Kamal Haasan on Hindu Religion: చోళుల కాలంలో హిందూ మతం ఎక్కడిది: కమల్ హాసన్‌-kamal haasan on hindu religion says there is no term called hindu at the time of raja raja chola ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Kamal Haasan On Hindu Religion: చోళుల కాలంలో హిందూ మతం ఎక్కడిది: కమల్ హాసన్‌

Kamal Haasan on Hindu Religion: చోళుల కాలంలో హిందూ మతం ఎక్కడిది: కమల్ హాసన్‌

HT Telugu Desk HT Telugu
Oct 07, 2022 01:17 PM IST

Kamal Haasan on Hindu Religion: చోళుల కాలంలో హిందూ మతం ఎక్కడిది అంటూ తమిళ సూపర్‌ స్టార్‌ కమల్ హాసన్‌ చేసిన కామెంట్స్‌ వివాదానికి దారి తీశాయి. ఇంతకీ అతడు ఇలాంటి కామెంట్స్‌ ఎందుకు చేశాడు?

<p>పొన్నియిన్ సెల్వన్ మూవీ చూసిన తర్వాత విక్రమ్, కార్తీలతో కమల్ హాసన్</p>
పొన్నియిన్ సెల్వన్ మూవీ చూసిన తర్వాత విక్రమ్, కార్తీలతో కమల్ హాసన్

Kamal Haasan on Hindu Religion: ఇండియన్‌ సినిమా గర్వించదగిన డైరెక్టర్‌ మణిరత్నం ఈ మధ్యే తీసిన పొన్నియిన్ సెల్వన్‌ మూవీ రాజ రాజ చోళుని చుట్టూ తిరిగే కథ అని తెలుసు కదా. అయితే ఈ సినిమా రిలీజైన తర్వాత తమిళ డైరెక్టర్‌ వెట్రిమారన్‌ చేసిన కామెంట్స్‌ వివాదమయ్యాయి. అసలు రాజ రాజ చోళుడు హిందూ రాజే కాదని అతడు అన్నాడు. ఆ మూవీ రిలీజైన మరుసటి రోజే వెట్రిమారన్‌ ఈ కామెంట్స్ చేశాడు.

"రాజ రాజ చోళన్‌ అసలు హిందూ కాదు. కానీ వాళ్లు (బీజేపీ) మా గుర్తింపును దొంగిలించాలని చూస్తున్నారు. వాళ్లు ఇప్పటికే తిరువల్లువర్‌ను కాషాయీకరించడానికి ప్రయత్నించారు. మనం ఎప్పటికీ అది జరగకుండా చూడాలి" అని వెట్రిమారన్‌ అన్నాడు. అయితే ఇప్పుడు వెట్రిమారన్‌ కామెంట్స్‌ను సపోర్ట్‌ చేస్తూ మాట్లాడాడు తమిళ సూపర్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌.

అసలు ఆ సమయంలో హిందూ మతమే లేదని కమల్ అన్నాడు. "రాజ రాజ చోళుని సమయంలో అసలు హిందూ మతం అన్న పేరే లేదు. అప్పుడు వైష్ణం, శైవం మాత్రమే ఉన్నాయి. వాళ్లందరినీ కలిసి ఏమని పిలవాలో తెలియని బ్రిటీషర్లు హిందూ అనే పదాన్ని కనిపెట్టారు. తుత్తుకూడిని వాళ్లు ట్యూటికోరిన్‌గా ఎలా మార్చారో ఇదీ అంతే" అని కమల్‌ హాసన్‌ అనడం గమనార్హం.

అయితే అప్పుడు వెట్రిమారన్‌, ఇప్పుడు కమల్‌హాసన్‌ చేసిన కామెంట్స్ వివాదాస్పదమయ్యాయి. వెట్రిమారన్‌పై బీజేపీ తీవ్రంగా మండిపడింది. రాజ రాజ చోళ హిందూ రాజే అని బీజీపీ నేత హెచ్‌ రాజా అన్నారు. "నాకు వెట్రిమారన్‌కు తెలిసినంత చరిత్ర తెలియదు కానీ రాజ రాజ చోళుడు నిర్మించిన రెండు చర్చిలు, మసీదుల గురించి అతను మాట్లాడితే బాగుంటుంది. రాజ రాజ చోళుడు తనను తాను శివపాద శేఖరన్‌గా చెప్పుకున్నాడు. మరి అతడు హిందూ కాకపోతే ఎవరు?" అని ప్రశ్నించారు.

తమిళనాడులో రాజ రాజ చోళుడిపై విమర్శలు, వివాదాలు ఇదే కొత్త కాదు. 2019లోనూ మరో తమిళ డైరెక్టర్‌ పా రంజిత్‌.. ఆ రాజుపై విమర్శలు గుప్పించాడు. రాజ రాజ చోళుని కాలంలో దళితులపై ఎన్నో అరాచకాలు జరిగాయని, వాళ్ల నుంచి భూములు లాక్కొన్నారని, వాళ్లను అణచివేశారని అప్పట్లో పా రంజిత్‌ ఆరోపించాడు.

Whats_app_banner