతార కథలో ట్విస్టులు కూడా బాగుంటాయి. ఎక్కడా బోర్ కొట్టనివ్వకుండా ప్రేక్షకులను కట్టిపడేస్తాడు దర్శకుడు. ఫ్యూడలిజం, పర్యావరణ పరిరక్షణ, అటవీ భూమి ఆక్రమణల గురించి చెబుతూనే.. జానపద సాహిత్యం, భూత కోల, దైవారాధన, నాగారాధన, కంబళ వంటి స్థానిక సంస్కృతులను చూపిస్తాడు దర్శకుడు.

సినిమా మెుత్తం కలర్‌ఫుల్‌గా ఉంటుంది. అజనీష్ లోక్‌నాథ్ నేపథ్య సంగీతం కొన్ని సందర్భాల్లో రోమాలు నిక్కబొడుచుకుంటాయి. సినిమాటోగ్రాఫర్ అరవింద్ కశ్యప్ పనితనం కనిపిస్తుంది. కంబళ సన్నివేశాల చిత్రీకరణ అద్భుతంగా తీశారు. చివరి 20 నిమిషాలు సినిమా మిమ్మల్ని ఎంతగానో ఆకట్టుకుంటుంది. కొత్త అనుభూతిని కలిగిస్తుంది.

IPL_Entry_Point