Kantara Box office collections: తిరుగులేని కాంతారా.. కలెక్షన్లలో కొత్త రికార్డు-kantara box office collections break vikrant rona record ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Kantara Box Office Collections: తిరుగులేని కాంతారా.. కలెక్షన్లలో కొత్త రికార్డు

Kantara Box office collections: తిరుగులేని కాంతారా.. కలెక్షన్లలో కొత్త రికార్డు

HT Telugu Desk HT Telugu
Oct 20, 2022 10:58 AM IST

Kantara Box office collections: కన్నడ మూవీ కాంతారాకు అసలు తిరుగు లేకుండా పోతోంది. కలెక్షన్లలో సరికొత్త రికార్డులు సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తోంది.

<p>కాంతారా మూవీలో రిషబ్ శెట్టి</p>
కాంతారా మూవీలో రిషబ్ శెట్టి

Kantara Box office collections: ఇప్పుడు చిన్న, పెద్ద సినిమా అన్న తేడా లేదు. భాషా భేదాలు లేవు. కంటెంట్ నచ్చిందంటే చాలు.. ఏ సినిమాను అయినా ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. కలెక్షన్ల వర్షం కురిపిస్తూ బ్రహ్మరథం పడుతున్నారు. అందుకే తాజా ఉదాహరణ కాంతారా. ఈ కన్నడ మూవీ సెప్టెంబర్‌ 30న రిలీజైనప్పటి నుంచీ గత మూడు వారాలుగా బాక్సాఫీస్‌ రికార్డులను బ్రేక్‌ చేస్తూనే ఉంది.

తాజాగా 20వ రోజు కూడా మరో రికార్డును సొంతం చేసుకుంది. ఇప్పుడు కాంతారా కన్నడ సినిమా ఇండస్ట్రీలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల జాబితాలో మూడోస్థానానికి చేరింది. ఈ క్రమంలో గత రెండు రోజుల వ్యవధిలోనే రెండు పెద్ద కన్నడ సినిమాల రికార్డులను తిరగరాసింది. ఈ ఏడాదే రిలీజై కిచ్చా సుదీప్‌ మూవీ విక్రాంత్‌ రోణ (రూ.158 కోట్లు), పునీత్‌ రాజ్‌కుమార్‌ చివరి సినిమా జేమ్స్‌ (రూ.151 కోట్లు) రికార్డులను కాంతారా అధిగమించింది.

ట్రేడ్‌ వర్గాల సమాచారం ప్రకారం.. అక్టోబర్‌ 19 నాటికి కాంతారా మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.170 కోట్లు వసూలు చేసింది. అందులో రూ.150 కోట్లకుపైగా కేవలం ఇండియన్‌ మార్కెట్‌ నుంచే రావడం విశేషం. ఇక ఈ సినిమా కన్నడలో హిట్‌ కావడంతో తెలుగు, తమిళం, హిందీల్లోనూ రిలీజ్‌ చేసిన విషయం తెలిసిందే. 20వ రోజు కూడా ఈ మూవీ రూ.10 కలెక్షన్లతో రికార్డు సృష్టించింది.

ఇప్పుడు కేజీఎఫ్‌ 2 (రూ.1207 కోట్లు), కేజీఎఫ్‌ (రూ.250 కోట్లు) తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన కన్నడ మూవీగా కాంతారా నిలిచింది. ఈ సినిమా రిలీజైన సమయంలో అసలు ఇన్ని బాక్సాఫీస్‌ రికార్డులను బ్రేక్‌ చేస్తుందని ఎవరూ ఊహించలేదు. అసలు ఈ మూవీకి పెద్దగా ప్రమోషన్లు కూడా లేవు. సినిమా బాగుంది అన్న మౌత్‌ పబ్లిసిటీయే ఈ సినిమాకు కాసుల వర్షం కురిపించింది.

ఇప్పుడున్న దూకుడు చూస్తుంటే.. కాంతారా రూ.200 కోట్ల క్లబ్‌లో చేరడం ఖాయం. ఇక రూ.250 కోట్లు దాటి కేజీఎఫ్‌ రికార్డును బ్రేక్‌ చేస్తుందా లేదా అన్నదే చూడాలి. ఇప్పటికీ ఈ సినిమాకు ఉన్న క్రేజ్‌ చూస్తుంటే ఆ రికార్డు కూడా సాధ్యమే అని ట్రేడ్‌ అనలిస్ట్‌లు అంచనా వేస్తున్నారు. రిషబ్‌ శెట్టి డైరెక్ట్‌ చేసి లీడ్‌ రోల్‌లో నటించిన కాంతారా మూవీ కోస్తా కర్ణాటక సంస్కృతి, సాంప్రదాయాలకు అద్దం పట్టింది.

Whats_app_banner