Indian 3: ఇండియన్ 3 కూడా ఉంది.. షూటింగ్ పూర్తి.. కన్ఫర్మ్ చేసిన కమల్ హాసన్
Kamal Haasan About Indian 3 Movie: యూనివర్సల్ హీరో కమల్ హాసన్ తాజాగా తన సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ ఇచ్చారు. వాటిలో ఇండియన్ 2, థగ్ లైఫ్, కల్కి 2898 ఏడీ సినిమాలతోపాటు ఇండియన్ 3 మూవీ కూడా ఉన్నట్లు చెప్పుకొచ్చారు కమల్ హాసన్.
Kamal Haasan About Indian 3 Movie: లోక నాయకుడు కమల్ హాసన్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇటీవల విక్రమ్ సినిమాతో సాలిడ్ కమ్ బ్యాక్ హిట్ కొట్టిన ఆయన ఇప్పుడు తన తదుపరి చిత్రాలపై ఫోకస్ పెట్టారు. ఇక గతేడాది అంటే 2023లో కమల్ హాసన్ ఒక్క సినిమాను కూడా విడుదల చేయలేదు. దీంతో కమల్ తన తర్వాతి సినిమాలపై ఆసక్తి నెలకొంది. అయితే, కమల్ హాసన్ లైనప్‌లో అన్నీ భారీ, ప్రతిష్టాత్మక సినిమాలే ఉన్నాయి.
ఇండియన్‌కు మూడో పార్ట్
అయితే, తాజాగా ప్రభాస్ కల్కి 2898 ఏడీ సినిమాలో తాను విలన్‌గా చేయాట్లేదంటూ పెద్ద బాంబ్ పేల్చిన కమల్ హాసన్ తన మిగతా సినిమాల గురించి తాజాగా ఓ మీడియా సంస్థకు వివరించారు. 2024 సంవత్సరంలో మీ సినిమాల లైనప్ ఏంటీ అని అడిగిన ప్రశ్నకు ఇండియన్ (భారతీయుడు) ఫ్రాంచైజీలో రెండో భాగంతోపాటు మూడో పార్ట్ కూడా ఉంటుందని కమల్ హాసన్ చెప్పుకొచ్చారు. ఇది కమల్ హాసన్ ఫ్యాన్స్‌కు చాలా పెద్ద గుడ్ న్యూస్. దీంతో ఆయన అభిమానులు పండుగ చేసుకుంటున్నారు.
టైమ్ వేస్ట్ చేయడం
2024 సినిమాలతోపాటు 2023లో సినిమాలు చేయకపోవడానికి గల కారణాలు కూడా కమల్ హాసన్ తెలిపారు. "నాకు సమయం వృథా చేయడం నచ్చదు. అలా అని ప్రొడక్షన్‌లో స్పీడ్ పెంచలేం కదా. మేము ఇండియన్ 2, ఇండియన్ 3 సినిమాలపై పని చేస్తున్నాం. ఇండియన్ 2, ఇండియన్ 3 చిత్రాల షూటింగ్ పూర్తి అయింది. ఇండియన్ 2 పోస్ట్ ప్రొడక్షన్ పనులను మొదలు పెట్టాం. దీని తర్వాత మిగతా సినిమాలపై దృష్టి పెట్టే అవకాశం ఉంది" అని కమల్ హాసన్ తెలిపారు.
బ్లాక్ బస్టర్ హిట్ సీక్వెల్
కమల్ హాసన్ కల్కిలో తన పాత్రపై, థగ్ లైఫ్ సినిమాపై అప్డేట్ ఇచ్చారు. "థగ్ లైఫ్ సినిమా క్యాంపేన్ బహుశ (ఇండియన్ 2 పోస్ట్ ప్రొడక్షన్స్) తర్వాత స్టార్ట్ చేస్తాం. అలాగే నేను కల్కి 2898 ఏడీ మూవీలో గెస్ట్ రోల్ చేస్తున్నాను. కాబట్టి నా పనులన్నింటిని త్వరగా పూర్తి చేసుకోవాలి" అని కమల్ హాసన్ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ఇండియన్ 2 సినిమాను కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇండియన్ 2 మూవీ 1996లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన ఇండియన్ (భారతీయుడు)కు సీక్వెల్‌గా వస్తోంది.
ఇండియన్ 3 గురించి
భారతీయుడు సినిమాలో కమలర్ హాసన్ సేనాపతి అనే ఫ్రీడమ్ ఫైటర్ రోల్‌లో నటించారు. అవినీతిని అరికట్టేందుకు సేనాపతి ఏం చేశాడనే కథాంశంతో సాగుతుంది. ఇక కమల్ హాసన్-శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న ఇండియన్ 2 సినిమాలో ఎస్‌జే సూర్య, కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, సిద్ధార్థ్, ప్రియా భవానీ శంకర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక ఇండియన్ 3 సినిమాకు సంబంధించి ఎలాంటి వివరాలు అధికారికంగా రాలేదు.
36 ఏళ్ల తర్వాత
కాగా కమల్ హాసన్ నటిస్తున్న మరో మూవీ థగ్ లైఫ్‌ను మణిరత్నం డైరెక్ట్ చేస్తున్నారు. కమల్-మణిరత్నం 36 ఏళ్ల తర్వాత మరోసారి కలిసి పని చేస్తున్నారు. ఈ సినిమాలో త్రిష, గౌతమ్ కార్తీక్, మలయాళ పాపులర్ నటుడు జోజు జార్జ్, ఐశ్వర్య లక్ష్మీ, నాజర్ కీలక పాత్రలు చేస్తున్నారు. ఇక పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కల్కి 2898 ఏడీ సినిమాకు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించగా.. దీపికా పదుకొణె, దిశా పటానీ హీరోయిన్స్‌గా చేస్తున్నారు. బిగ్ బి అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.